‘‘అందరికీ అన్నంపెట్టే అన్నదాతకి గిట్టుబాటు ధర దక్కటం లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటకి రాలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి రైతన్నల ఆవేదనకి దర్పణమే మా చిత్రం’’ అంటున్నారు ఆర్.నారాయణమూర్తి. ఆయన నటిస్తూ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘అన్నదాత సుఖీభవ’ విడుదలకి సిద్ధమైంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమాశంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడారు. ‘‘అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నా. సెన్సారు సర్టిఫికెట్ను జారీ చేయలేదు. జి.ఎస్.టితో పాటు పెద్దనోట్లు రద్దుకి సంబంధించిన సన్నివేశాల్ని తీసేయాలని సెన్సార్ బోర్డు కోరింది. అనుకొన్న సమయానికి విడుదల చేయాలని అందుకు ఒప్పుకొన్నా. మళ్లీ రైతులు, పారిశ్రామికవేత్తల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తున్న సన్నివేశాలకూ సెన్సారు బోర్డు అభ్యంతరం తెలిపింది. ఇలా కోరడం ఎంతవరకు న్యాయం? ప్రధానమైన అంశాన్ని తీసేస్తే సినిమాలో పటుత్వమే ఉండదు. నేను సినిమాలో చూపిన ఈ అంశాలే దినపత్రికల్లో వ్యాసాలుగా వస్తున్నాయి. ప్రసార మాధ్యమాల్లోని చర్చా వేదికల్లోనూ, పార్లమెంట్లోనూ మాట్లాడుతున్నారు… చర్చిస్తున్నారు. నేనూ సినిమా ద్వారా అదే పని చేశా. కానీ అక్కడున్న భావప్రకటనా స్వేచ్ఛ నా సినిమాకి లేదా? ప్రజాస్వామ్య దేశంలో డా।।అంబేడ]్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం అందరికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. దాన్ని హరించే అధికారం ఎవ్వరికీ లేదు. అందుకే నా సినిమాకి న్యాయం జరగాలని కోరుతూ సెన్సార్ కోసం రివైజింగ్ కమిటీ (ఆర్.సి)ని ఆశ్రయిస్తున్నా. తగిన న్యాయం జరుగుతుందనే ఆశ, నమ్మకం ఉంది. ఒకవేళ అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇక కోర్టులే శరణ్యం’’ అన్నారు నారాయణమూర్తి. ‘‘గత ముప్పయ్యేళ్ల నుంచీ ప్రజా సమస్యల నేపథ్యంతో కూడిన చిత్రాలే తీస్తున్నా. ఐదు చిత్రాలకు సెన్సారు చిక్కులు రాగా, ఆర్.సీకి వెళ్లి వాటిని విడుదల చేసుకొన్నా. నా ఆరో సినిమాకి కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. నేను దేశద్రోహిని కాను, దేశభక్తుణ్నే. అయినా ఈ సెన్సారు ఇక్కట్లు తప్పడం లేద’’ని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్.నారాయణమూర్తి.