అమెరికాలో రాసలీలల గోల ముగిసింది.ఇక నోళ్లు మూసుకోండి-TNI ప్రత్యేకం

“దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా”…అమెరికాలో జరిగిన సినీతారల రాసలీలల వ్యవహారాన్ని తెలుగు మీడియా భూతద్దంలో చూపిస్తోంది. ఈ విషయంలో అక్కడ ఉన్న తెలుగు సంఘాలకు కానీ వాటి నిర్వాహకులకు గానీ ఏ విధమైన సంబంధం లేనప్పటికీ కొంతమంది వాస్తవాలు వక్రీకరిస్తున్నారు. మరికొంతమంది దురుద్దేశపూర్వకంగా, ఇంకొందరు వ్యక్తిగత కక్షలతోనూ రాసలీలల వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తూ రచ్చ చేస్తున్నారు. కొన్ని ప్రధాన పత్రికలు కూడా తమ బాధ్యతలను విస్మరించి అమెరికా నుండి వాస్తవాలు వక్రీకరించే వారి నుండి సమాచారం తెప్పించుకుని వీటిపై కథనాలు అల్లుతున్నారు. భారతదేశంలోని కొంత మంది సిగ్గుమాలిన, నీతిమాలిన వ్యభిచారిణులు తాము సినిమా నటీమణులమని పేరు చెప్పుకుని అమెరికాలో ఒళ్లు అమ్ముకోవడం, విటులను ఆకర్షించడం గత 20 సంవత్సరాల నుండి అమెరికాలో సర్వసాధారణంగా జరుగుతోంది. కాకపొతే తెలుగు సంఘాల ఉత్సవాలు జరిగేటప్పుడు వీరి హడావుడి కాస్త ఎక్కువగా ఉంటుంది. వీరిలో కొంతమంది మహిళలు కొన్ని తెలుగు సంఘాలు ఇచ్చిన ఆహ్వాన పత్రికలను దుర్వినియోగం చేశారు. వీటిపై పేర్లు మార్చి, వీసాలు పొంది అమెరికాలో ప్రవేశించి తమ వ్యాపారాన్ని గుట్టుగా, కొన్ని చోట్ల బహిరంగంగా సాగిస్తున్నారు. అమెరికాలో ఒక వ్యక్తి తన భార్యకు అన్యాయం చేయకుండా, ఆమె అభ్యంతరం పెట్టనంతవరకు మహిళా స్నేహితులతో గడపడం అక్కడ పెద్ద నేరంగా భావించరు.

*** అమెరికాలో మీడియా ప్రవేశానికి తెలుగు సంఘాలే ఆధారం
అమెరికాలో జరిగిన రాసలీలలపై అభూతకల్పనతో కథనాలు, చర్చాఘోష్టులు నిర్వహిస్తున్న చాలా మీడియా సంస్థలు తెలుగు సంఘాల ద్వారానే అమెరికాలోకి ప్రవేశించారు. తెలుగు మీడియా ప్రతినిధులు చాలా మందిని తెలుగు సంఘాలు ఆహ్వానించి ఆదరించాయి. ఆహ్వానాలు అందించి అమెరికాలో వారి సంస్థలు నిలదొక్కుకోవడానికి ఆసరా ఇచ్చాయి. కొద్ది నెలల క్రితం న్యూజెర్సీలో తెలుగు సంఘాల అండతో పైకి వచ్చిన ఒక టీవీ ఛానల్ ప్రతినిధి అదే తెలుగు సంఘాలను దుర్భాషలాడుతూ చేసిన ఆడియో టేపు బయటపడింది. అమెరికాకు ఇక్కడి నుండి వెళ్లి వ్యభిచారం చేస్తున్న మహిళల్లో సినీ నటీమణులే కాకుండా కొందరు టీవీ యాంకర్లు కూడా ఉన్నారనేది బహిరంగ రహస్యం. అటువంటిది ఇప్పుడు జరిగిన వ్యవహారంపై అభూత కల్పనలతో మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం విచారకరం. అమెరికా అంటే ఏమాత్రం తెలియని వారు కూడా స్థానిక టీవీలలో జరిగే చర్చాఘోష్టుల్లో పాల్గొంటూ కట్టుకథలు వినిపిస్తున్నారు. ఎప్పుడో ఏప్రిల్‌లో జరిగిన మోదుగుమూడీ కిషన్ దంపతుల అరెస్టును సాకుగా చూపి రాసలీలల కథనాలను ప్రత్యేక చర్చలతో రక్తి కట్టిస్తున్నారు.

