అనాథగా అమరజీవి

*అమరజీవి త్యాగంపై నిర్మాణమైన రాష్ట్రం మనది! తెలుగువారికి తొలిసారిగా స్వయం పాలన లభించిన రోజుకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో, అమరజీవి పొట్టి శ్రీరాములు అమరుడైన ఘట్టానికీ అంతే విశిష్టత ఉంది. పొట్టి శ్రీరాములు సాకారం చేసిన ఆంధ్రరాష్ట్రం అవతరణనూ, అనంతరం రూపుదాల్చిన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటునూ నిన్నామొన్నటిదాకా ఒక వేడుకలా తెలుగు జాతి జరుపుకొనేది. నవంబరు 1, అక్టోబరు1లతోపాటు దీక్షాక్షేత్రంలో అమరజీవి కన్నుమూసిన డిసెంబరు 15వ తేదీ నాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేది. అయితే, రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో ఈ సంప్రదాయం కొడిగడుతోంది. నవ్యాంధ్ర ఆవిర్భవించిన జూన్‌ రెండునే అధికారికంగా జరుపుకోవడం కూడా దీనికి ఒక కారణం! దీంతో అమరజీవిని కనీసం ఆయన జయంతి, వర్ధంతినాడూ తలుచుకొనేవారు లేరు. ఆయన స్మారక భవనాన్ని కూడా పట్టించుకొనే నాథులు లేరు. ఫలితంగా చెన్నైలోని రూ. 10కోట్ల తెలుగువారి ఆస్తి ఆలనాపాలనా కరువై అనాథలా మిగిలిపోయింది.
**ఐదేళ్ల నుంచి పైసా లేదు
తొలినాళ్లలో అమరజీవి భవనం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.25 వేలు ఇచ్చింది. ఆ తరువాత రూ.50 వేలు, రూ.లక్ష ఇచ్చారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత దానిని రూ. 2 లక్షలకు పెంచారు. నిజానికి ఈ భవనం నిర్వహణకు నెలకు రూ.25 వేల వరకు ఖర్చవుతుంది. భవనంలో పనులు చేసే నలుగురు సిబ్బందికి రూ.7 వేలు ఇస్తున్నారు. విద్యుత్‌ సరఫరాకు, ఇతర ఖర్చులనూ కలుపుకొంటే.. చాలానే ఖర్చవుతోంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో నిర్వహణ కష్టమే. పైగా ఈ నిధులు కూడా రెండేళ్లకు, మూడేళ్లకు ఒకసారి మంజూరయ్యేవి. కానీ, ఐదేళ్ల నుంచి ఆ మాత్రం సాయమూ అందకుండాపోయింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఈ భవనం కోసం విదల్చలేదు.
**ప్రభుత్వం సాయం మాట ఎలా ఉన్నా, సుబ్రహ్మణ్యశాస్త్రి కుమారుడు వై.రామకృష్ణ ఇప్పటిదాకా తన సొంత డబ్బుతోనే భవనం నిర్వహణ చూస్తూ వస్తున్నారు. తన తండ్రి చివరి కోరిక మేరకు రామకృష్ణ విదేశాల్లోని తన ఉద్యోగం వదులుకుని మరీ ఈ బాధ్యతలు చేపట్టారు. తనకు మరీ కష్టమైన పరిస్థితుల్లో 2005 మార్చిలో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావును రామకృష్ణ కలుసుకొన్నారు. దీనిపై గంటా సానుకూలంగా స్పందించారు. ఏడాదికి రూ.5 లక్షలను కేటాయిస్తామని బహిరంగంగానే ప్రకటించారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.4 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని రామకృష్ణ మంత్రికి గుర్తుచేయగా, మొత్తం రూ.9 లక్షలు త్వరలోనే పంపిస్తామని అప్పట్లో గంటా హామీ ఇచ్చారు. ఆ తరువాత ఏమయిందో తెలియదుగానీ, ఆ నిధులు రాలేదు. 2016లో నాటి సాంస్కృతికశాఖ మంత్రి పల్లె రఘునాఽథరెడ్డిని కలవగా, రూ.10 లక్షలు ఇస్తూ తయారుచేసిన జీవోను భవన నిర్వాహకులకు ఆయన చూపించారు. అయితే ఇప్పటికీ ఆ మొత్తం స్మారక మందిరానికి అందలేదు.
**మేమెందుకు డబ్బులివ్వాలి?
తొలినాళ్లలో ఈ స్మారకమందిరాన్ని రాష్ట్ర ప్రజాపనులశాఖ అధికారులు పర్యవేక్షించేవారు. 15 ఏళ్ల నుంచి సాంస్కృతిక శాఖకు ఈ బాధ్యత బదిలీ అయింది. ఈ శాఖ డైరెక్టర్లుగా వు న్న రేఖ, కవితాప్రసాద్‌, విజయభాస్కర్‌ ఒక్కోమారు వచ్చారు. విజయభాస్కర్‌ నాటి మంత్రి పల్లెతో కలిసి ఈ భవనానికి వ చ్చారు. కానీ ఆయనా లోపలేం చూడకుండానే వెనుదిరిగారు. ఈ భవనం ఏపీ ప్రభుత్వానికి చెందినదన్న విషయం కూడా అ ధికారులకు తెలియదు. ‘‘మీ భవనానికి మేమెందుకు డబ్బులివ్వాలి?’’ అని వారు అడుగుతుండటం విస్తుగొలుపుతోంది.
