అమెరికా పొమ్మంది. దుబాయి రమ్మంది.

అమెరికా వెళ్లాలని కలలుకంటున్న భారతీయ టెక్‌ నిపుణుల ఆశలపై అగ్రరాజ్యం నీళ్లు చల్లుతున్న సంగతి తెలిసిందే. వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాలు భారతీయులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) వచ్చి చేరింది. కేవలం భారతీయులే కాదు, అసాధారణ ప్రతిభ ఉన్న ఏ దేశం వాళ్లయినా, పదేళ్ల పాటు తమ దేశంలో ఉండేలా వీసా మంజూరు చేసేలా యూఏఈ ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. వృత్తి నిపుణులు, విద్యార్థులు కూడా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తమ్‌ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు, ప్రతిభ కలిగిన వాళ్లకు యూఏఈ వేదిక అవుతుందని మంత్రి వర్గ సభ్యులు అభిప్రాయ పడినట్లు డబ్ల్యూఏఎం న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ‘‘అసాధారణ ప్రతిభ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఇక యూఏఈ ఒక చక్కని వేదిక కాగలదు. అందరికీ అనువైన వాతావరణం, విలువలు, అవస్థాపన సౌకర్యాలు, అనుకూల చట్టాలు, చక్కని ప్రణాళికలు ఇక్కడ ఉన్నాయి’’ అని యూఏఈ ప్రధాని మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అన్నారు. ఈ మేరకు ఉత్తర్వులను అమలు చేసేందుకు ఆర్థికమంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు, ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను సైతం పర్యవేక్షించి, ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను ఈ ఏడాది మూడో త్రైమాసికానికి సమర్పించాలని ఆదేశించారు. తాజా నిర్ణయంతో యూఏఈ అనేకమంది పెట్టుబడిదారులను కచ్చితంగా ఆకర్షిస్తుందని, ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చేస్తుందని రషీద్‌ తెలిపారు. పదేళ్ల నివాస వీసా మంజూరు కార్యక్రమంలో భాగంగా వైద్యం, శాస్త్ర విజ్ఞానం, పరిశోధన, సాంకేతిక రంగాల్లో నిపుణులతో పాటు, ఆవిష్కరణ కర్తలు కూడా వీసాలు పొందే అవకాశం ఉంది. ఇదే సమయంలో యూఏఈలో చదువుకోవాలనుకునే అసాధారణ ప్రతిభ కలిగిన విద్యార్థులు అయిదేళ్ల వీసా నివాస వీసాను పొందవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com