*** రాసలీలల వ్యవహారం ముగిసినట్లేనా?
TNIకు అందిన సమాచారంతో పాటు అమెరికాలో మాకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో…….ఈ రాసలీలల వ్యవహారం కిషన్ దంపతుల అరెస్టుతోనే ముగిసిపోయింది. అందరూ అంటున్నట్లు అమెరికాలో మన సీబీఐ లాంటి అత్యున్నత సంస్థ ఫెడరల్ బ్యూరో(FBI)కు ఈ కేసుకు ఏ విధమైన సంబంధం లేదు. స్థానికంగా ఉండే హోంల్యాండ్ సెక్యురిటీ అధికారులు ఈ కేసును విచారించి ఛార్జిషీట్‌ను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో కిషన్ చేతిలో మోసపోయిన మహిళలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే అక్కడ పోలీసులు దర్యాప్తు జరిపారు. కిషన్ దంపతులను దోషులుగా చేర్చి బొక్కలో వేశారు. ఈ కేసులో ఎవరైనా తలదూర్చి తమను కూడా కిషన్ దంపతులు మోసం చేశారని ఫిర్యాదు చేస్తే దానిపై మాత్రమే దర్యాప్తు జరుగుతుంది లేదా కిషన్ దంపతులు తమను ఫలానా వారు మోసగించారని ఎదురు దాడికి దిగితే విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ కేసు విచారణ ముగిసినట్లే. సుదీర్ఘ కాలం అయినా కూడా విచారణ కొనసాగుతుందని వచ్చే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.

*** తెలుగు సంఘాలు గుణపాఠంగా తీసుకోవాలి
ఏది ఏమైనప్పటికీ ఇక నుండి తెలుగు సంఘాల నిర్వాహకులు ఈ రాసలీలల వ్యవహారాన్ని గుణపాఠంగా తీసుకోవాలి. కొన్ని తెలుగు సంఘాల మధ్య ఉన్న విభేదాలు కూడా మన తెలుగు జాతి పరువు పోయే విధంగా ఉంటోంది. తెలుగు సంఘాల నిర్వాహకులందరు ఒకే వేదిక పైకి వచ్చి అమెరికాలో తెలుగు జాతి పరువు కాపాడే విధంగా ఒక కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహాసభలు అంటే సినిమా తారలు ఉంటేనే రక్తి కడతాయి అనే అభిప్రాయం నుంచి బయటకు రావాలి. వ్యక్తిగత ఆరోపణలున్న వివిధ రంగాలకు చెందిన మహిళలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఈ సంఘాల మహాసభలు పిలవకుండా ఉండటం చాలా మంచిది. ఇదే సమయంలో తెలుగు సంఘాల నిర్వాహకులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అమెరికాలో జరుగుతున్న తెలుగు సంఘాల ఉత్సవాలకు హాజరుకావటం గతంలో ముఖ్యమంత్రులు కూడా గర్వకారణంగా భావించేవారు. కొందరు తెలుగు సంఘాలు నిర్వాహకులు మూలంగా ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. యాభై రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరూ అక్కడ ఉన్న సంఘాలకు మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకుంటే ఈ నాయకులు మాత్రం తెలుగు రాష్ట్రాలకు వచ్చి పనికి మాలిన రాజకీయ నాయకుల ముందు వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఇది చాలా దారుణం! మీ ప్రతిష్ఠనే కాకుండా అమెరికాలో ఉన్న తెలుగుజాతి పరువును కూడా ఈ నాయకులు తమ చర్యల ద్వారా దిగజార్చుకున్నారు. మీ సొంత ఎజెండాను మీరు ఎన్నికైన తెలుగు సంఘాలతో ముడి పెట్టకుండా ఉండడం మంచిది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లేదా మంత్రి పదవి కన్నా తెలుగు సంఘాల్లో మీకున్న పదవే గొప్పదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ – గతంలో “తానా”ను నెలకొల్పిన డా.కాకర్ల సుబ్బారావును అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ.రామారావు బతిమిలాడి రాష్ట్రానికి తీసుకువచ్చారు. మీరు కూడా అటువంటి గుర్తింపునే పొందాలి. ఒక చెడు ఒక మంచి కోసం జరుగుతుంది అంటారు. జరిగిన సంఘటనలు అన్ని మననం చేసుకుంటూ వ్యక్తిగత, కుల, వర్గ పోరాటాలను విస్మరించి రానున్న తెలుగు సంఘాల మహాసభలను జయప్రదం చేయటంపై దృష్టి పెట్టండి. మరలా పూర్వవైభవాన్ని మన తెలుగుజాతికి తీసుకురండి.—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com