అమ్మకు వందనం-TNI మాతృదినోత్సవ ప్రత్యేకం

అమ్మ..వేలుపట్టి న డకనే కాదు, మనసుపెట్టి నడతనూ నేర్పుతుంది పిల్లలకు! ముద్దు చేస్తూ గోరు ముద్దలను.. ప్రేమతో కలిపి పెట్టి పెంచుతుంది. ఇంతింతై వటుడింతై అన్నట్టు బిడ్డ ఎదుగుతుంటే లోలోన సంబరపడుతుంది. అందుకే సృష్టిలో అమ్మతనం కన్నా కమ్మదనం మరెందులోను లేదంటారు. అందుకే అమ్మల కోసం ప్రత్యేకంగాఈ లోకంలో ఓ దినోత్సవం పురుడు పోసుకుంది. అలాంటి ఓ అమ్మ గురించి… అమ్మల దినోత్సవం రోజున స్మరించుకొని.. అమ్మతనాన్ని గుండెల నిండా నింపుకుందాం.ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తగా మేరీ క్యూరీ అందరికి తెలుసు. అంతేకాదు నోబెల్‌ బహుమతి గెలుచుకున్న తొలి మహిళగానూ తెలుసు. కానీ వీటన్నింటితోపాటు ఓ గొప్ప మాతృమూర్తిగానూ మన్ననలందుకున్నారు. భర్త యాక్సిడెంట్‌లో మరణించాక ఇద్దరు చంటి పిల్లలను ఒంటిచేత్తో సాకి గొప్ప ప్రయోజకులుగా తీర్చిదిద్దింది మేరీ క్యూరీ. 1906లో క్యూరీ భర్త యాక్సిడెంట్‌లో మరణించారు. అప్పటి నుంచి ఆమె తన శాస్త్రపరిశోధనలను కొనసాగిస్తూనే ఇద్దరు ఆడపిల్లల ఆలనా పాలనా చూసింది. తనే తల్లి తండ్రి.. అయి వారికి విద్యాబుద్ధులు చెప్పించి గొప్ప వ్యక్తిత్వం గలవారిగా తీర్చిదిద్దింది.ఏదైనా పనిని సీరియ్‌సగా చేసేవాళ్లు మాత్రమే జీవితంలో ఎదగగలుగుతారు. వినోదం కోసం కాలాన్ని వృధా చేయకుండా ఒక గమ్యాన్ని పెట్టుకోని దానికోసం కష్టపడాలి’ అని క్యూరీ పిల్లలకు చెప్పేది. స్వయంగా తనే రోల్‌ మోడల్‌గా నిలిచింది. అందుకే క్యూరీ కూతుళ్లలో ఒకరైన ‘ఇరెన్‌ జోలియెట్‌ క్యూరీ’ ఆ తరువాతి కాలంలో నోబెల్‌ బహుమతి గెలుచుకుంది. రసాయన శాస్త్రంలో ‘రేడియో యాక్టివిటీ’ ని గురించి చేసిన పరిశోధనకు గాను భర్తతో కలసి ఆమె నోబెల్‌ బహుమతి గెలుచుకుంది. ‘వినయం, శ్రమించి పనిచేయటం లాంటి భావాలను చిన్నతనంలోనే తన తల్లి తమలో పాదుకొల్పింది’ అని ఆ తరువాత రోజుల్లో జోలియట్‌ క్యూరీ తన తల్లి గురించి ఎన్నోసార్లు గర్వంగా చెప్పారు.
***మదర్స్‌ డే… చరిత్ర ఇదే
మే నెల రెండో ఆదివారమే ఎందుకు?దీని వెనుక కథేంటి? ఇది తెలియాలంటే అన్‌ రీవ్స్‌ జార్విస్‌, అన్నా జార్వి్‌సల గురించి తెలియాల్సిందే! అది 1861.. ఆ కాలంలో అమెరికాలో స్త్రీల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. పరిశుభ్రత లేమితో వారు అనేక రోగాల బారిన పడేవారు. ఈ పరిస్థితులపై అవగాహన కల్పించడానికి అన్‌ రీవ్స్‌ జార్విస్‌ అనే మహిళ ముందుకొచ్చింది. వారి కోసం ‘మదర్స్‌ డే వర్క్‌ క్లబ్స్‌’ను అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియాలో మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకి సివిల్‌ వార్‌ మొదలైంది. ఆ సమయంలో తన క్లబ్‌ సభ్యులతో కలిసి గాయపడ్డ సైనికులకు చికిత్సను అందించేవారు. అలా 1868 నాటికి యుద్ధం ముగిసింది.ఆమె ‘మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే’ శాంతి ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆమె మదర్‌ జార్వి్‌సగా మారిపోయారు.1905లో ఆమె మరణించారు. కుమార్తె అన్నా జార్విస్‌ అమ్మల కోసం ప్రత్యేకంగా ఓ రోజు ఉండాలని పిలుపునిచ్చారు.దీని కోసం తన ఉద్యోగానికి 1912లో రాజీనామా చేశారు. ప్రభుత్వాధికారులకు ఉత్తరాలు రాసి, వారిలో కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.రెండేళ్ల తర్వాత అంటే 1914లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ మే నెల రెండో ఆదివారాన్ని మదర్స్‌ డేగా ప్రకటించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com