అపూర్వంగా జరిగిన 1966 కాకినాడ సాంకేతిక కళాశాల పట్టభద్రుల స్వర్ణోత్సవాలు

1946లో నెలకొల్పిన కాకినాడ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో 1966 బ్యాచ్‌కు చెందిన పట్టభద్రుల స్వర్ణోత్సవ వేడుకలు JNTUK సమావేశ మందిరంలో జనవరి 28,29 తేదీల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 70ఏళ్లకు పైబడిన పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. 28న జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా JNTUK ఉప కులపతి వి.ఎస్.ఎస్. కుమార్ హాజరయి నాటి కళాశాల వైభవాన్ని, విద్యార్థుల ప్రాభవాన్ని, ప్రభావాన్ని గుర్తుచేసి ప్రస్తుత అవసరాలకు పూర్వవిద్యార్థుల తోడ్పాటును అభ్యర్థించారు. ప్రధాన నిర్వాహకులు వై. ఎస్.ఎన్. మూర్తి, డైరక్టర్ బి. ప్రభాకర రావు, ప్రిన్సిపాల్ జీ.వీ.ఆర్.ప్రసాదరాజు, పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి ప్రొఫెసర్ పి. సుబ్బారావు తదితరులు స్వర్ణోత్సవాల ఔచిత్యంపై ప్రసంగించారు. అలనాటి ఆచార్యులైన ప్రొ. కైలాసరావు, ప్రొ.మురళీధర శర్మ, ప్రొ.టి.గోవిందరావు, దివంగత ప్రొ.వి.వి.ఎస్. ప్రసాద్ సతీమణి సరస్వతీ దేవి తదితరులకు ఉత్సవాల్లో ఘనసన్మానం చేశారు. డాలస్ నివాసి డా. శేఖరం కస్తూరి రూపొందించిన పూర్వవిద్యార్థుల జీవన ప్రయాణ సంకలనం (Journey of life after graduation) ఆకర్షించింది. అమెరికా నుంచి వచ్చిన దేవరాజు మోహన్, పూర్ణ కుమార్ దాస్, కల్నల్ దేశిరాజు హనుమంత రావు, అల్లాడ జనార్ధన రావు, మునుకుట్ల పార్థ సారధి తదితరులు కవితలు, చతురోక్తులు, పాటల ద్వారా వినోదాన్ని పంచారు. యనమండ్ర విజయలక్ష్మి ఆధ్వర్యంలో రమ, శ్రీమతి లక్ష్మి దేశిరాజు నిర్వహించిన ప్రత్యేక మహిళా వేదిక ఆసక్తికరమైన ప్రశ్నలూ- జవాబులతో అందరినీ ఆకట్టుకుంది. ఆయుర్వేద శాస్త్రంలో నిష్ణాతుడైన రాజ బహదూర్ ఆయుర్వేదం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించే తన పథకాన్ని కూలంకషంగా వివరించి సమవయస్కులైన సహాధ్యాయుల ఆసక్తిని మరింత పెంపొందించారు. బోోస్టన్ నుంచి వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త సుబ్బు కోటా సౌజన్యంతో సాయత్రం స్థానిక రాయల్ పార్క్ హోటల్ లో జరిగిన గ్రాండ్ బాంక్వెట్ లో అంతర్జాతీయ గాయనీ గాయకులు సుచిత్ర బాలాంత్రపు, లలిత నేమాని, పి. వి.రమణ, వై.ఎస్. రామకృష్ణ గాన విభావరి అలరించింది. 29న పూర్వవిద్యార్థుల బృందం అన్నవరం దేవాలయం, ఉప్పాడ బీచ్, కోరింగ అభయారణ్యంలో తుల్యభాగా నది వద్ద సంగమ దర్శనం తదితర కార్యక్రమాలతో హుషారుగా సందడి చేశారు. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన కె.వి.వి గోపాల కృష్ణ, బంగారా రాజబహదూర్, వై.ఎస్.ఎన్. మూర్తి, వంగూరి చిట్టెన్ రాజు, మొక్కరాల నరసింహ మూర్తి, పొట్లూరి వెంకట్రావు, ఎన్.ఎస్. రావు, కె.గంగాధరరావు తదితరులు కృషి చేశారు.


More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com