అట్లాంటాలో లోకేష్ పర్యటన

నవ్యాంధ్రలో పెట్టుబడుల కోసం అమెరికాలో మంత్రి నారా లోకేష్‌ పర్యటన విజయవంతంగా సాగుతోంది. అట్లాంటాలో పర్యటిస్తున్న లోకేశ్‌‌ వరుస సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అట్లాంటా సమావేశంతోపాటు ఎన్నారైలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటన అట్లాంటాకు చేరింది. కార్ట్‌టిక్స్‌ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన మంత్రి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుతం 12 శాతంగా ఉన్న రాష్ట్ర వృద్ధిరేటును 15 శాతానికి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నామని వివరించారు. ఈ-ప్రగతి ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి సింగిల్‌ సోర్స్‌ ఆఫ్‌ ట్రూత్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో తెలివైన యువత అందుబాటులో ఉండడంతో వారికి ఆధునాతన సాంకేతికతపై శిక్షణ ఇస్తున్నట్లు లోకేష్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సంస్థ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేయడంతోపాటు 50 శాతం అద్దె సబ్సిడీ కల్పించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్న కార్ట్‌టిక్స్‌ సంస్థ ప్రతినిధులు.. వెంటనే విశాఖలో అద్దె భవనంలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. వందమందితో కార్యకలాపాలు ప్రారంభించి దశల వారీగా ఉద్యోగుల సంఖ్య పెంచుతామని చెప్పారు. కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అట్లాంటా నిర్వహించిన కార్యక్రమంలోనూ మంత్రి లోకేష్‌ పాల్గొన్నారు. పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్‌ తయారీ రంగంలో అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని రాయితీలు, సబ్సిడీలు, పాలసీలు ఇస్తున్న తీరును వారికి వివరించారు. ఎన్నారై తెదేపా సమావేశంలోనూ మంత్రి లోకేష్‌ పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు, ఎల్‌ఈడీ లైట్లు, అండర్‌గ్రాండ్‌ డ్రైనేజీలు, పంచాయతీరాజ్‌ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని లోకేష్‌ వారికి వివరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com