**దిక్కులేని దీక్షా క్షేత్రం..
స్మారక భవనం కింది మొదటి అంతస్థులో సమావేశ హాలు, మహనీయుల చిత్రపటాలు ఉన్నాయి. రెండో అంతస్థులో అరుదైన పుస్తకాల బాంఢాగారం పలకరిస్తుంది. ఈ భవనంలోని లైబ్రరీలో 18 వేలకు పైగా అరుదైన, పుస్తకాలున్నాయి. ఆలనాపాలనా లేక అవి చెదలు పడుతున్నాయి. కాగా, అమరజీవి మెమోరియల్‌ సొసైటీ పేరుతో ఓ కమిటీ స్మారక భవనం నిర్వహణ చూసేది. 2016 నుంచి ఈ కమిటీలో విభేదాలు ఏర్పడి ఎవరికి వారయ్యారు. తండ్రి తరువాత ఈ భవనం బాగోగులను ఈ కమిటీ సహకారంలో రామకృష్ణ చూస్తున్నారు. ప్రస్తుతం రామకృష్ణ ‘అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి’ అని కొత్త సంస్థను ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థకు అజంతా వక్కపొడి అధినేత కె.శంకరరావు అధ్యక్షుడిగా ఉన్నారు. తమ సంస్థను అధికారికంగా గుర్తించాలని ఏపీ ప్రభుత్వానికి రామకృష్ణ పలుమార్లు లేఖలు రాశారు. కానీ ఈ వ్యవహారంపై రాష్ట్ర సాంస్కృతికశాఖ నుంచి మాత్రం స్పందన లేదు. దీంతో స్మారక భవనానికి నాథుడు కరువయ్యాడు. ఈ సొసైటీ పేరున ప్రస్తుతం రూ.10 లక్షల డిపాజిట్‌ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ భవనం ఆలనాపాలనా చూసేవారు లేరు. నాడు అమరజీవి స్మారకానికి ప్రాణం పోసిన చంద్రబాబే, ఇప్పుడూ ముందుకురావాలని చెన్నైలోని తెలుగువారు కోరుతున్నారు. ప్రభుత్వమే ఒక కమిటీని ఏర్పాటు చేసి, నిర్వహణ కోసం ఏటా రూ.5 లక్షలు అందిస్తేనే, అమరజీవి స్మృతిని నిలుపుకోగలమని అభ్యర్థిస్తున్నారు.
**తెలుగువారి ఆసి
మద్రాసు ప్రెసిడెన్సీలో బులుసు సాంబమూర్తి అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. ఆ కాలంలో ఆయన మైలాపూర్‌ లజ్‌ కార్నర్‌లోని ఓ పెంకుటింట్లో అద్దెకుండేవారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్షకు సంకల్పించిన పొట్టి శ్రీరాములును బులుసు సాంబమూర్తి తన ఇంటికి ఆహ్వానించారు. శ్రీరాములు 1952 డిసెంబరు 15వ తేదీన తుదిశ్వాస విడిచేదాకా ఈ నివాసం కేంద్రంగానే దీక్ష సాగించారు. ఆ పెంకుటింట్లోనే అశువులు బాసి ‘అమరజీవి’గా కీర్తినొందారు. అప్పట్లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న యర్రమిల్లి సుబ్రహ్మణ్యశాస్త్రి చొరవతో ఈ ఇంటిని నాటి పాలకులు స్మారకంగా మార్చాలని నిర్ణయించారు. దానికోసం రెండువేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ పెంకుటిల్లును 1953లో ప్రభుత్వం కొనుగోలు చేసింది. తొలిసారి సీఎం అయిన ఎన్‌టీఆర్‌ ఇక్కడకు రాగా, సుబ్రహ్మణ్యశాస్త్రి ఆయనను కలుసుకొన్నారు. శిథిలావస్థకు చేరిన పెంకుటిల్లును చూపించి, దానిని భవనంగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని విన్నవించారు. అందుకు ఎన్‌టీఆర్‌ అంగీకరించినా ఆ పనులు ఎందుకనో ముందుకు సాగలేదు. చంద్రబాబు తొలిసారి సీఎం అయిన సమయంలో మాత్రమే, సుబ్రహ్మణ్యశాస్త్రి ఆకాంక్ష సాకారం అయింది. పెంకుటిల్లు స్థానంలో భవనం కట్టేందుకు రూ.16 లక్షలను చంద్రబాబు కేటాయించారు. 2001 నుంచి ఈ భవనం అందుబాటులోకి వచ్చింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com