అఖిలేష్ గెలిచాడు

సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న ‘సైకిల్‌’ చిక్కుముడి వీడింది. పార్టీ గుర్తు తండ్రిదా? కొడుకుదా? అన్న సందిగ్ధానికి తెరదించుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. పార్టీ గుర్తు ‘సైకిల్‌’ యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌కే చెందుతుందని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. పార్టీ అధ్యక్షుడు కూడా ఆయననే ఈసీ పేర్కొంది. అంతకుముందు పార్టీలో ఏర్పడిన విభేదాల కారణంగా తండ్రీకొడుకులిద్దరూ పార్టీ గుర్తు విషయంలో ఈసీ తలపుతట్టిన విషయం తెలిసిందే. ఈసీ తాజా నిర్ణయంతో సైకిల్‌ గుర్తుపై పోటీకి అఖిలేశ్‌ వర్గానికి మార్గం సుగమం కాగా.. పార్టీ వ్యవస్థాపకుడైన ములాయంకు ఎదురుదెబ్బ తగిలింది. బాబాయ్‌, అబ్బాయ్‌ల మధ్య మొదలైన పోరు.. చివరికి పార్టీ చీలికకు దారి తీసింది. ఎన్నికల అభ్యర్థుల ప్రకటన విషయంలో తలెత్తిన అభిప్రాయ భేదాలు చిలిచిలికి గాలివానలా మారాయి. బాబాయ్‌ శివ్‌పాల్‌యాదవ్‌ ప్రకటించిన పేర్లను తోసిరాజని అఖిలేశ్‌ మరికొన్ని పేర్లను సూచించడంతో వివాదం మొదలైంది. పార్టీ క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించారన్న కారణంతో పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్‌ యాదవ్‌.. అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు పార్టీ నేత రాంగోపాల్‌ యాదవ్‌పై వేటు వేశారు. పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు. అనంతరం అఖిలేశ్‌పై బహిష్కరణ ఎత్తివేశారు. అనంతరం జనవరి 1న లఖ్‌నవూలో అఖిలేశ్‌ మద్దతుదారులు ఎస్పీ జాతీయ సదస్సును ఏర్పాటు చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్‌ యాదవ్‌ను ఎన్నుకున్నారు. ములాయంను పదవీచ్యుతుడిని చేశారు. దీంతో రెండుగా చీలిపోయిన పార్టీ వర్గాల మధ్య సయోధ్య జరుగుతున్నట్లు కనిపించినా ఎవరి వాదన వారిదేనన్నట్లు ముందుకు నడిచారు. ఈ నేపథ్యంలో చివరికి ఇరు వర్గాలు ‘సైకిల్‌’ కేటాయింపుపై ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. ఈ మేరకు పార్టీ గుర్తు తమదంటే తమదని వినతిపత్రాలు సమర్పించాయి. దీంతో తొలుత పార్టీ గుర్తును స్తంభింపజేయాలని యోచించిన ఈసీ చివరికి తనయుడుకే పార్టీ గుర్తును కేటాయించి ములాయంకు షాకిచ్చింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com