అమెరికాలో ముగిసిన సిలికానాంధ్ర పద్యనాటక ప్రదర్శనలు


సిలికానాంధ్ర మనబడి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కళారత్నగుమ్మడి గోపాలకృష్ణ సారథ్యంలో అమెరికాలో నాలుగు నగరాలలో “పద్యనాటకం” కార్యక్రమం అద్భుతంగా జరిగింది. గుమ్మడి శిక్షణతో తర్ఫీదయిన 50+ మంది మనబడి విద్యార్థులు నాలుగు ప్రధాన నగరాలలో నాలుగు పద్యనాటకాలు ప్రదర్శించి, తెలుగు పద్యనాటక పతాకాన్ని అమెరికా నాలుగు మూలలా ఎగురవేసారు. మొదటగా డాలస్ లో గౌతమ్ కస్తూరి, రామారావు పాలూరిల ఆధ్వర్యంలో పిల్లలు శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం వేశారు. ఇండో-అమెరికన్ ఫ్రెండ్-షిప్ కౌన్సిల్ తరఫున గుమ్మడికి “నట విరాట్” బిరుదునందించారు. న్యూజెర్సీ నగరంలో శ్రీధర్ & మాధురి కొండుగుంటల నిర్వాహణలో శ్రీ కృష్ణ తులాభారం నాటకాన్ని పరదర్శించారు. న్యూజెర్సీ అసెంబ్లీ మాజీ స్పీకర్ చివుకుల ఉపేంద్ర మాట్లాడుతూ మనబడి పిల్లల సమర్థత చూసి ఆశ్చర్యపడుతున్నాని పేర్కొన్నారు. లాస్ ఎంజేలీస్ నగరంలో సుధా దావులూరి సంధానకర్తగా మనబడి పిల్లలు గయోపాఖ్యానం పద్యనాటకంలోని శ్రీ కృష్ణ అర్జున శపథం ఉపకథని ప్రదర్శించారు. ఆఖరుగా ఉత్తర కరోలినాలోని కేరి నగరంలో శ్రీ కృష్ణ రాయబారం నాటకం సుబ్రహ్మణ్యేశ్వర దాసరి నేతృత్వంలో ప్రదర్శించబడింది. కేరీ నగర మేయర్ మార్క్ స్టోల్‌మన్ పద్యనాటకానికి ముగ్ధులై బాలకృష్ణుడి పాత్ర ధరించిన పాత్రధారికి అభివాదం చేశారు. మనబడి విద్యార్ధుల రాగయుక్త పద్యగానంతో పాటు నేపథ్యంలో మంచి సంగీతం, కంప్యూటర్ గ్రాఫిక్స్, పాత్రోచితంగా అలంకరణ, వేషధారణలతో – మైమరిపించే విధంగా మనబడి పద్యనాటకం కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మనోరంజకమైన ఈ పద్యనాటకం కార్యక్రమం రవీంద్ర కూచిభొట్ల ప్రధాన సంధానకర్తగా వ్యవహరించగా, ఫణి మాధవ్ సృజనాత్మక నిర్దేశకునిగా, డాంజి తోటపల్లి కార్యక్రమ సమన్వయకర్తగా వివిధ నగరాలలో జరిగిన కార్యక్రమాలను పర్యవేక్షించారు. పద్యనాటకంతో పాటుగా మనబడి 2016-17 విద్యాసంవత్సరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణులైన 800+ మనబడి పిల్లల స్నాతకోత్సవ కార్యక్రమాలు ఇవే వేదికలపై జరిగాయి. డాలస్లో నాట్యవిద్యాచార్యులు దీక్షిత్, కందిమళ్ల సాంబశివరావు, న్యూజెర్సీలో అసెంబ్లీమాన్ చివుకుల ఉపేంద్ర, లాస్ ఎంజేలీస్లో గురు కొండవీటి జ్యోతిర్మయి, కేరిలో నగర మేయర్ మార్క్ స్టోల్‌మన్ ముఖ్యఅతిధులుగా విచ్చేసి యోగ్యతాపత్రాలు అందజేశారు. పిల్లల సాఫల్యత గురించి మాట్లాడుతూ, “మీ పిల్లల్ని మనబడికి పంపడం వల్ల వాళ్ళు ఎటువంటి అద్భుతాలు సాధించగలరో తెలుసుకోవటానికి ఈ మా పద్యనాటకం కార్యక్రమం ఓ మచ్చు తునక!!” అని గుమ్మడి గోపాలకృష్ణ వెల్లడించారు. ప్రవాస చిన్నారుల ద్వారా పద్యనాటకం అత్యున్నత స్థాయిని అందుకోవడం సంతృప్తిగా ఉందని, తన వారసులు అమెరికాలోనే ఉన్నారని చాటిచెపుతానని పేర్కొన్నారు. సిలికానాంధ్ర దశాబ్ది కాలంలో 27000 మందికి పైగా విద్యార్ధులకు తెలుగు నేర్పించడమే కాకుండా, మన కళలు, సంప్రదాయల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి, అభిరుచిని పెంచడం చేస్తోందని, మనబడిలో తెలుగు నేర్చుకునే విద్యార్థులకు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణతా పత్రాలు అందించడమే కాకుండా, పలు స్కూల్ డిస్ట్రిక్ట్ లలో ఫారిన్ లాంగ్వేజ్ అర్హత సాధించడం, అమెరికా వ్యాప్తంగా ఉన్న 250 మనబడి కేంద్రాలకు ప్రతిష్టాత్మక Western Association of Schools and Colleges గుర్తింపు లభించడం మనబడి విజయాలలో ముఖ్యమైనవి అని మనబడి అధ్యక్షులు రాజు చమర్తి తెలిపారు. మనబడి 2017-18 విద్యా సంవత్సరం తరగతులు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమౌతున్నాయని, manabadi.siliconandhra.org ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల తెలిపారు.






More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com