అమెరికా ఎన్నికల్లో రష్యా పాత్రపై మిశ్రమ అభిప్రాయాలు.

అమెరికాను మళ్లీ మహోన్నత దేశంగా మారుస్తానంటూ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్‌ ట్రంప్‌, చివరికి ఆ హోదాను రష్యాకు కట్టబెట్టనున్నారని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మీద ట్రంప్‌ ఒలకబోస్తున్న అభిమానం, ఆపేక్షలే ఇందుకు నిదర్శనమంటున్నారు. డెమోక్రాట్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ గెలుపు వెనక రష్యన్‌ హ్యాకర్ల హస్తం ఉందని నేడు దుమారం రేగుతోంది. రష్యన్లు డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ సంఘ (డీఎస్‌సీ) ఈ- మెయిల్స్‌ను తస్కరించి వికీలీక్స్‌ ద్వారా వెల్లడి చేయించారని ఇంటెలిజెన్స్‌ అధిపతులు ఇటీవల నిర్ధారించారు. ఇది అమెరికా ప్రజాస్వామ్యంపై రష్యా దాడి అని విపక్షం మండిపడుతోంది. అమెరికా గూఢచారి సంస్థ (సీఐఏ), నేర పరిశోధక సంస్థ (ఎఫ్‌బీఐ), జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఏ)లు ఇటీవల ట్రంప్‌ను కలిసి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌ జోక్యం చేసుకున్నారని నిర్ధారించినా, ట్రంప్‌ దాన్ని కొట్టివేశారు. రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా ప్రభుత్వంపైన, రాజకీయ, వ్యాపార సంస్థలపైన సైబర్‌ దాడులకు పాల్పడుతున్నాయని ఒప్పుకొంటూనే, రష్యన్ల హ్యాకింగ్‌ తన ఎన్నికకు ఏ మాత్రం తోడ్పడలేదని ఖండితంగా చెప్పారు. అయినా సైబర్‌ దాడుల నిరోధంపై 90 రోజుల్లో ప్రత్యేక ప్రణాళిక రూపకల్పనకు ఓ బృందాన్ని నియమిస్తానని హామీ ఇచ్చారు. జనవరి 20న అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ పని చేస్తానన్నారు. మరుసటి రోజే అమెరికా-రష్యా సంబంధాలు మెరుగుపడాలని, దీన్ని వ్యతిరేకించేవారు మూర్ఖులని బుద్ధిహీనులనీ విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వేలు పెట్టినది ఒక్క రష్యా మాత్రమే కాదు – అమెరికన్‌ ఎఫ్‌బీఐ సైతం ఓ చేయి వేసింది. విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ తన ఇంట్లోని కంప్యూటర్‌ ద్వారా అధికారిక విధులను నిర్వహించడం దేశ భద్రతకు హాని కలిగించి ఉండవచ్చునని ఎఫ్‌బీఐ అధిపతి జేమ్స్‌ కోమే అధ్యక్ష ఎన్నికకు కేవలం పది రోజుల ముందు ప్రకటించారు. రష్యన్ల హ్యాకింగ్‌కు కోమే ప్రకటన జత కలిసి, హిల్లరీ విజయావకాశాలను దెబ్బతీసింది. డెమోక్రాటిక్‌ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకులైన మిషిగన్‌, విస్కాన్సిన్‌, పెన్‌సిల్వేనియా రాష్ట్రాల్లో కేవలం 1,07,000 మంది ఓటర్లు ట్రంప్‌ వైపు మళ్లడం వల్ల, ఆ రాష్ట్రాల్లోని డెలిగేట్ల (ఎంపీల) ఓట్లన్నీ ట్రంప్‌కు దత్తమై అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఎన్నికలో రష్యా ప్రమేయాన్ని నిర్ధారించిన కొద్ది రోజులకే, ఎఫ్‌బీఐ హిల్లరీపై మరో బాంబు పేల్చింది. సొంత కంప్యూటర్‌పై అధికార విధులు నిర్వహిస్తే