అమెరికాలో తెలుగు అల్లరి చిల్లరిగాళ్ళ ఆటలు ఇక చెల్లవ్-TNI ప్రత్యేకం

అమెరికాలో ఇటీవల సంచలనం రేపిన సినీతారల రాసలీలల వ్యవహారం తెలుగు వారి ప్రతిష్ఠను అంతర్జాతీయంగా దెబ్బతీసింది. దీనిని ఆసరాగా చేసుకుని అమెరికాలో పనీపాటా లేని మన పోకిరీగాళ్లు ఈ రాసలీలల వ్యవహారానికి మరి కొన్ని పుకార్లను అంటగట్టి తమకు ఇష్టంలేని కొంత మంది ప్రముఖులను రచ్చకీడ్చే ప్రయత్నాలు చేశారు. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.

*** అమెరికాలో పోకిరీగాళ్లపై నిఘా
అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని అమెరికాలో కొంత మంది పోకిరిగాళ్ళు చెలరేగిపోతున్నారు. నకిలీ వీడియోలు, ఆడియోలు సృష్టించి పలువురు ప్రముఖులకు కూడా రంకు వ్యవహారాలను అంటగడుతున్నారు. ఇదే కాకుండా మరి కొన్ని విషయాలలోనూ పోకిరిగాళ్ళ ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటుంది. వీరి చర్యలు తెలుగు జాతికే అవమానకరంగా ఉంటున్నాయి. సభ్యసమాజం సిగ్గుపడేలా కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో ప్రవాస తెలుగువారు వీరి చర్యలను అసహ్యించుకుంటున్నారు. వీరి చేతిలో అవమానాలకు గురవుతున్న కొంత మంది ప్రముఖులు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేస్తున్నారు.

*** అమెరికాలో అల్లరిగాళ్ళకు ఆంధ్రాలో చిల్లరగాళ్ళ సహకారం
అమెరికాలో ఉండి తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో సామాజిక మాధ్యమాల్లో తమకు గిట్టనివారిపై అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను పెడుతున్న అల్లరిగాళ్ళకు ఆంధ్రా, తెలంగాణాల్లో ఉంటున్న కొంతమంది చిల్లరగాళ్ళు సహకరిస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఇతరత్రా నకిలీ ఎకౌంట్ల తయారీకి సహకరిస్తున్నారు. వీరి ఆగడాలు ఎంతగా శృతి మించాయంటే సామజిక మాధ్యమాల్లో ప్రముఖులను ఉద్దేశించి బండబూతులు తిట్టడం…రంకు వ్యవహారాలను అంటగట్టడం…పలు కుంభకోణాలలో వీరి పాత్ర ఉన్నట్లు అసత్య ప్రచారాలు సృష్టించి, సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్నారు. కొంత మంది వ్యక్తులు దిగజారి తమకు పడని వ్యక్తుల భార్యలు, కుటుంబసభ్యులపై కూడా అసభ్యకర కామెంట్లు పెడుతున్నారు.

*** వెల్లువలా ఫిర్యాదులు
అమెరికాలో ఉంటూ తమను చట్టాలు ఏమీ చేయలేవని చెలరేగుతున్న అల్లరిమూకలపై ఫిర్యాదులు ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున అందుతున్నాయి. ప్రముఖ తెలుగు సంస్థ తానా అధ్యక్షుడు వేమన సతీష్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు గంటల వ్యవధిలోనే స్పందిచారు. తెనాలిలో ఉంటూ అమెరికాలో ఉంటున్న అల్లరివ్యక్తులకు సాంకేతిక సహకారం అందిస్తున్న భార్గవ్ అనే వ్యక్తిని గుంటూరు నగర పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలో ఉన్న మరో అయిదుగురు ప్రవాసాంధ్రులుపై కేసులు నమోదు చేశారు. వీరు భవిష్యత్‌లో భారతదేశంలో అడుగుపెట్టగానే అరెస్టు చేసే విధంగా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు సిలికాన్ వ్యాలిలో ఉన్న ఒక ప్రముఖ తెలుగు సంస్థ నేతలపైనా, ఇతర సభ్యులపైనా కులం పేరుతో దుషిస్తూ వారిని అనరాని మాటల అంటూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్న కొందరు వ్యక్తులపై ఆంధ్రా, తెలంగాణా సైబర్ పోలీసులకు ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. వీరిపై కూడా చర్యలుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

*** ఆందోళనకారులు, మోసగాళ్లపై పోలీసుల నిఘా
ఇటీవల అమెరికాలో ఉదయం, సాయంత్రం వాకీంగ్‌కి వెళ్తున్న భారతీయ మహిళల మెడలో గొలుసులు తెంపుకు వెళ్తున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి వెనుక హైదరాబాద్‌కు చెందిన అమెరికాలో ఉంటున్న కొందరి యువకుల హస్తం ఉన్నట్లు అమెరికా పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని సామాజిక మాధ్యమంలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపైన తెలంగాణా పోలీసు శాఖ విచారణ చేపట్టింది. అమెరికాలో నివాసం ఉంటూ రాజకీయ వర్గాలుగా విడిపోయి కొట్టుకు ఛస్తున్న పనికిమాలిన వాళ్లపై, ఇటీవల బహిరంగంగా వారు చేస్తున్న ఆందోళనపై తెలుగు రాష్ట్రాల పోలీసులు దృష్టిపెట్టారు. దీంతో పాటు అమెరికాలో బోగస్ కంపెనీలు పెట్టి వీసాలు మంజూరు చేసిన కేసులో కొంతమంది తెలుగు వారు ఇటీవల అరెస్టు అయ్యారు. కొంత మంది తెలివి కలిగిన కంపెనీల యజమానులు అరెస్టును తప్పించుకునేందుకు తెలుగు రాష్ట్రాలకు పారిపోయి వచ్చారు. వీరిపైనా కూడా విచారణ జరుగుతుంది. ఒకప్పుడు అమెరికాలో తెలుగువారంటే కష్టపడి పనిచేస్తారని అక్కడి అమెరికాలో సైతం మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి. కొందరు అల్లరిగాళ్ళ, మోసగాళ్ళ మూలంగా మన తెలుగుజాతి ప్రతిష్ఠ ఇటీవల బాగా దెబ్బతినడమే కాదు మంటగలిసింది కూడా. అమెరికా పోలీసుల సహకారంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు జరగకుండా అక్కడ పోలీసుల సహకారంతో నిందితులు ఇక్కడకు రప్పించడం మరి కొందరికి హెచ్చరికలు జారీచేయడం వంటి చర్యలు చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అమెరికాలో ఉన్న అల్లరిగాళ్ళ, చిల్లరిగాళ్లు, మోసగాళ్ళు ఆందోళనకారులు తస్మాత్ జాగ్రత్త! ఇకనైనా బుద్దిగా ఉంటూ పొట్ట చేతపట్టుకుని అమెరికా వెళ్ళిన మీరు అనైతిక చర్యలకు దిగజారోద్దని తెలుగు వారి ఔన్నత్యానికి మచ్చ తేవద్దని ఇక్కడ ఉన్న ప్రజలంతా కోరుకుంటున్నారు. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com