అగ్ర దేశాలు మాతృభాషను మరిచిపోలేదు-జస్టిస్ రమణ

దిల్లీ తెలుగు అకాడమి(డీటీఏ) 30వ ఉగాది పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు, ఉదయశంకర్‌ అవాస్తిలను డీటీఏ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌తో పాటు మరో ఏడుగురికి ‘ఉద్యోగ రతన్‌’, ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్‌, ఎంఎం శ్రీలేఖ, డాక్టర్‌ సుధారాణితో పాటు మొత్తం 8 మందికి ‘ప్రతిభా భారతి’ పురస్కారాలను ప్రదానం చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ మాతృభాషలో పట్టు సంపాదించుకోవాలని.. ఇతర భాషలను నేర్చుకోవాలని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు మాతృభాషను నేర్పించాలన్నారు. ఇటీవల చాలా మంది తాము వృత్తిలో రాణించాలంటే ఇంగ్లీష్‌ ప్రావీణ్యం కావాలంటున్నారని.. అది కొంత వాస్తవమే అయినప్పటికీ మాతృభాషను నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రపంచంలో ఆర్థికంగా, నాగరికంగా అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో తమ మాతృభాషను నిర్లక్ష్యం చేయడం లేదని చెప్పారు. వారు జీవనోపాధి కోసం మాత్రమే ఆంగ్ల భాష నేర్చుకుంటున్నారని వివరించారు. దిల్లీ తెలుగు అకాడమికి శాశ్వత భవనం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతలు శైలజా కిరణ్‌, జగపతిబాబు, రమ్యకృష్ణ తదితరులు తమను అవార్డుతో సత్కరించిన దిల్లీ తెలుగు అకాడమికి కృతజ్ఞతలు తెలిపారు.

‘దేశ రాజధాని దిల్లీ నగరంలో తెలుగు వికాసానికి కృషి చేస్తున్న దిల్లీ తెలుగు అకాడమి నిర్వహిస్తున్న ఈ పురస్కారాల కార్యక్రమానికి హాజరుకావడం సంతోషంగా ఉందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా సమష్ఠిగా పండగలను జరుపుకోవడానికి ఇష్టపడతారని చెప్పారు. సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు పండగలు దోహదం చేస్తాయన్నారు. భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ విశిష్టమైనదని… మన సంస్కృతి ఇతర దేశాలకు భిన్నమైనదని చెప్పుకొచ్చారు. మన కుటుంబ వ్యవస్థ ఎంతో ప్రత్యేకమైనదని.. దసరా నవరాత్రులు, వినాయక ఉత్సవాలు వంటివి నిర్వహించుకోవడం.. దేవాలయాల్లో ఒకరిని ఒకరు కలుసుకోవడం వంటివి మనుషుల మధ్య ఉన్న అడ్డు తెరలను తొలిగించుకునేందుకు తోడ్పడతాయన్నారు. ఎన్నో ఏళ్లుగా దిల్లీలో ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తున్న మోహన్‌ కందా తదితర దిల్లీ తెలుగు అకాడమి సభ్యలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. జీవితంలో ఏదో ఒకరంగంలో మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచినవారిని సన్మానించుకోవడం చాలా సంతోషకరమని.. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలంతా జీవితంలో తమ ప్రతిభను మరికొందరికి పంచారని.. తమలో ఉన్న ప్రత్యేకతను చాటుతూ రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలవడం అభినందనీయమన్నారు. సొంతలాభం కొంత మానుకుని ముందుకెళ్దామని.. సమాజకోసం పనిచేయాలని అనుకోవాలని సూచించారు. మనకు ఉగాదితోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని. పంచాగ శ్రవణంలో మన భవిష్యత్‌ను తెలుసుకుంటామని పేర్కొన్నారు. ఉగాది పచ్చడిలోని చేదు, వగరు వంటివి జీవితంలోనూ ఉంటాయన్నారు. జీవితంలో ఎవరూ విలన్‌ కాకూడదు. సినిమాలో అయితే ఫర్వాలేదంటూ ఛలోక్తి విసిరారు. మన పెద్దవాళ్లు పెట్టిన ప్రతి దాని వెనుకా ఓ సందేశం ఉందని.. వారందించిన వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com