విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో డిసెంబరు 26న అర్ధరాత్రి బద్రీనాథ్తోపాటు మరో ముగ్గురు అనధికార పూజారులు పూజలు చేయడం వెనుక ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యకుమారే ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం. మహిషాసుర మర్దిని రూపానికే పూజలు నిర్వహించేలా ఆమె నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఆలయ ప్రధాన పూజారి బద్రీనాథ్ బంధువుగా పేర్కొనే పార్థసారథి ఇంతకుముందు దుర్గగుడి పూజల్లో పాల్గొనేవాడని చెబుతున్నా అతడు కేవలం మహిషాసుర మర్దిని అలంకారం రోజే వచ్చి పాల్గొనేవాడని చెబుతున్నారు. అలంకారం చేశాక ఫోటో తీసి ఫోన్లో తనకు పంపాల్సిందిగా ఈవో సూచించినట్లు సమాచారం. ఆ ఫోటోను తాను ఎవరికో పంపాల్సి ఉందని చెప్పినట్లుగా పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ఫోటోను ఆమె ఎవరికి పంపదలచుకున్నారు? ఈ వ్యవహారం వెనుక ఈవోతోపాటు ఇంకా వేరేవారి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేయనున్నారు. పూజలో ఉన్న సమయంలో పూజారులు ఈవోతో ఫోన్లో మాట్లాడిన అంశాన్నీ పోలీసులు గుర్తించారు. దాదాపు 4 నిమిషాల కొన్ని సెకన్ల పాటు వారు ఫోన్లో మాట్లాడుకున్నారు. కేవలం వివరాలేనా? లేక ఆ సమయంలో పూజా క్రమాన్ని ఆమెకు వినిపించేందుకు ఇలా చేశారా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. పూజకు కావాల్సిన మరికొన్ని వస్తువులను భవానీపురంలో తీసుకున్నారని, వాటిని బద్రీనాథ్ ఏర్పాటు చేశారని సమాచారం. ఆలయంలో రాత్రి విధుల్లో ఉండే సిబ్బందికి, మరికొందరికి ఈవో ముందే సూచనలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి ఆలయంలో శుద్ధి చేయడానికి కొందరు వస్తారని చెప్పి.. ఎవరి నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసినట్లు సమాచారం. దీంతో మిగిలినవారు ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మహిషాసుర మర్దిని అలంకారం తర్వాత రాజరాజేశ్వరి అలంకారం చేసేందుకు పామర్రు నుంచి చెరకుగడ తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఇద్దరు డిసెంబరు 26 రాత్రి విజయవాడ ఆర్టీసీ బస్టాండులోని డార్మెటరీలో నిద్రించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో వారు మద్యం తెచ్చుకుని సేవించినట్లు తెలిసింది. మాంసం కూడా తెచ్చుకుని తిన్నట్లు.. కొంత మర్నాడు ఉదయం ఎవరికో బిచ్చగాడికి ఇస్తే అది పాడైపోయిందని పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం. ఆలయ ప్రధానార్చకుడు బద్రీనాథ్ ఎప్పటి నుంచో తన బంధువుకు ఆలయంలో ఉద్యోగం ఇప్పించాలని ఈవో సూర్యకుమారిని కోరుతున్నారని, ఈ పూజ చేయించే క్రమంలో ఈవో ప్రధాన అర్చకుడికి ఆ ఉద్యోగం ఆశ చూపించి ఈ పని చేయించినట్లుగా దర్యాప్తులో వెలుగు చూసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఒక పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ… ‘అగంతకులు ఆలయంలోకి ప్రవేశించిన మాట వాస్తవం. సంప్రదాయ విరుద్ధంగా ఆలయంలో కొన్ని కార్యక్రమాలు జరిగాయని తేలింది’ అని పేర్కొన్నారు.