అన్నింటికీ రాజీనామా. తొత్తుగా కాకుండా సింహం మాదిరి అడుగేసిన రేవంత్.

కొన్ని గంటల కిందటే తెలుగుదేశం పార్టీ సాధారణ సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్‌ రెడ్డి.. కొడంగల్‌ ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను గట్టిగా విమర్శించిన రేవంత్‌.. తాను పదవిలో ఉండి వేరొక పార్టీలోకి మారితే, అలాంటి విమర్శలనే ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారే విషయంలో మొదటి నుంచీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న రేవంత్‌ తన రాజీనామాపైనా విమర్శలు లేకుండా చూసుకోవాలని భావనలోనే స్పీకర్‌ ఫార్మాట్‌లో రిజిగ్నేషన్‌ను పంపారు. మొదట సొంత నియోజకవర్గం కొడంగల్‌ వెళతారని, అక్కడి కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటిస్తారని వార్తలు వచ్చినా, వాటికి విరుద్ధంగా రేవంత్‌ శనివారం సాయంత్రమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించడం గమనార్హం. రేవంత్‌ రాజీనామాపై స్పీకర్‌ మధుసూదనాచారి స్పందించాల్సిఉంది.

రేవంత్‌ లేఖ పూర్తిపాఠం…..
‘‘‘గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి…. ప్రజలతో ఉండటం నా నైజం. ప్రజల కోసం పోరాడటం నా తత్వం. నా స్వభావానికి తగ్గట్లు ప్రజా జీవితం లోకి వచ్చాను. విద్యార్థి ఉద్యమాల్లో నన్ను ప్రోత్సహించారు. 2006 జెడ్పీటీసీగా, 2007లో స్వతంత్ర్య ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను. ప్రజలకోసం విస్తృతంగా పనిచేయాలనుకున్న నాకు తెలుగుదేశం సరైన వేదిక అని భావించాను. ఇన్నేళ్ల ప్రజా పోరాటాలు నాకు గొప్ప అనుభవాన్నిచ్చాయి. దేశంలో ఏనాయకుడికీ లేని సుదీర్ఘ రాజకీయ, పాలనా అనుభవం ఉన్న మీతో ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేనిది. మీ సారధ్యంలో ప్రజాపోరాటాలలో భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి అడుగులో మీ మార్గనిర్దేశం, కార్యకర్తల మద్దతు నన్ను ప్రజా నాయకుడిగా మలిచాయి. టీడీపీలో చేరిననాటి నుంచి ఈ క్షణం వరకు సిద్ధాంతాలకు, మీ నిర్ణయాలకు కంకణబద్ధుడనై పని చేస్తూ వచ్చాను. మీరు ఇచ్చిన పని తికరణశుద్ధిగా పూర్తిచేసే ప్రయత్నం చేశాను. తక్కువ సమయంలోనే మీరు నాకు గుర్తింపు ఇచ్చారు. సీనియర్లు ఎంతో మంది ఉన్నా కీలక అవకాశాలను పార్టీ నాకు ఇచ్చింది. కార్యకర్తలతో నా అనుబంధం విడదీయరానిది. మీతోపాటు నేను అంతగా అభిమానించేది వాళ్లనే. లక్షల మంది కార్యకర్తలు నన్ను తమ ఇంట్లో మనిషిగా అభిమానించారు. మీ సొంత మనిషిగా గుర్తించి, నన్ను ఆరాధించారు. పోరాటాల్లో నా వెన్నంటి ఉన్నారు. తెలంగాణ కార్యకర్తలను చూస్తే గర్వంగా ఉంటుంది. పార్టీ కోసం ప్రాణాలిచ్చిన వారున్నారు. ఆస్తులు కోల్పోయినవాళ్లున్నారు. భుజాలు కాయలు కాసేలా జెండాలు మోసినవారున్నారు. కుటుంబం కంటే పార్టీనే ప్రాణంగా బతికినవారున్నారు. మీరిచ్చిన ప్రోత్సాహం, వాళ్లిచ్చిన ధైర్యంతోనే నలభై నెలలుగా కేసీఆర్‌ అరాచక పాలనపై పోరుసాగించాను. నా పోరాటాలకు ఎన్టీఆర్‌ కూడా స్ఫూర్తే. తెలంగాణ సమాజంపై ఆయనది చెరగని ముద్ర. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అన్న నందమూరి ఆలోచనకు మించిన సిద్ధాంతం లేదు. సమాజంలో ఆయన నింపివెళ్లిన ఆవేశం ఇంకా ఇంకిపోలేదు. విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. అన్నగారితో నేరుగా అనుబంధం లేకపోయినా పేదోళ్ల బాగుకోసం ఆయన పరితపించిన విధానం నాలో స్ఫూర్తిని నింపింది. తెలగుదేశం కుటుంబంతో నా అనుబంధాన్ని ఎంత వివరించినా తక్కువే. వాస్తవానికి ఈ బంధాన్ని తెంచుకోవడం నాకు గుండెకోతతో సమానం. కేసీఆర్‌ అరాచకాలను టీడీపీ ద్వారానే అంతమొందించాలని కోరుకున్నాను. మీ అందడతో ఆ దిశగా పోరాటం చేశాను. ఈ సందర్భంగా తెలంగాణలో వాస్తవ పరిస్థితులు మీ ముందు పెడుతున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారధ్యంలోని టీఆర్‌ఎస్‌ పాలన ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అమరవీరులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, దళిత గిరిజన మైనారిటీలు, బీసీలు, మహిళలు