విదేశీ గూఢచర్యానికి తావు ఇచ్చినట్లు అవుతుందని తాము 2015లోనే హెచ్చరించినా ఆమె పెడచెవిన పెట్టారని పేర్కొంది. ఈమేరకు 300 రహస్య పత్రాలను బయటపెట్టింది. మరోవైపు ట్రంప్‌ వ్యక్తిగత ఆర్థిక రహస్యాలను రష్యన్లు సేకరించారని, వారికి అనువైన సమయంలో ఈ ఆంతరంగిక విషయాలను బయటపెట్టవచ్చునని ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆయనకు తెలియజేశారు. అజాగ్రత్త హిల్లరీని దెబ్బతీస్తే రష్యా తెరచాటు సాయం ట్రంప్‌ గెలుపునకు కారణమైనట్లుంది. ఇంతా చేసినా ట్రంప్‌ డెలిగేట్ల ఓట్లలో మెజారిటీ దక్కించుకున్నారే తప్ప, ప్రజా ఓట్లలో హిల్లరీ కన్నా వెనకబడిపోయారు. ట్రంప్‌ కన్నా హిల్లరీకి 28 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఈసారి అధ్యక్ష ఎన్నిక ఫలితం అమెరికన్‌ సమాజంలో వచ్చిన చీలికకు స్పష్టమైన నిదర్శనం! జనానికి మాయమాటలు చెప్పి, కుతంత్రాలకు పాల్పడి దేశాధ్యక్షుడిగా ఎన్నిక కావాలని చూసే పనికిమాలిన అభ్యర్థులను నివారించడమే తమ ధ్యేయమని అమెరికా జాతిపితల్లో ఒకరైన అలెగ్జాండర్‌ హ్యామిల్టన్‌ అలనాడు వాక్రుచ్చారు. అందుకే అధ్యక్ష ఎన్నికల్లో ప్రజా ఓట్లకన్నా ఎన్నికల గణ (డెలిగేట్ల) ఓట్లకు నిర్ణయాత్మక శక్తిని కట్టబెట్టామని సెలవిచ్చారు. అంత చేసినా నేడు అమెరికా పరిస్థితి ఏకాడికి వచ్చిందో తెలిస్తే ఆయన ఆత్మ క్షోభించకమానదు. జనవరి 20న ట్రంప్‌ పదవీ స్వీకారం చేయడానికి ముందే ఆయన్ను సాగనంపాలని సూచనలు వస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు విదేశాంగ మంత్రి రెక్స్‌ టిలర్‌సన్‌, జాతీయ భద్రతా సలహాదారు మైకేల్‌ ఫ్లిన్‌లు సైతం రష్యా నేత పుతిన్‌ వీరాభిమానులని ప్రత్యర్థులు గుర్తుచేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికను పుతిన్‌ ప్రభావితం చేసినందుకు ఈ అభిమానులు రష్యాకు ఏ ప్రతిఫలం కట్టబెట్టనున్నారని నిలదీస్తున్నారు. నిజానికి ఇతర దేశాల ఎన్నికలు, పాలనా వ్యవస్థల్లో జోక్యం చేసుకోవడంలో రష్యా, అమెరికా దొందూ దొందే! కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయానికి డొవ్‌ లెవీన్‌ అనే పరిశోధకుడు సమర్పించిన అధ్యయనం ప్రకారం 1946 జనవరి-2000 డిసెంబరు వరకు వివిధ దేశాల్లో జరిగిన 117 ఎన్నికల్లో అగ్రరాజ్యాలు జోక్యం చేసుకున్నాయి. వీటిలో అత్యధిక (81) ఎన్నికల్లో అమెరికా చేయిపెట్టింది. పూర్వ సోవియట్‌ రిపబ్లిక్‌లైన జార్జియా, ఉక్రెయిన్‌, కిర్గిజిస్థాన్‌లలో 2000 సంవత్సరం తరవాత జరిగిన ఎన్నికల్లో అమెరికా తెరవెనక పావులు కదిపి పాశ్చాత్య అనుకూల ప్రభుత్వాలను ఏర్పరచిందని రష్యా రుసరుసలాడింది. దెబ్బకు దెబ్బ తీయడానికే 2016 అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో రష్యా జోక్యం చేసుకున్నట్లుంది. రష్యా ప్రమేయాన్ని నిర్ధారించిన సంయుక్త ఇంటెలిజెన్స్‌ (ఓడీఎన్‌ఐ) నివేదికలోని ముఖ్యాంశాలు ఇవి: 1. హిల్లరీ విశ్వసనీయతను దెబ్బతీసి, ట్రంప్‌ విజయావకాశాలను