అభివృద్ధి-అన్నపుష్టి-ఆత్మగౌరవాలే అన్నగారి ఆశయాలు


ఆకలిగొన్న బాధితుడికి పట్టెడన్నం, బడుగు బలహీనుల అభ్యున్నతి, ఏ దిశకేగినా తలవంచని తెలుగువారి ఆత్మగౌరవాలే “అన్న” నందమూరి తారకరామారావు అజరామర ఆశయాలుగా వెలుగొందుతున్నాయని డాలస్ ప్రవాసులు కొనియాడారు. గురువారం నాడు ప్లేనోలోని బావర్చి సమావేశ మందిరంలో డాలస్ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌టీఆర్ 22వ వర్ధంతి కార్యక్రమంలో ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు. చలసాని కిషోర్ నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ తెలుగుతోటలో వెలుగుపూలు పూయించిన ఆ కర్షక కుమారుడి యశస్సు ముంజేతికంకణంగా భాసిల్లుతోందని పేర్కొన్నారు. రాజకీయ పరమపదసోపానపటములో అధికార కైవసమనే నిచ్చెనను అతిస్వల్ప సమయంలో అధిరోహించి సరికొత్త చరిత్రకు తెరచాపలెత్తిన ఎన్‌టీఆర్…నిరంతర విద్యార్థిగా సదా స్మరణీయుడిగా చిరంతన సోదహరణీయుడిగా మిగిలిపోయారన్నారు. క్రమశిక్షణతో సినీరంగాన్ని, సంక్షేమంతో రాజకీయ రంగాన్ని ఆవాహన చేసుకున్న ఎన్‌టీఆర్…నేటితరం యువతకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పారని వక్తలు ప్రశంసించారు. సంచలనాత్మక పథకాలకు సంకోచం లేకుండా పచ్చజెండా ఊపిన ఎన్‌టీఆర్…దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలకు ద్వితీయ రాజ్యంగాన్ని అనధికారికంగా అందించారని కొనియాడారు. విశాల దృక్పథంతో పరిపాలించిన రెండో శ్రీకృష్ణదేవరాయులుగా…ఎన్‌టీఆర్…చరిత్రకు సువర్ణ సిరా అద్దిన మహనీయుడని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లు ఇరువురూ ఎన్‌టీఆర్ నీడలో ఎదిగిన వటవృక్షాలుగా ఆయనకు భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వంచే ఆమోదింపజేసే బాధ్యతను నిబద్ధతగా సంకల్పించాలని, దీనికి తమ తోడ్పాటును అందిస్తామని కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమ విజయవంతానికి పోలవరపు శ్రీకాంత్, నందిగామ కుమార్, దొడ్డా సాంబ, చలపతిరావు కొండ్రుకుంట, కొరడా రామకృష్ణ, అమర్ అన్నే, కిరణ్ తంగులూరి, జనార్థన్, మండువ సురేష్, కొమ్మినేని శ్రీనివాసరావు, వెంకట్ వలివేటి, సుమన్, మల్లవరపు అనంత్, చందు కాజా, కిషోర్ వీరగంధం, లోకేష్ నాయుడు, మురళి వెన్నం, నరేంద్ర యెండ్లూరి, పూర్ణ పునుగుళ్ల, సిరిగిరి సనిపిని, సుగన్ చాగర్లమూడి, సురేష్ గూడూరు, పూర్ణ యలవర్తి, చంద్ర పోలీస్, నవీన్ ఎర్రమనేని, శ్రీనివాస్ శాఖమూరి, శ్రీనివాస్ జంపని, తెదేపా అభిమానులు, కార్యకర్తలు, ప్రవాసులు తదితరులు సహకరించారు.—సుందరసుందరి(sundarasundari@aol.com)

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com