అప్పుడు ఎన్నికలలో పోటీ చేసి ఉంటే…

స్వేచ్ఛామాత పుట్టిన నేల శ్రీకాకుళం అని, భరతమాతకు గుడి ఉన్న ఏకైక నేల శ్రీకాకుళం అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సైనికుడు కనబడతాడని, జైహింద్‌ అంటాడని తెలిపారు. వారికి స్ఫూర్తిగానే తాను ఈ రోజు మిలటరీ చొక్కాను వేసుకున్నట్టు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన కొనసాగుతోంది. జనసేన పోరాట యాత్రలో భాగంగా ఈ రోజు సాయంత్రం టెక్కలిలోని అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి ఇందిరాగాంధీ జంక్షన్‌ వరకు నిరసన కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడుతూ.. ‘‘సీపీఎస్‌ పెన్షన్‌ విధానంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా ప్రజలు అనేక సమస్యలు చెబుతున్నారు. విద్య, వైద్యం, ఉద్యోగావకాశాలు, నీళ్లు.. తదితర సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. ప్రజలపై ప్రభుత్వాలకు ప్రేమకావాలి. ఒక్కరోజు ఎమ్మెల్యేగా, ఒక్కగంట సీఎంగా.. ఒక్కరోజు ఎంపీగా ఉన్న వాళ్లెవరైనా రిటైర్‌ అయితే వాళ్లకు జీవితకాలం పెన్షన్‌ వస్తోంది. కానీ, ఇక్కడ ఉద్యోగులు 30 ఏళ్లు పనిచేసినా గానీ ఈ స్కీమ్‌తో వాళ్లకు పెన్షన్‌ వచ్చే ఆధారాన్ని భయాందోళనలోకి నెట్టేశారు. వారిని పట్టించుకొనే నాథుడు లేరు. వాళ్ల కోసం నేను పోరాటం చేస్తా. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగే వరకూ జనసేన వారికి అండగా నిలుస్తుంది. ప్రజా వ్యతిరేక పనులు చేయడం వల్లే తెలంగాణలో తెదేపా మట్టికొట్టుకుపోయింది. ప్రజా సమస్యల్ని పక్కనబెట్టి పార్టీ ప్రయోజనాలను కాపాడుకుంటామంటే ఇక్కడా అదే పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఉద్ధానం కిడ్నీ సమస్యపై దృష్టి పెట్టడంతో పాటు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేయండి. మేం మద్దతుగా నిలబడతాం. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణం.. ఓట్లు చీలకుండా ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడుతుందని. అలాగైతే.. మన గొంతు విన్పిస్తుందని. కానీ ఆనాడు నేను చేసిన పనికి ఈ రోజు చింతిస్తున్నాను. బాధపడుతున్నా. ఎందుకు నేను కొద్ది స్థానాల్లోనైనా పోటీచేయలేదే అని ఇప్పుడు చాలా బాధగాఉంది. అణగారిన, నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ప్రభుత్వాలు అండగా నిలబడాలి. పరిశ్రమ స్థాపించేటప్పుడు 70 శాతం మెజార్టీ ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. దాంతో పాటు సభలు పెట్టాలి. తీర్మానాలు చేయాలి. పునరావాస చర్యలు చేపట్టకుండా ప్రాజెక్టులు కడితే మళ్లీ సోంపేట థర్మల్‌ ప్రాజెక్టు ఉదంతాలే పునరావృతమవుతాయి’’ అని అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com