అమెరికా అనుభవాలు అద్భుతం–కృష్ణా కలెక్టర్ లక్ష్మీకాంతం

అమెరికా, కెనడా దేశాల్లో కృష్ణా జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులే ఎక్కువగా ఉన్నారని వీరు తమ విజ్ఞానంతో సంపాదించిన సొమ్ములో కొంత జన్మభూమి ప్రగతికి ఇచ్చి రుణం తీర్చుకోవాలనే ఆరాటం కనిపించిందని కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. అమెరికాలోని ఏడు రాష్ట్రాల్లో పది రోజుల పాటు పర్యటించి వచ్చిన కలెక్టర్‌ పర్యటన వివరాలను విజయవాడలోని విడిది కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అమెరికాలో పలు ప్రవాసాంధ్రుల అసోసియేషన్లు ఉన్నాయన్నారు. జన్మభూమి ఫౌండేషను ద్వారా జిల్లా ప్రగతికి ప్రవాసాంధ్రులు నిధులు సమకూర్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంతృప్తి స్థాయిలో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా, మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టడానికి ప్రవాసాంధ్రులు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కృష్ణా జిల్లా దశను పట్టిసీమ ఎత్తిపోతల పథకం మార్చి వేసిందన్నారు. దీని వల్ల తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తి పెరిగిందన్నారు. ముఖ్యంగ ఆక్వా రంగం బాగా అభివృద్ధి చెందినదన్నారు. పంటల విస్తీర్ణం పెరిగినట్లు చెప్పారు. జిల్లాలో 440 ఉన్నత పాఠశాలలు ఉండగా వీటిలో ప్రస్తుతం 200 పాఠశాలల్లోనే డిజిటల్‌ తరగతులున్నట్లు పేర్కొన్నారు. మిగతా పాఠశాలలను కూడా డిజిటల్‌ తరగతులుగా తీర్చిదిద్దడానికి ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చారన్నారు. మేము సైతం కార్యక్రమం ద్వారా గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారంపై ఎన్నారైలు ఆసక్తిగా కనబరిచారని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాను రక్తహీనత రహితంగా చేస్తామన్నారు. శ్మశానాల పూర్తి అభివృద్ధికి వారి సహకారం ఉంటుందన్నారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంటు తదితరాలను చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. విద్యతోనే దేశ ప్రగతి ఆధారపడి ఉన్న క్రమంలో బడి ఈడు పిల్లలను బడికి పంపడం, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడం వంటి కార్యక్రమాలను చేపట్టామన్నారు. పశుపోషణ, కోళ్ల పెంపకం, సంతలు, గోకులాల ఏర్పాటు, కుటుంబ ఆదాయం రూ.10 వేలు ఉండేలా చూడడం, దివ్యాంగులకు ఉపకరణాల అందజేత తదితరాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటు, పర్యటక ప్రాంతాల అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com