అమెరికాలో తెలుగు న్యాయవాది-జనేతా

మొన్నామధ్య పత్రికల్లో, టీవీల్లో హల్‌చల్‌ చేసిన వార్తలివి…‘భారతీయ విద్యార్థుల్ని వెనక్కిపంపిన అమెరికా ప్రభుత్వం’, ‘ఇమిగ్రేషన్‌ నిబంధనలు కఠినతరం’. ఆ సమయంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మన విద్యార్థులకు అండగా నిలబడినవారిలో మన ప్రభుత్వంతో పాటూ అమెరికాలో అటార్నీగా ఉంటున్న తెలుగమ్మాయి జనేత రెడ్డి కూడా ఉన్నారు. నాలుగొందలకుపైగా ప్రభుత్వ, కార్పొరేట్‌ సంస్థలకు ఇమిగ్రేషన్‌ న్యాయవాదిగా సేవలందిస్తున్న జనేత ఏం చెబుతున్నారో చూద్దాం…మీకు ఆస్తి వివాదాలు పరిష్కరించే సివిల్‌ న్యాయవాదులు.. నేరాలు, హత్యలను పరిష్కరించే క్రిమినల్‌ లాయర్ల గురించీ తెలిసి ఉండొచ్చు. నేను ఇమిగ్రేషన్‌ న్యాయవాదిని. అంటే అంతర్జాతీయ వలస చట్టాలపై సేవలందించే ప్లీడర్‌ని అన్నమాట. మనదేశం దాటి అమెరికాకి వెళ్లే విద్యార్థులకీ, ఉద్యోగులకీ ఇమిగ్రేషన్‌ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు భారత్‌కి చెందిన ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగి అనుకుందాం. ఆ సంస్థ అమెరికాలో ఉన్న తమ శాఖకు మిమ్మల్ని పంపించింది. మీరు చట్టబద్ధంగానే అమెరికాలో అడుగు పెట్టారన్న విషయాన్ని అక్కడి ప్రభుత్వానికి తెలియచేయడంతో నా పాత్ర మొదలవుతుంది. మీకు పెళ్లయ్యిందా? ఎంతమంది పిల్లలు.. చదువూ వంటి వివరాలతో కూడిన నివేదికలు తయారుచేస్తాను. దాన్ని యూఎస్‌సీఐఎస్‌కి (యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌)కి అప్పగిస్తాం. మీ వివరాలన్నీ సరిగ్గా ఉంటే ఫర్వాలేదు కానీ అందులో ఏమాత్రం లోపం ఉందనిపించినా వాటిపై ఒక విచారణ (ఎంక్వయిరీ) నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో నేను న్యాయవాదిగా వాదిస్తాను. ఇలా అమెరికాలో ఉన్న నాలుగువందలకు పైగా వివిధ రకాల సంస్థలకు సంబంధించి ఉద్యోగులకు, విద్యార్థులకూ నేను స్థాపించిన ‘లీగల్‌ ఆఫీస్‌ ఆఫ్‌ జనేతరెడ్డి’ ద్వారా సేవలందిస్తున్నా. ఎప్పటికప్పుడు మారే ఇమిగ్రేషన్‌ విధానాలని అవగాహన చేసుకుంటూ వినియోగదారులకు సేవలందించడం మాటల్లో చెప్పినంత తేలిక కాదు. యూఎన్‌ఎన్‌జీ వివాదంలో… చాలామంది పిల్లలూ, వాళ్ల తల్లిదండ్రులు వెనకాముందు చూడకుండా లక్షలు వెచ్చించి ఏదోలా అమెరికా వెళ్లిపోతే చాలని అనుకుంటారు. ఇలాంటి బలహీనతలని గుర్తుపట్టే అమెరికాలో యూఎన్‌ఎన్‌జీ అనే నకిలీ విశ్వవిద్యాలయం వెలిసింది. మొత్తం సబ్జెక్టులన్నీ ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు… మీరు మాత్రం ఇక్కడ ఫీజు కట్టివెళ్లిపోతే చాలు. కాలేజీకి రావాల్సిన అవసరమే లేదని ప్రచారం చేసింది. ఆ ఉచ్చులో మన విద్యార్థులు చాలామంది పడిపోయారు. విచారణ చేసిన అమెరికా ప్రభుత్వం ఆ విశ్వవిద్యాలయం ద్వారా చదవడానికి వచ్చిన వాళ్లందరినీ తిరిగి మీ దేశానికి వెళ్లిపొమ్మని చెప్పింది. వాళ్లే కాదు భారత్‌లో ఉన్న వాళ్ల తల్లిదండ్రులూ తల్లడిల్లారు. దాంతో ప్రభుత్వాలూ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మా ఆఫీసుకి కొన్ని వందల ఫోన్లు వచ్చేవి. మామూలుగా