ఇలా ఏ వర్గాన్ని తట్టి చూసినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వేలమంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఖమ్మంలో అమాయక గిరిజన రైతులకు బేడీలు వేసి నడిరోడ్డుపై నడిపించి, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. భూ సేకరణ పేరుతో మల్లన్నసాగర్‌ ప్రాంతాన్ని రావణకాష్టంగా మార్చారు. వారి దుఃఖాన్ని చూసి పోరాటంలో టీడీపీ అండగా నిలిచింది. నేరెళ్లలో దళిత, బీసీ బిడ్డలపై పోలీసులు అన్యాయంగా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. భూపాలపల్లి జిల్లాలో అనేక ఏళ్లుగా అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేసుకుంటోన్న గిరిజనంపై ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. గుత్తికోయ ఆడబిడ్డల దుస్తులు ఊడదీసి, చెట్లకు కట్టేసి కొట్టిన పరిస్థితులు హృదయవిదారకం. చదువుకున్న విద్యార్థులను నక్సలైట్ల ముద్రతో ఎన్‌కౌంటర్లు చేస్తోన్న ఘటనలు ఆవేదన కలిగించాయి. ప్రజల పక్షాల ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాల ఉనికిని కేసీఆర్‌ సహించలేకపోతున్నారు. ప్రజాస్వామిక హక్కులకు రాష్ట్రంలో చోటులేదు. అత్యున్నత వ్యవస్థలను తన అధికార దర్పానికి కాపలాకాసే సంస్థలుగా మార్చుకున్నారు. తెలంగాణలో ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసం నిరాఘాటంగా సాగుతోంది. ఈ దుర్మార్గాలపై గడిచిన మూడేళ్లుగా అసెంబ్లీలోనూ, వెలుపల టీడీపీ పోరాటం చేస్తోంది. సభలో ప్రజల గొంతుక వినిపించే ప్రతి సందర్భంలో మాపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో అనేక ఉద్యమాలు చేశాం. విద్యార్థిపోరు, ప్రజాపోరు, కార్మికుల పోరు లాంటి ఉద్యమాలతో ప్రజలను చైతన్యపర్చాం. దీంతో నాపై పాలకులు వ్యక్తిగతంగా కక్షగట్టి, అక్రమకేసులతో వేధించిన విషయం మీకు తెలిసిందే. అరెస్టు చేసి జైల్లో పెట్టిన సందర్భంలోనూ నేను వెనకడుగు వేయలేదు. నా బిడ్డ నిశ్చితార్థానికి కోర్టు కొన్ని గంటలు మాత్రమే అనుమతిచ్చిన సందర్భంలోనూ గుండెనిబ్బరం కోల్పోలేదు. ఆ సందర్భంలో నాకు, నా కుటుంబానికి మీరు, భువనేశ్వరి మేడమ్‌ గారు కుటుంబ పెద్దలుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. కష్టాల్లో ఉన్నప్పుడు మీరిచ్చిన మద్దతు మా కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ప్రస్తుతం తెలంగాణ సమాజం అత్యంత ప్రమాదపుటంచుల్లో ఉంది. కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయింది. బంగారు తెలంగాణ ముసుగులో ప్రజాసంపద అడ్డగోలుగా దోపిడీ అవుతోంది. ప్రజలు ఏ ఆకాంక్షలతో స్వరాష్ట్రం కోరుకున్నారో వారి ఆశలు కలలుగానే కరిగిపోతున్నాయి. అమరవీరుల బలిదానాలకు గుర్తింపులేదు. ఈ పరిస్థితిని మార్చడానికి గత మూడేళ్లుగా అనేక పోరాటాలు జరిగాయి. అయితే, తెలంగాణ సమాజం ఏకతాటిపై నిలబడి, కేసీఆర్‌ కుటుంబ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అనివార్యత కనిపిస్తోంది. ఈ సదర్భంలో ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా వారి పక్షాన నిలవడమే ప్రాధాన్యం అని నమ్ముతున్నాను. తెలంగాణ సమాజ హితం కోసం నేను మరింత ఉధృత్వంగా పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. కేసీఆర్‌ కుటుంబం నుంచి తెలంగాణ సమాజానికి విముక్తికల్పించడం బాధ్యతగా భావిస్తున్నాను. తెలంగాణ సమాజం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బలమైన రాజకీయ పునరేకీకరణ కోరుకుంటోంది. నా నిర్ణయాన్ని మీరు ఆ కోణంలోనే చూడండి. ఈ నేపథ్‌యంలో పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి, ప్రాధమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తున్నాను. పార్టీ అధ్యక్షుడిగా, మార్గదర్శిగా మీరు ఇచ్చిన పోరాట పటిమ, స్ఫూర్తి గుండెలనిండా నింపుకొని తెలంగాణ హితం కోసం మరింత విస్తృత పోరాటానికి సిద్ధమవుతున్నాను. అన్యధా భావించక.. నా నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ.. మీ రేవంత్‌ రెడ్డి’’’

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com