అమ్మ తొలిసారి విజయ గార్డెన్స్‌లోనే…

ఆకాశంలో చల్లగా.. మిలమిల మెరుస్తూ కనిపించే చందమామను దగ్గరగా చూడాలని ఎవరికుండదు? అలా చూడకపోయినా.. చూసొచ్చిన వారి చేతుల్ని పట్టుకుని.. ప్రేమగా కరచాలనమైనా చేయాలనే ఒక ఆశ మనసులో ఉంటుంది. అలాంటి అందమైన చందమామతో ఎన్నో అనుబంధాలను పెనవేసుకున్న ఓ అపురూప కరచాలనమే.. మన విజయచాముండేశ్వరి. అలా వెన్నెలను పంచిపెట్టిన జాబిలమ్మే మన సావిత్రమ్మ. మహానటిగా గజారోహణ కీర్తిని పొంది.. వెండితెరపై సాటిరాని మేటి మహానటిగా నిలిచిపోయిన సావిత్రమ్మతో.. ఆమె తనయ విజయ చాముండేశ్వరికున్న అనుబంధపుమాల ఆమె మాటల్లోనే..
**కంగ్రాట్స్‌ అండీ.. ‘మహానటి’ పెద్ద హిట్‌
అవునండీ.. సినిమా ఆడియో ఫంక్షన్లో నన్ను చూసిన దగ్గర నుంచి.. ఇప్పటిదాకా.. ఎక్కడెక్కడి నుంచో.. ఎందరెందరో.. అమ్మ గురించి, అమ్మపైగల అభిమానంతో.. నన్ను పలకరిస్తూ ఉంటే.. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. సినిమా చూశాక.. అమ్మపై ప్రేక్షకులకున్న అభిమానం మరింత రెట్టింపయ్యింది. అమ్మపై మీరందరి అభిమానం చూసి.. సంతోషంతో కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. ‘మహానటి’ సినిమా బృందానికి నా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
**అమ్మతో అనుబంధం?
ఏం చెప్పను.. ఎలా చెప్పను..? నాకు ఊహ తెలిసిన నాటి నుంచే.. అమ్మ ఎంతో పేరు ప్రఖ్యాతలుగల నటి. అమ్మ 1981లో చనిపోయారు. అప్పటికి నాకు సుమారుగా ఇరవై ఏళ్ళు ఉంటాయి. నాకు, నా పదహారో ఏటనే పెళ్ళయ్యింది. అమ్మనే స్వయంగా దగ్గరుండి చేసింది. అమ్మతో నేను గడిపిందంతా చాలా క్వాలిటీ సమయమనే చెప్పాలి. ఎందుకంటే.. అమ్మ అప్పటికే ఎంతో బిజీ నటి. తెలుగు, తమిళ సినిమాల్లో ఖాళీ లేకుండా నటించేవారు. అయితే.. పిల్లల విషయంలో మాత్రం.. అమ్మ ఎంత షూటింగ్‌లతో బిజీ ఉన్నా.. మాకివ్వాల్సిన సమయం మాకిచ్చేవారు. ఎలా అంటే.. స్కూళ్ళకు సెలవులొస్తే.. కచ్చితంగా పిల్లలతో కలిసి ఎక్కడికో ఒక చోటకు వెళ్ళేలా టూర్‌ ప్లాన్‌ చేసేవారు. ముఖ్యంగా వేసవి సెలవులొస్తే.. నాన్న, అమ్మ, పిల్లలు, అమ్మమ్మ, పెద్దమ్మ కూతురు ఇలా.. అంతా కలిసి కొడైకెనాల్‌కి.. వెళ్లిపోయేవాళ్ళం. ఆ సమయంలో అమ్మ, నాన్న ఇద్దరూ.. షూటింగ్‌లు చేసేవారు కాదు. అమ్మకు పిల్లలంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే.. మేమే అని కాదు, పిల్లలెక్కడ కనిపించినా పిల్లలతో పిల్లలా.. కలిసిపోయేవారు. మా అందరితో ఆడేవారు.. పాడేవారు. సావిత్రమ్మ కనిపిస్తే పిల్లలూ అలాగే చుట్టిముట్టేసేవారు. మా ఇంట్లో అయితే.. అమ్మను ఓ పెద్దనటిగా ఎప్పుడూ చూడలేదు. అవేమీ మాకు కనిపించకుండా.. ఓ అమ్మగా.. ఆవిడ మాకు పంచిపెట్టిన ప్రేమ అలాంటిది.
