అక్షయం అంటే నశించనిది-తరగనిది

అక్షయం అంటే నశించనిది, తరగనిది. తరగని సంపదలను ఇచ్చే రోజుగా, వార వర్జ్యాలతో నిమిత్తం లేకుండా ఏ పనినైనా ప్రారంభించడానికి మంచి రోజుగా అక్షయ తృతీయను పరిగణిస్తారు.అక్షయ తృతీయగా వ్యవహారంలో ఉన్న వైశాఖ శుద్ధ తదియకు పౌరాణికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. త్రేతాయుగం అక్షయ తదియ రోజునే ప్రారంభమైందని పురాణాలు
చెబుతున్నాయి. శ్రీరామునికి ముందు అవతారమైన పరశురాముడు పుట్టినది కూడా ఈ రోజేనని స్కాంద పురాణం పేర్కొంటోంది. ప్రహ్లాదుడిని నృసింహావతారంలో విష్ణుమూర్తి కరుణించిన రోజు కూడా ఇదేనంటారు.
**సింహాద్రిలో నిజరూపం!
బృందావనంలో పాద దర్శనం విశాఖపట్నం సమీపంలోని సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నారసింహస్వామి నిజరూపంలో ఈ రోజు దర్శనమిస్తాడు. కాబట్టి ఈ రోజున మహావిష్ణువును ఏ అవతారంలో పూజించినా మంచి ఫలితం ఉంటుందన్నది పెద్దల మాట. కుబేరుడికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించిన రోజుగా దీన్ని భావిస్తారు. అందుకే లక్ష్మీదేవిని ‘అక్షయ తృతీయ’నాడు ఆరాధిస్తారు. గంగానది భువిని చేరుకున్న రోజు, ఆదిశంకరులు కనకధారాస్తవం చెప్పిన రోజు, మహాభారతానికి వ్యాస మహర్షి శ్రీకారం చుట్టిన రోజు వైశాఖ శుధ్ధ తదియేనని చెబుతారు. ఒరిస్సాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర కోసం రథ నిర్మాణ పనులు ఈ రోజు మొదలవుతాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అక్షయ తదియకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. దీన్ని ఆ ప్రాంతాల్లో ‘అఖా తీజ్‌’ అంటారు. బృందావనంలో ఉన్న ఆలయాల్లో ‘బంకే బిహారి’ ఆలయం ఒకటి. ఆ ఆలయంలో శ్రీ కృష్ణుడి పాదాలను దర్శించే అవకాశం ఈ రోజు మాత్రమే ఉంటుంది.
**జైనులకు కూడా పవిత్రం
హిందువులే కాదు జైనులు కూడా దాన్ని పవిత్ర దినంగా పాటిస్తారు. ఇరవై నలుగురు తీర్థంకరుల్లో మొదటివాడైన ఆదినాథుడు లేదా రిషభదేవుడు ఏడాదిపాటు చేసిన నిరాహర దీక్షను చెరుకురసం తాగి విరమించిన రోజు ఇది. దానికి గుర్తుగా జైనులు ఉపవాసం ఉంటారు. చెరుకు రసం తాగి దాన్ని విరమిస్తారు. ఈ రోజున దానధర్మాలు, యజ్ఞయాగాల్లాంటి పుణ్యకార్యాలు అక్షయమైన ఫలాన్ని ఇస్తాయన్న విశ్వాసం ఉంది. ముఖ్యంగా ఇది వేసవి కాలంలో వస్తుంది కనుక జలదానం, అన్నదానం, ఛత్ర (గొడుగు) దానం, పాదుకా (చెప్పులు) దానం, పాత్రల దానం లాంటివి అభ్యాగతులకు చేయడం ఉత్తమమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com