అయితే గంటకి మూడొందల డాలర్లు తీసుకునే నేను ఈ కేసులని ఉచితంగా పరిష్కరించాను. ‘అమెరికా నుంచి పంపించేస్తే ఇంటికెళ్లి మా మొహం ఎలా చూపించగలం’ అని కొందరు.. ‘చావో.. రేవో ఎలా అయినా ఇక్కడే తేల్చుకుంటాం’ అని మరికొందరు ఏడుస్తూ మాకు ఫోనుచేశారు. ఆ సమయంలో వాళ్లకి కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సి వచ్చింది. ‘చట్టబద్ధంగా ఉంటూ.. మీ తల్లిదండ్రులు కోరిన స్థాయికి వెళతారో, చట్టవ్యతిరేకంగా ఉంటూ చిన్నపనులతో సంతృప్తి చెందుతారో మీ ఇష్టం’ అంటూ అమెరికాలో ఉండే రకరకాల సమస్యల్ని వాళ్లకు వివరించా. చాలామంది విద్యార్థులు అర్థంచేసుకుని వెనక్కి వచ్చేయడానికి సిద్ధపడ్డారు. కేవలం విద్యార్థులకే కాదు ఆస్పత్రులూ, యూనివర్సిటీలు కూడా మా సేవలు పొందేవారి జాబితాలో ఉన్నాయి. అలాగే ఇక్కడి నుంచి వచ్చే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకే కాదు…సినీరంగంలో పనిచేసేవారికీ, మేనేజర్లకీ, పూజార్లు ఎదుర్కొనే ఇమిగ్రేషన్‌ చిక్కులని తొలగించడం మా సంస్థ పని. నా గురించి… మా సొంతూరు నల్గొండ. నన్ను డాక్టర్‌గా చూడాలన్నది మా నాన్న కల. అందుకోసమే గుంటూరులో బైపీసీ చదివి ఎంసెట్‌ రాశా. అందులో నాకు తగిన ర్యాంకు రాలేదు. మా ఇంట్లో అమ్మనాన్నల వైపు పేరొందిన న్యాయవాదులున్నారు. వాళ్లే నాలో న్యాయవాద వృత్తి పట్ల స్ఫూర్తిని రగిలించారు. దాంతో దుర్గాబాయ్‌దేశ్‌ముఖ్‌ కళాశాలలో డిగ్రీ చేసి ఆ తర్వాత ఉస్మానియాలో న్యాయవాద విద్య పూర్తిచేశా. అక్కడ నుంచి ఎంఎస్‌ చదవడానికి హెచ్‌4 డిపెండెంట్‌ వీసాపై అమెరికా వెళ్లాను. విద్యార్థిగా ఎఫ్‌1 వీసా సాధించాను. అక్కడి ఇండియానా పోలిస్‌లో ఐయూపీయూఐ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ పూర్తయ్యాక నూయార్క్‌ బార్‌ ఎగ్జామ్‌ రాశా. న్యాయవాద విద్యలో అత్యున్నత స్థాయి పరీక్ష ఇది. అంత తేలికైన విషయం కాదు. పన్నెండు గంటల చొప్పున రెండు రోజులు ఈ పరీక్షని రాయాలి. ఒక్కో ప్రశ్నలో 22 అంశాలని పరీక్షించేలా ఇందులో ప్రశ్నలు ఉంటాయి. ఆ ఏడాది న్యూయార్క్‌ ఫోర్త్‌ జ్యూరిస్‌డిక్షన్‌లో ప్రమాణస్వీకారంచేసిన వారిలో నేను ఒక్క భారతీయురాలిని కావడం నా జీవితంలో మర్చిపోలేని విషయం. ప్రతి విద్యార్థికి అక్కడ ఓపీటీ (ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) అనేది ఉంటుంది కదా! ఆ సమయంలో నేను మా ప్రొఫెసర్‌ దగ్గర ఇమిగ్రేషన్‌కి సంబంధించిన విషయాల్లో రీసెర్చ్‌ అసోసియేట్‌గా పనిచేశా. న్యాయవిద్య పూర్తవగానే అందరూ భారతీయ విద్యార్థుల్లా ఏదో ఒక లీగల్‌ ఫర్మ్‌లో చేరిపోవడం నాకిష్టంలేదు. అందుకునే లైసెన్స్‌ తీసుకుని ‘లీగల్‌ ఆఫీస్‌ ఆఫ్‌ జనేత రెడ్డి’ని స్థాపించాను. మొదట్లో ఫ్యామిలీ లా, కార్పొరేషన్స్‌, విల్స్‌, ఇమిగ్రేషన్స్‌ వంటి అంశాలపై మూడేళ్లపాటూ పనిచేశాను. పూర్తిగా ఇమిగ్రేషన్‌పై దృష్టి పెట్టాను. అందుకు కారణం లేకపోలేదు. ఈ కేసులు చాలా త్వరగానే ముగిసిపోతాయి. అలా ఎంతోమంది విద్యార్థులూ, ఉద్యోగులకు నా వంతుగా సాయం చేస్తున్నా అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com