**మీరు సినిమాల్లోకి ఎందుకు రాలేదు?
రాకూడదు అని ఎవరూ అనలేదు. అమ్మ ఉన్నప్పుడే.. నాకు చిన్నతనంలోనే పెళ్ళయిపోయింది కదా! ఇక అప్పటి నుంచి కంప్లీట్‌ ఫ్యామిలీ లైఫ్‌లోనే ఉండిపోయాను. నాకు ఇద్దరు అబ్బాయిలు.. అరుణ్‌, అభినరు. ఇద్దరికీ మీడియాతో సంబంధాలు ఉన్నాయి. అరుణ్‌ అయితే ఎడ్వర్టైజింగ్‌ రంగంలో ఉన్నాడు. చెన్నరు లయోలాలో విజువల్‌ కమ్యునికేషన్‌ కోర్సు చేశాడు. తర్వాత యుఎస్‌ఏలో ప్రత్యేక కోర్సులు చేశాడు. ప్రస్తుతం.. మీడియా రంగంలోనే ఊటీలో స్థిరపడ్డాడు. ఇక చిన్నోడు అభినరు యాక్టింగ్‌లో ఇంట్రెస్ట్‌ ఉంది. దాసరి నారాయణరావుగారు తీసిన ‘యంగ్‌ ఇండియా’ అనే సినిమాతో పరిచయమయ్యాడు. ఆ తర్వాత గ్యాప్‌ వచ్చింది. ఆ మధ్య గణిత శాస్త్రజ్ఞుడు రామానుజంపై తీసిన బయోపిక్‌ సినిమాలో ప్రధానపాత్ర చేశాడు. మంచి పేరొచ్చింది. నటనపై చిన్నోడికి ఆసక్తి ఉంది. మేమూ ప్రోత్సహిస్తున్నాం.
**షూటింగ్‌ల వల్ల అమ్మను మిస్సయ్యేవారా?
అమ్మ షూటింగ్‌లతో బిజీగా ఉండేది నిజమే.. కానీ, అమ్మ షూటింగ్‌లకి వెళుతున్నా.. అమ్మమ్మ.. మాతోనే ఉండేది. కనుక అమ్మ బిజీగా ఉందనే వెలితి కనపడేదికాదు. అయితే నేను ఆరో తరగతిలో ఉండగా అమ్మమ్మ చనిపోయారు. అప్పటి నుంచి కొంచెం.. కష్టమయ్యేది. ఎందుకంటే మా ఇంటికి బంధువులు.. నిత్యం వస్తూ పోతుండేవారు. అమ్మకేమో షూటింగులు. అమ్మమ్మ ఉండేటప్పుడు- ఏ ఇబ్బందీ ఉండేది కాదు. అయితే, ఇంట్లో అమ్మమ్మ లేని లోటు తెలియకుండా.. మాకు ఏమాత్రం స్కూళ్ళకు సెలవులొచ్చినా.. అమ్మ మమ్మల్ని షూటింగులకు తనతోపాటు తీసుకుపోయేది. అమ్మ షూటింగులన్నీ ఎక్కువ విజయ గార్డెన్స్‌లో చేసేవారు. అమ్మతో మేమెళ్ళినప్పుడు.. సాయంత్రం వరకూ అక్కడే ఉండేవాళ్ళం. అక్కడ రకరకాల ఫ్లోర్స్‌ ఉండేవి. వాటిల్లో రకరకాల సెట్స్‌ ఉండేవి. అవన్నీ మాకు ఎంతో విచిత్రంగా, ఆనందంగా తోచేవి.
ఇక్కడో విషయం చెప్పాలి. అమ్మ తొలిసారి విజయ గార్డెన్స్‌లోనే షూటింగ్‌ చేసింది. అమ్మనాన్న పెళ్ళి చేసుకున్నది చాముండేశ్వరి దేవాలయంలో.. ఈ రెండూ కలిసొచ్చేలా.. నాకు విజయ చాముండేశ్వరి అని పేరు పెట్టారు.
