అద్భుత వ్యూహం

రాష్ట్రానికి ఏప్రిల్‌ 5లోపు ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటించకుంటే… ఏప్రిల్‌ 6వ తేదీన తమ లోక్‌సభ సభ్యులంతా రాజీనామా చేస్తారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేసిన ప్రకటన వ్యూహాత్మకమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అప్పటికప్పుడు తమ ఎంపీల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించకుండా, ఆ తర్వాత ఆమోదించినా ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సిన అవసరం రాకుండా ఈ ముహూర్తాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. ‘హోదా’పై తమ ఎంపీలు రాజీనామా చేస్తారని 2016 బడ్జెట్‌ సమావేశాల ముందు జగన్‌ ప్రకటించారు. కానీ చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే. ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సి వచ్చేది.అయితే… ‘మేం రాజీనామాలు చేస్తే హోదా ఇస్తామంటే ఇప్పుడే చేసేస్తాం. రాజీనామాలు చేసేస్తే సభలో ఉండి పోరాడేదెవరు?’ వంటి కారణాలు చూపుతూ ఆ సంగతి పక్కన పెట్టారు. ఇన్నాళ్లకు మళ్లీ… జగన్‌ రాజీనామాల మాట ఎత్తారు. అదీ… పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల ఆఖరి రోజున రాజీనామాలు ఇస్తామన్నారు. అయితే… ఆ రోజు రాజీనామాలు సమర్పించినా వాటిని వెంటనే స్పీకర్‌ ఆమోదించే అవకాశం లేదు. సభ ఆరోజున వాయిదా పడుతుంది. మళ్లీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోపు ఎప్పుడైనా ఆ రాజీనామాలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవచ్చు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం… ఎమ్మెల్యే లేదా ఎంపీల రాజీనామాలు,హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానాలకు ఆరు నెలల్లోపు మళ్లీ ఎన్నిక జరపాల్సి ఉంటుంది. ఏడాదిలోపు సార్వత్రిక ఎన్నికలు ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించరు. వైసీపీ ఎంపీల రాజీనామాలను వర్షాకాల సమావేశాల నాటికి ఆమోదించినా, వాటికి ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేనట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.బీజేపీలో ఇప్పటికే ‘ముందస్తు’ ప్రచారం కూడా జరుగుతోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునేజగన్‌ తమ ఎంపీల రాజీనామాలపై ‘సేఫ్‌ గేమ్‌’ ఆడుతున్నారని పేర్కొంటున్నారు. అంతేకాదు, లోక్‌సభ సభ్యులు మాత్రమే రాజీనామాలు చేస్తారని, రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి రాజీనామా చేసే అవకాశం లేదని పరోక్షంగా చెప్పడం గమనార్హం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com