అందమైన ఆధ్యాత్మిక కేంద్రం ఋషికేశ్ –TNI ప్రత్యేకం


భారతదేశంలో అందమైన, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాల్లో ఋషికేశ్ అగ్ర స్థానంలో నిలుస్తోంది. హరిద్వార్, ఋషికేశ్, కంకాల్, నీలకంటేశ్వర్ అన్నీ కలిసే ఉంటాయి. హరిద్వార్ రైల్వే స్టేషన్ కు 25కిలో. మీ. దూరంలో ఋషికేశ్ నుండి శివుడు తపస్సు చేసిన నీలకంటేశ్వర్ మరొక 25కి.మీ దూరంలో ఉంది. జీవితంలో ప్రతి ఒక్కరు చేయాలని భావించే చార్ ధాం యాత్ర హరిద్వార్, ఋషికేశ్ ల నుండి ప్రారంభమవుతుంది. చాలా పవిత్రమైన గంగా నది హిమాలయాల్లో పుట్టినప్పటికీ ప్రత్యక్ష దర్శనం ఋషికేశ్, హరిద్వార్ నుండే ప్రారంభమవుతుంది. గంగానది ఇక్కడ ప్రశాంతంగా ఏవిధమైన కాలుష్యానికి గురి కాకుండా ప్రవహిస్తూ దర్శనమిస్తుంది.
*ఇరవై సంవత్సరాల అనుబంధం
ఈ అందమైన ఆధ్యాత్మిక ప్రదేశంతో నాకు, నా కుటుంబ సభ్యులకు ఇరవై ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. దాదాపు ప్రతిసంవత్సరం ఒక్కో పర్యాయం సంవత్సరానికి రెండు సార్లు హరిద్వార్, ఋషికేశ్ కు వెళ్ళడం మాకు, మా కుటుంబ సభ్యులకు ఆనవాయితీగా వస్తోంది. దానిలో భాగంగానే గత వారంరోజుల నుండి అక్కడ పర్యటించి వచ్చాము.


**శివానంద ఆశ్రమంతో అనుబందం
హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఋషికేశ్ లోని ‘రాం జూలా’ సమీపంలో తొంభై ఎకరాల విస్తీర్ణంలో శివానంద స్వామీ ‘దివ్య జీవన సంఘం’ పేరుతొ ‘శివానంద ఆశ్రమాన్ని’ దాదాపు వంద సంవత్సరాల క్రితం నెలకొల్పారు. ఈ ఆశ్రమం సందర్శించే వారికి అక్కడ అన్నీ సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. దీనితో పాటు ఒక డెబ్భై సంవత్సరాల నుండి ఈ ఆశ్రమంలో యోగాలో రెండు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తారు. కొన్ని లక్షల మంది యోగాలో ఈ ఆశ్రమం ద్వారా శిక్షణ పొందారు. శివానంద స్వామీ అనుచరుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా ఒకరు. అబ్దుల్ కలాం రాసిన తన ఆత్మ కధ ‘THE WINGS OF THE FIRE’ లో ఈ ఆశ్రమాన్ని గురించి, శివానంద స్వామి గురించి ప్రత్యేక ప్రస్తావన చేసారు. ఈ ఆశ్రమానికి ప్రస్తుతం జనరల్ సెక్రటరిగా ఉన్న ‘స్వామీ పద్మనాభానంద’ తో నాకు ఇరవై సంవత్సరాల నుండి పరిచయం ఉంది. ఈసారి ఆయనతో ప్రత్యేకంగా ఎప్పటిలాగానే భేటీ అయ్యాం. (ఈ ఆశ్రమం గురించి సమగ్రంగా మరొకసారి వివరిస్తాను.) ఆశ్రమం ఒడ్డునే ఉన్న గంగా నదిలో ఉదయం స్నానం చేయడం సాయంత్రం మన తెలుగువారైన స్వామీ హంసానంద ఆద్వర్యంలో నిర్వహించే గంగా హారతికి హాజరుకావటం మా ఋషికేశ్ పర్యటనలో సర్వసాధారణం. ఈసారి కూడా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాను.


**ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదకరమైన నీలకంటేశ్వర యాత్ర
రాక్షసుల బారి నుండి దేవతలను కాపాడడం కోసం హాలాహలాన్ని కంటంలో భద్రపరుచుకున్న పరమశివుడు ఉపశమనం కోసం హిమాలయాల్లో తపస్సు చేశాడు. అక్కడ మెడ ఆకారంలో ఉన్న శివలింగంలో ప్రత్యక్షమయ్యాడు. దానినే ‘నీలకంటేశ్వర్’ అని పిలుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ఆ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించాము. ఋషికేశ్ నుండి లక్ష్మణ జూల మీదుగా 26కి.మీ గంగానది ఒడ్డునే ఎత్తైన కొండల మధ్య ఈ క్షే త్రానికి చేరుకోవడం ఓ మధురమైన అనుభూతి. హరిద్వార్ లో మానసాదేవి దర్శనం హరికిపడిలో గంగా హారతిని వీక్షించడం మధురమైన అనుభూతి. ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో హరిద్వార్ లో ఇచ్చే గంగా హారతికి వేలాది మంది భక్తులు హాజరువుతూ ఉంటారు.


**ప్రతి ఏడాది ఋషికేశ్ వెళ్ళే సమయంలో శ్రీకృష్ణుడు జన్మస్థలమైన మధురలో దిగడం రాధాకృష్ణుల దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ పర్యాయం కూడా కొన్ని గంటలపాటు మధురలో గడిపి దర్శనం చేసుకున్నాం. శ్రీకృష్ణుడు జన్మించిన ‘జైలు గది’ని కూడా సందర్శించాము. భాజపా అగ్రనేత అద్వానీ కూడా ఋషికేశ్‌లో పర్యటించారు. ఆయనను కూడా నేను కలిశాను.
**తిరుగు ప్రయాణంలో డిల్లీలో ఆంధ్రా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం, వైకాపా ఎంపీలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను తిలకించి వారికి మా సంఘీభావాన్ని ప్రకటించాము.మధుర, హరిద్వార్, ఋషికేశ్ సందర్శించే యాత్రికుల కోసం ప్రత్యేక సమాచారాన్ని అక్కడ ఉన్న సదుపాయాలను ఉచిత భొజన, వసతి సౌకర్యాల గురించి త్వరలో TNIలో సవివరంగా ఉంచుతాం. –కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.







More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com