అన్నమయ్య చిత్రంలో తప్పులు

శోభారాజ్‌.. అన్నమాచార్యని సంకీర్తనల ఆలాపనలో ఆమెదో ప్రత్యేకశైలి. నాలుగేళ్ళ వయసులో స్వయంగా పాటలు పాడటం నేర్చుకుని, పదహారేళ్ళకే ఆలిండియా రేడియోలో కళాకారిణిగా ఎంపికై 17 ఏళ్ళ వయసులో నేదునూరి కృష్ణమూర్తి, రాజ్యలక్ష్మి వంటి ఉద్దండుల వద్ద శిక్షణ పొంది, అన్నమయ్య సంకీర్తలగానమే జీవిత ధ్యేయంగా సాగుతూ అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. పుష్కర మహోత్సవాలలో కళావేదికపై తన సంకీర్తనా గానాన్ని వినిపించేందుకు వచ్చారు శోభారాజ్‌.
**అమ్మలో ఆధ్యాత్మికత… నాన్నలో సంస్కారం..
అమ్మలోని ఆధ్యాత్మికత… నాన్నలోని సంస్కారం పరిసరాల ప్రభావాలు నన్ను గాయనిగా తీర్చిదిద్దాయి. వాయిల్పాడులో ప్రారంభమైన నా ప్రస్థానం అన్నమాచార్య సంకీర్తనల ప్రచారమే లక్ష్యంగా సాగుతోంది. 1957 నవంబర్‌ 30న నేను పుట్టాను. అమ్మ రాజ్యలక్ష్మి బాగా పాడుతుంది. నాన్న నారాయణరావు కర్మయోగి. వాయిల్పాడులో ఉన్న వీరరాఘవస్వామి పురాణ దేవాలయంలో అమ్మ నిత్యం పూజలు చేస్తూ ఉండేది. ఈ దేవాలయంపై అన్నమాచార్య అనేక సంకీర్త నలు రాశారు. నా బాల్యం కొంత నేపాల్‌లోనే గడిచింది. ఆ సమయంలో కృష్ణుడి పాటలు పాడేదాన్ని. హైదరాబాద్‌ వచ్చిన తరువాత బాలానందంలో పాడాను.
**అన్నమయ్య వైపే మొగ్గు చూపాను
సినిమాలో పాడే అవకాశాలు వచ్చినపుడు స్నేహితులు ప్రోత్సహించారు. అన్నమాచార్య సంకీర్తనలు మాత్రమేపాడాలా? సినిమా పాటలు కూడా పాడదామా? అనే సందిగ్ధంతో చాలా ఘర్షణకు లోనయ్యాను. చివరకు అన్నమయ్యవైపే మొగ్గాను. అన్న మాచార్య సారస్వతాన్ని ప్రచారం చేయటానికి నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శిష్యరికం చేశాను. భగవంతునిపై ఆరాధనా భావం, వేంకటేశ్వరునిపై ప్రేమ, భక్తి పెరిగాయి. అన్నమయ్య పాటలుపాడుతుంటే నా మనోఫలకంపై ఆ కీర్తనాభావానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్పుటంగా కనిపించేవి. మనసు పెట్టి ఎంత పాడినా అందుకోలేని గంభీరమైన భావాలు కనిపిస్తాయి.
**వేంకటేశ్వరునికి మాటిచ్చాను..
నా జీవితమంతా అన్నమాచార్య సంకీర్తనలు పాడుతూ వేంకటేశ్వరుని సారస్వత ప్రచారం చేస్తానని వేంకటేశ్వరునికి మాట ఇచ్చాను. టీటీడీలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రారంభానికి ముందు అన్నమాచార్య వారుసులను కలిసి వారికి నా పాటలు వినిపించి, తరువాత ఈవోను కలిశాను. నాటి నుంచి అన్నమయ్య సాహిత్యమే లోకంగా.. పాటలే ప్రాణంగా నాలుగేళ్ళపాటు నిర్విరా మంగా సాగింది. దేశం నలుమూలలా సంకీర్తనా ప్రచారాలు చేశాను. 1978లో టీటీడీ గాయనిగా చేరిన నేను తొలిసారి అన్నమాచార్య జయంతి నిర్వహించాను.
**ఆల్బమ్‌కు విశేష ప్రాచుర్యం
1980లో అన్నమాచార్య ప్రాజెక్టు రూపుదిద్దిన వేంకటేశ్వర గీత మాలికలో 15 పాటలు విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. అదివో అల్లదివో, గోవిందాశ్రిత, కొండలలో నెలకొన్న, బ్రహ్మమొక్కడే వంటి పాటలు ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాయి. ప్రముఖ సంగీత విద్వాంసుడు మల్లి స్వరపరిచిన తందనానా అనే పాటలో పల్లవిని పల్లవిగా కాకుండా ఆ కీర్తన ప్రధాన సందేశమైన బ్రహ్మమొక్కడే పరబ్రహ్మమొక్కడే అనే అనుపల్లవిని పల్లవిగా మార్చాను. కీర్తనలోని భావార్ధాలను బట్టి సున్నిత పదాలకు ఆర్ధ్రతతో కూడిన రాగాలను జోడించి చేసిన కొత్తప్రయోగానికి విశేషమైన ఆదరణ లభించింది.