**సావిత్రమ్మ చనిపోయాక.. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారా?
చాలామంది.. అమ్మ చనిపోయాక.. మేమంతా.. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాం అనుకుంటారు. అందులో నిజం లేదు. ఒక్కటి మాత్రం నిజం.. అమ్మ ఎంతో సంపాదించింది. అలా సంపాదించిన వాటితో బంగారం, భూములు, ఆస్తులు ఎన్నో కొన్నది. కానీ, వాటి విషయంలో కొన్ని ఇన్‌కంటాక్స్‌ సమస్యలు.. అనుకోకుండా వచ్చిపడ్డాయి. దాంతో కొంత ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అలాగే, అమ్మకు దయాగుణం ఎక్కువ. అందరినీ నమ్మేస్తుంది. నమ్మడమే కాదు, ఎందరికో డబ్బు, నగలు, భూములు రూపంలో సహాయం చేసింది. కొన్నయితే.. ఐటీ సమస్యలు రాకుండా తెలిసినవారి పేరునా విలువైన ఆస్తులు కొంది. కానీ, కొంతమంది.. ఆ విషయంలో అమ్మను మోసం చేశారు. అది వాస్తవం. ఏదేమైనా.. ఆర్థిక సమస్యలు ఎన్ని వచ్చినాగానీ.. మేమంతా.. ఆ సమస్యలతో రోడ్డున పడిపోయామనే మాట అబద్ధం. అమ్మ ఉండగా ఎలా అయితే రాయల్‌గా ఉన్నామో.. ఆ తర్వాతా అలాగే ఉన్నాం. అలాంటి దారుణమైన సమస్యలు ఎప్పుడూ లేవు. అమ్మ అలా మాకు అన్నీ ఇచ్చి వెళ్ళింది.
**మీ వారు గురించి?
ఆయన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఒక రకంగా ఆయన మాకు దగ్గర బంధువే. అమ్మ విజయవాడలోనే పుట్టి పెరిగింది. మావారిదీ విజయవాడే. బంధుత్వం ఉండటంతో నాకిచ్చి పెళ్ళి చేశారు. ఆయన యువకుడుగా ఉన్నప్పుడే విద్యార్థి సంఘంలో పనిచేసేవారు. మాదాల రంగారావు ఆయన క్లాస్‌మేట్‌. ఇప్పటికీ వారందరితో.. టచ్‌లోనే ఉన్నారు.
**తమ్ముడు గురించి చెప్పండి?
నా తర్వాత ఏడేళ్ళకు తమ్ముడు సతీష్‌ పుట్టాడు. మా కుటుంబంలో.. నాన్నకు అందరూ ఆడపిల్లలే.. వీడొక్కడే మగపిల్లాడు. మగపిల్లాడి కోసం అమ్మ ఎన్నో మొక్కులు, పూజలు చేసేది. అమ్మ చనిపోయేటప్పుడు వాడు చాలా చిన్నపిల్లోడు. నాకప్పటికే పెళ్ళయిపోయింది కదా! అందుకని.. నాన్నతోనే ఉండి చదువుకున్నాడు. బెంగళూర్లో ఇంజనీరింగ్‌ చేశాడు. కంప్యూటర్స్‌లో ప్రావీణ్యం ఉంది. విప్రోలో పనిచేశాడు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో సెటిలయ్యాడు. తను తన క్లాస్‌మేట్‌ మళయాళీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి కొడుకు ప్రద్యుమ్న. మెడిసిన్‌ పూర్తిచేస్తున్నాడు. అంతా బావున్నారు.
మహానటి సినిమాలో చెప్పినట్టే.. అమ్మ ఒక అందమైన జాబిలి. జాబిలిని దగ్గరగా చూసిన మేమంతా.. ఆమె తీపి గుర్తులుగా మిగిలిన వాళ్ళం. ఆమెను ప్రాణప్రదంగా చూసే అభిమానులకు మేమేమివ్వగలం? ప్రేమతో కరచాలనం తప్ప. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు!
***నాన్న… ఫ్యామిలీతో మీ బంధం?
నిజానికి.. నాన్న… ఇతర ఫ్యామిలీ సభ్యులు.. వారికి కలిగిన సంతానం.. వారందరితో మాకు అంటే సావిత్రి గారి పిల్లలకు గొడవలు చాలానే ఉన్నాయని పుకార్లు ఉన్నాయి. అది నిజం కాదు. మేమంతా అప్పుడూ.. ఎప్పుడూ.. ఎప్పటికీ ప్రేమగానే ఉంటాం. ఉంటున్నాం. ఆస్తుల విషయంలోనూ ఎవరికీ తగాదాలు లేవు. అందరం బాగున్నాం. వీలున్నప్పుడల్లా కలుస్తూనే ఉంటాం. అంతకుమించి ఎంతో ప్రేమగా ఉంటాం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com