అన్యాయం ఏమి జరగలేదు

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఎలాంటి అన్యాయమూ జరగలేదని విశాఖ ఎంపీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. కేంద్రం అన్ని విషయాల్లోనూ ఏపీ ప్రయోజనాలను పరిరక్షిస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని, దాని ద్వారా అన్ని విధాలా సాయం చేస్తున్నారని చెప్పారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మిత్రపక్షం తెదేపా నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టమూ లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోందని హరిబాబు తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న అనేక సంస్థలను కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిందన్నారు. ఆయా సంస్థలు ఇప్పటికే పనిచేయడం కూడా ప్రారంభించాయని చెప్పారు. కేవలం 5 అంశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో గిరిజన, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారని, త్వరలో చట్టం చేసి ఆ రెండు సంస్థలను ఏర్పాటు చేస్తారని చెప్పారు. కడప స్టీల్‌ప్లాంట్‌, దుగరాజపట్నం ఓడరేవు, విశాఖ రైల్వే జోన్‌ మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, రానున్న ఏడాదిన్నరలో వాటిపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలకు రూపాయి కూడా తగ్గకుండా కేంద్రం ఆమోదిస్తుందని, తాము కూడా రాష్ట్రానికి నష్టం కలగకుండా ప్రయత్నం చేస్తామని వివరించారు. స్వాతంత్ర్యం తర్వాత కేంద్రం నుంచి ఏ రాష్ట్రానికీ అందని సాయం ఏపీకి లభించిందని, చేసిన సాయం పట్ల కొందరు సంతృప్తి చెందొచ్చు.. కొందరు సంతృప్తి చెందకపోవచ్చని వ్యాఖ్యానించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com