**భద్రాచలం ఎండోమెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా..
టీటీడీలోని అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేస్తున్న నేను నాకు ఎదురవుతున్న కొన్ని ఇబ్బందులు పడలేక నాటి ఈవోకు 16 సార్లు రాజీనామాను ఇచ్చాను. ఎటువంటి సమా ధానం అందలేదు. ప్రాజెక్టు నుంచి విరమిం చుకున్న తరువాత భద్రాచలం ఎండోమెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎంపిక య్యాను. అక్కడ రామదాసు కీర్తనలు పాడాలని ఎండోమెంట్‌ ఆదేశించింది. అన్నమాచార్య సంకీర్తనలు మాత్రమే పాడాలనే నియమాన్ని పెట్టుకున్న నేను కొత్త సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సమయంలో అన్ని దేవాలయాలకు సంబంధించిన భగవంతుని సంకీర్తనలు చేస్తే బాగుంటుందనే విషయాన్ని దేవాదాయ శాఖకు చెప్పి, ఈ కొత్త ప్రాజెక్టును ప్రారంభించాను. ఒక సమ యంలో వేములవాడ సిరిసిల్ల ప్రాంతంలోని ఓ జూనియర్‌ కళాశాల విద్యార్థుల ఆహ్వానం మేరకు పాడేందుకు వెళ్ళాను. అక్కడ నక్సలైట్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని దైవసంబంధిత కార్యక్రమాలు ఎవరూ ఆహ్వానించరనే అపోహను నిజంకాదనేలా నా కార్యక్రమం జరిగింది. ఈ విషయాన్ని ఎండోమెంట్‌ కమిషనర్‌కు వివరించాను. ఆయన మాత్రం ఎవరి అనుమతి తీసుకొని అక్కడికి వెళ్ళి పాడావని తీవ్ర హెచ్చరిక చేశారు. ఆత్మగౌరవం లేని చోట పని చేయలేనని విరమించుకున్నాను.
**భక్తి సంగీతం ద్వారా భావకాలుష్య నివారణ
1983లో అన్నమాచార్య భావనా వాహిని ఏర్పాటుచేసి భక్తిసంగీతం ద్వారా భావకా లుష్యాన్ని నివారించేందుకు 18 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాను. తంజావూరు సరస్వతి లైబ్రరీ నుంచి 39 కీర్తనలు స్వరపరిచాను. అన్నమయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున పోటీలు జరిపాను. సంకీర్తనా ఔషధం అనే పేరుతో మ్యూజిక్‌ థెరపి, ఉపశమన సంకీర్తనల ద్వారా మానసిక ఆత్మస్దైర్యాన్ని నింపే కార్యక్రమాలు చేశాను.
**అన్నమాచార్య సదనం ఏర్పాటు
1998లో హైదరాబాద్‌ మాదాపూర్‌లో రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో సొంత డబ్బుతో అన్నమాచార్య సదనం నిర్మించాను. 2002లో హాలు, 2009లో ఆలయం పూర్తయింది. ప్రస్తుతం కుంబాభిషేకం నిర్వహించాల్సి ఉంది.
**జనం మెచ్చేది జానపద శైలినే..
అన్నమాచార్య సంకీర్తనల ప్రచారం నేను అనుకున్న లక్ష్యానికి చేరుకుంది. సామాన్య మానవుడికి అర్ధమయ్యేలా ఆరాధనా భావంతో ఆ పాటలను పాడుకుంటున్నారు. ఆ సంకీర్తనల్లో జానపదాలు, శృంగారం, భక్తి సంకీర్తనలు అనేకం ఉన్నాయి.
**సినిమా తప్పుదారి పట్టించింది
అన్నమయ్య సినిమాలో అన్నమయ్య పాత్ర, సాళువ నరసింహరాయలు పాత్ర తప్పుదారి పట్టాయి. దర్శకుడు సాళువ రాయలను హాస్య పాత్రగా చిత్రీకరించటం, అన్నమయ్య ఇద్దరు భార్యల వెంట పడటం వంటివి చిత్రీకరించి పాత్రలను తప్పుదారి పట్టించారు. అన్నమయ్య చెప్పుకున్న అంశాలను బట్టి ఆయన జీవితాన్ని అధ్యయనం చేసి 1985లో 108 ఎపిసోడ్‌లతో ఒక సీరియల్‌ రాశాను. దూరదర్శనలో ఆరు ఎపిసోడ్‌లతో మరొకటి నిర్మించాను.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com