అధ్యక్షుల వారి సతీమణి కూడా అదో టైపు…

అమెరికా అధ్యక్షుడి సతీమణి మెలానియా ట్రంప్‌ వేసుకున్న ఓ జాకెట్‌ వివాదాలకు కారణమైంది. వలసదారుల చిన్నారులను ఉంచిన శిబిరాన్ని సందర్శించేందుకు ఆమె గురువారం టెక్సాస్‌కు వెళ్లారు. అయితే ఆమె పర్యటనకు వెళ్లేప్పుడు వేసుకున్న జాకెట్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆ జాకెట్‌పై ‘ఐ రియల్లీ డోన్ట్‌ కేర్‌, డూ యూ?’ అని రాసి ఉంది. ఆమె పర్యటన ప్రారంభమైన కొద్దిసేపటికే ఫస్ట్‌లేడీ విమానం ఎక్కుతున్న ఫొటోలు ఇంటర్నెట్‌‌లో ప్రత్యక్షమయ్యాయి. పర్యటన అనంతరం తిరిగి వచ్చేప్పుడు కూడా మెలానియా అదే జాకెట్‌ ధరించారు. అది కేవలం జాకెట్‌ అని, అందులో నిగూఢార్థం ఏమీ లేదని మెలానియా అధికార ప్రతినిధి స్టిఫానీ గ్రిషామ్‌ తెలిపారు. ఇది ముఖ్యమైన పర్యటన అని, మీడియా ఆమె వార్డ్‌రోబ్‌పై కాకుండా చిన్నారులకు సహాయం చేసేందుకు ఆమె చేస్తున్న కృషిపై దృష్టి పెట్టాలని ఆశిస్తున్నానని గ్రీషమ్‌ వెల్లడించారు. మరోవైపు ఆమె అమెరికా ఫస్ట్‌లేడీ అని .. ఆమె ఏం చెప్పినా, ఏం చేసినా, ఏం ధరించినా అది విషయమేనని పలువురు అంటున్నారు. వలస చిన్నారుల దగ్గరికి వెళ్లేప్పుడు ‘నేను పట్టించుకోను’ అని రాసి ఉన్న జాకెట్‌ వేసుకెళ్లడంపై రకరకాలుగా అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. అయితే మెలానియా మాత్రం నిర్బంధ శిబిరాల్లో చిన్నారులకు కల్పిస్తున్న వసతుల గురించి తెలుసుకోవడానికి టెక్సాస్‌కు వెళ్లారు. అక్కడి చిన్నారులను వీలైనంత త్వరగా వారి తల్లిదండ్రులతో కలిపేందుకు తాను ఏవిధంగా సహాయపడగలనని ఆ శిబిరాల నిర్వహకులను అడిగారు. కాగా జాకెట్‌ వివాదంపై మెలానియా స్పందించలేదు. కానీ ట్రంప్‌ స్పందించారు. ఆమె వేసుకున్న జాకెట్‌పై రాసున్న పదాలు ఫేక్‌ మీడియానుద్దేశించినవని చెప్పుకొచ్చారు. మెక్సికో సరిహద్దు వద్ద అక్రమ వలసదారుల నుంచి పిల్లలను వేరు చేసి నిర్బంధ శిబిరాల్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ విధానంతో ట్రంప్‌పై అంతర్జాతీయ విమర్శలతో పాటు భార్య మెలానియా, కూతురు ఇవాంకల నుంచి కూడా తీవ్ర ఒత్తిడితో రావడంతో ట్రంప్‌ వెనక్కి తగ్గారు. పిల్లలను వేరు చేసే విధానానికి స్వస్తి పలుకుతూ కార్యనిర్వహక ఉత్తర్వులపై సంతకం చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com