పెంపొందించడానికి డెమోక్రటిక్‌ పార్టీ అధికారుల ఈ-మెయిల్స్‌ను హ్యాక్‌ చేయాలని పుతిన్‌ స్వయంగా ఆదేశించారు. అమెరికన్‌ ప్రజాస్వామ్య ప్రక్రియపై ఓటర్లు నమ్మకం కోల్పోయేట్లు చేయడం ఆయన అంతిమ లక్ష్యం. కొంతకాలం క్రితం బట్టబయలైన పనామా పత్రాలు పుతిన్‌ రహస్య ఖాతాలో 200 కోట్ల డాలర్ల నిధి ఉందని ఆరోపించడం ఆయనకు చిర్రెత్తించింది. కంటికి కన్ను అన్నట్లు అమెరికా ప్రజాస్వామ్యంపై బురద జల్లాలని పుతిన్‌ నిశ్చయించారు. 2011లో రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల వెనుక హిల్లరీ హస్తం ఉందని ఆయన మండిపడుతున్నారు. దీనికి ప్రతీకారంగా హిల్లరీ పని పట్టి, ట్రంప్‌ విజయానికి ఓ చేయి వేయాలని తీర్మానించారు. ఇంతచేసినా ట్రంప్‌ గెలుస్తారన్న నమ్మకం రష్యాకు లేదు. చివరికి విజయం ఆయన్నే వరించిందని తెలియగానే రష్యా అధికారులు పండుగ చేసుకున్నారు.2. రష్యా సైనిక ఇంటెలిజెన్స్‌ సంస్థ జీఆర్‌యూకు చెందిన హ్యాకర్లు హిల్లరీ, ఆమె పార్టీ సభ్యుల వ్యక్తిగత ఈ-మెయిల్స్‌ను తస్కరించి వికీలీక్స్‌, డీసీలీక్స్‌ డాట్‌కామ్‌లకు అందజేశారు. అవి అక్కడ నుంచి అనేక సామాజిక మాధ్యమాల్లో, అమెరికన్‌, రష్యన్‌ సమాచార సాధనాల్లో విరివిగా ప్రచారమయ్యాయి. 3. ఒకవేళ హిల్లరీ గెలిచినా ఆమెపై బురద జల్లడానికి రష్యన్‌ ట్రోల్స్‌ కాచుకుని కూర్చున్నారు. (గిట్టనివాళ్లపై ట్విటర్‌, ఫేస్‌బుక్‌, బ్లాగుల వంటి సామాజిక మాధ్యమాల్లో అవాకులు చెవాకులు పేలి, అసత్య ఆరోపణలను ప్రచారంలో పెట్టేవాళ్లను ట్రోల్స్‌ అంటారు). రష్యా వ్యూహంలో ఈ-మెయిల్‌ హ్యాకింగ్‌ ఒక పార్శ్వం మాత్రమే! సైబర్‌ దాడులు నిర్వహించడం, ప్రభుత్వ అధీనంలోని ఆర్‌టీ (రష్యా టుడే) వంటి సమాచార మాధ్యమాలను ఉపయోగించడమూ పుతిన్‌ వ్యూహంలో భాగమే. ఒకవేళ ట్రంప్‌ ఓడిపోతే అమెరికాలో ఎన్నికల రిగ్గింగ్‌ జరిగిందంటూ దుమారం రేపాలని రష్యా తలపెట్టింది. 4. 2016 అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేయగలిగిన రష్యా 2020 ఎన్నికలోనూ అదే పనిచేయడానికి ప్రయత్నిస్తుందని, ఇతర ప్రజాస్వామ్య దేశాల ఎన్నికల ప్రక్రియలోనూ జోక్యం చేసుకొంటుందని సంయుక్త ఇంటెలిజెన్స్‌ నివేదిక హెచ్చరించింది. రష్యా హ్యాకింగ్‌ ఐరోపా దేశాలకూ ఆందోళన కలిగిస్తోంది. సైబర్‌ యుద్ధం, తప్పుడు సమాచార ప్రచారం ద్వారా 2017 జర్మన్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోనున్నదని జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ హెచ్చరించారు. ఆ దేశ పార్లమెంటు దిగువ సభ అయిన బుండెస్టాగ్‌ పైన, పాలక క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ కార్యాలయంపైనా జరిగిన సైబర్‌ దాడులకు రష్యన్‌ హ్యాకర్లే కారణమని జర్మన్‌ అధికారులు చెబుతున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికలకు రష్యా హ్యాకర్ల నుంచి పొంచి ఉన్న ప్రమాదాల గురించి ఫ్రాన్స్‌ జాతీయ భద్రతా సంస్థ తమ అధ్యక్ష అభ్యర్థులకు