అమెరికాలో వెల్లివిరుస్తున్న భక్తి పారవశ్యం–TNI ప్రత్యేకం

భారతీయులు అమెరికా వెళ్ళడం శతాబ్దకాలం కిందటే ప్రారంభమైంది. 1893లో స్వామి వివేకానంద షికాగోలో తన అనర్గళ ఉపన్యాసంతో మన సంస్కృతి సంప్రదాయాలను అమెరికా వాసులకు ఘనంగా చాటి వారికీ భారత్ పట్ల ప్రత్యేక అభిమానాన్ని కలిగించారు. 1906లో శాన్ ఫ్రాన్సిస్కోలో తొలి హిందూ దేవాలయాన్ని నిర్మించారు. 1970నుంచి భారతీయులు, ముఖ్యంగా ఆంధ్రులు ఎక్కువగా అమెరికా రావడంతో హిందూ దేవాలయాల నిర్మాణం పై దృష్టి సారించారు. ప్రస్తుతం అమెరికాలో మన సంప్రదాయాలను, ఆధ్యాత్మికతను విస్తృతంగా ప్రచారం
చేస్తున్నారు. 1976లో పిట్స్ బర్గ్ లో వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని, న్యూయార్కు ఫ్లషింగ్ లో గణపతి ఆలయాన్ని భారీ వ్యయంతో నిర్మించారు. నాటి నుంచి అమెరికాలో హిందూ దేవాలయాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. అమెరికాలో 722 హిందూ దేవాలయాలు ఉండగా వాటిలో 500 దేవాలయాలను ప్రవాసాంధ్రులే నిర్వహిస్తుండటం విశేషం.
*భావితరాలపై మమకారంతో
అమెరికాలోని దాదాపు ఎనిమిది లక్షల మంది ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు మన ఆచార, సాంప్రదాయల గొప్పతనాన్ని తెలియజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు భారతీయ కళల ఘనతను తెలియజేస్తున్నారు. దాదాపు 100మంది కూచిపూడి నృత్యాచార్యులు వేలాది మంది పిల్లలకు నాట్య కళలో తర్ఫీదునిస్తున్నారు. నాట్య శిక్షణకు హిందూ దేవాలయాలే వేదికలవుతున్నాయి. తానా నాట్స్ , ఆటా, సిలికానాంధ్ర వంటి తెలుగు సంస్థలు ప్రవాసాంధ్రుల పిల్లలు నేర్చుకొన్న విద్యను ప్రదర్శించడానికి చక్కటి అవకాశాలు కలిపిస్తున్నాయి.
*నిత్య పూజలు
అమెరికాలో మన దేవాలయాల నిర్మాణమే ఓ యజ్ఞం లాంటిది. ఇక ఆలయాల్లో నిత్యం ధూప, దీప, నైవేద్యాలను అందించడం మరో క్రతువుగా మారింది. ఖర్చుకు వెనుకాడకుండా మన రాష్ట్రంతో పాటు దక్షిణ భారతదేశం నుంచి వేదపండితులను అమెరికా రప్పిస్తున్నారు. వారాంతపు
సెలవుల్లో అన్ని దేవాలయాల్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక, సాహిత్య కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గత నెలలో న్యూయార్క్ ప్లషింగ్ దేవాలయంలో రూ.4కోట్ల ఖర్చుతో పది రోజుల పాటు మహా కుంభాభిషేకాన్ని నిర్వహించటం దీనికి ఉదాహరణ.
*నిష్ఠగా అయ్యప్ప దీక్షలు
వాషింగ్టన్ లోని శివ-విష్ణు ఆలయంలో ఏటా వందలాది మంది ప్రవాసాంధ్రులు అయ్యప్ప దీక్షలు తీసుకుని నిష్ఠగా పూజలు నిర్వహిస్తుండటం విశేషం. చిన్నజీయర్ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి వంటి వారు తరచూ పర్యటిస్తూ ఇక్కడి దేవాలయాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో నిర్వహణ వీరి అధ్వర్యంలో జరుగుతోంది. ఒర్లాండోలో 1993లో ప్రారంభమైన హిందూ విశ్వవిద్యాలయంలో 8కోర్సుల్లో మాస్టర్ డిగ్రీలను ప్రవేశపెట్టారు. మన విద్యార్ధులతో పాటు ఇతర దేశాల వారు కూడా ఇక్కడ భారతీయ సదాచారాల పై శిక్షణ పొందుతున్నారు.
*ఉత్తర అమెరికా హిందూ దేవాలయాల సమితి
అమెరికాలోని అన్ని హిందూ దేవాలయాలకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తోంది. అమెరికాలో హిందూ ధర్మ ప్రచారంలో ప్రవాసాంధ్రులు విస్తృతంగాపాల్గొంటూ మన సంప్రదాయాలను గొప్పగా చాటుతున్నారు.
sunnyvale hindu temple

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com