వివరించింది. అంతర్జాలం, స్మార్ట్‌ ఫోన్లు, ఉపగ్రహాల సాయంతో ప్రపంచం అనుసంధానమైన ఈ రోజుల్లో సైబర్‌ జోక్యాలు ఎంతో సులువైపోయాయి. ఈ ప్రమాదాన్ని అమెరికా ప్రజల దృష్టికి తీసుకురావాలని బరాక్‌ ఒబామా నిశ్చయించారు. తాను పదవీ విరమణ చేసేముందే రష్యన్‌ హ్యాకర్ల నిర్వాకాలను బహిర్గతం చేయాలని ఇంటెలిజెన్స్‌ సంస్థలను ఆదేశించారు. ట్రంప్‌ పగ్గాలు చేపట్టిన తరవాతా రష్యన్‌ హ్యాకింగ్‌పై ఈ సంస్థల దర్యాప్తు కొనసాగుతుంది. డెమోక్రాట్లతోపాటు కొందరు రిపబ్లికన్‌ సభ్యులూ ట్రంప్‌ హయాములో తమ ప్రజాస్వామ్య భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ట్రంప్‌ ప్రమాదకర విధానాలను చేపడితే రిపబ్లికన్లూ అడ్డుపడవచ్చు. 100 మంది సభ్యులు గల సెనెట్‌లో రిపబ్లికన్లకు 52 సీట్లు ఉంటే, డెమోక్రాట్లకు 46, వారికి మద్దతునిచ్చే ఇండిపెండెంట్లకు రెండు సీట్లూ ఉన్నాయి. ఈ లెక్కన కేవలం ముగ్గురు రిపబ్లికన్‌ సెనెటర్లు వ్యతిరేక ఓటు వేస్తే చాలు, ట్రంప్‌ చిక్కుల్లో పడతారు. సెనెట్‌ చాలా శక్తిమంతమైనది. అమెరికా అధ్యక్షుడు చేసే నియామకాలకు, ఇతర దేశాలతో కుదుర్చుకొనే ఒప్పందాలకు సెనెట్‌ ఆమోదం తప్పనిసరి. ఎన్నికలకు ముందు ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని సమర్థించడానికి 11మంది రిపబ్లికన్‌ సెనెటర్లు నిరాకరించారు. డెమోక్రటిక్‌ పార్టీ ఈ-మెయిల్స్‌ను రష్యా హ్యాక్‌ చేసిందని రిపబ్లికన్‌ నాయకుడు రీన్స్‌ ప్రీబస్‌ అంగీకరించారు. అధ్యక్ష ఎన్నిక అనంతరం కూడా అమెరికన్‌ ప్రముఖులు, సంస్థలపై రష్యా హ్యాకర్ల దాడులు ఎక్కువయ్యాయని ఇంటెలిజెన్స్‌ సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రష్యా పట్ల సానుకూల వైఖరిని తగ్గించుకోవాలని రిపబ్లికన్లు తమ అధ్యక్షుడిపై ఒత్తిడి తీసుకురాక మానరు. ట్రంప్‌ పదవీ స్వీకారం చేసిన కొన్ని వారాలకే పుతిన్‌తో సమావేశమవుతారనే వార్తలు వారిని కలవరపరిచాయి. అలాంటిదేమీ లేదని ట్రంప్‌ వర్గం ఖండించినా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. వ్యాపారవేత్తగా ట్రంప్‌ చేపట్టిన అనేక ప్రాజెక్టుల్లో రష్యా పెట్టుబడులున్నాయి. విదేశాంగ మంత్రిగా నియమితుడైన టిల్లర్‌సన్‌ గతంలో ఎక్సాన్‌ మోబిల్‌ కంపెనీ సీఈఓగా ఉన్నప్పుడు రష్యాలో వేల కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలో బోగస్‌ వార్తలు ప్రచారం చేసి హిల్లరీని దెబ్బతీసిన ఆర్‌టీ (రష్యా టుడే) కేబుల్‌ టీవీ సంస్థ సభలో పుతిన్‌ సరసన నేడు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా నియుక్తుడైన మైకేల్‌ ఫ్లిన్‌ ఆసీనుడైన ఫోటో వెలుగులోకి వచ్చింది. వీరి గత చరిత్ర రిపబ్లికన్‌ పార్టీలో అంతర్గత వైరుధ్యాలకు బీజం వేయనుంది. దానాదీనా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ రనౌట్‌ అయితే, అధ్యక్షుడిగా ట్రంప్‌ ఆట గందరగోళం మధ్య మొదలైంది!

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com