అయిదు కూడా రాబట్టుకోలేరు

బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌ మాల్యా గురించి కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో గతంలో పనిచేసిన ఉద్యోగులు ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆర్థిక మోసగాడైన మాల్యాను ఎలాగైనా భారత్‌కు రప్పించాల్సిందిగా ఉద్యోగులు తమ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. మాల్యా చేతులు రక్తంతో తడిసిపోయి ఉన్నాయని ఉద్యోగులు లేఖలో పేర్కొన్నారు. ‘మీ విదేశీ విధానాన్ని మేం అభినందిస్తున్నాం. మీ నాయకత్వంలో భారత్‌ హోదా పెరిగినందుకు మేమందరం గర్విస్తున్నాం. లండన్‌లో జీతాలు చెల్లించకపోతేనే దాన్ని నేరంగా పరిగణిస్తారు. అటువంటిది వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన విజయ్‌మాల్యాను ఎందుకని ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారని మేం అందరం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం.’ అని ఉద్యోగులు లేఖ ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పన్నులు ఎగ్గొట్టి పోయిన మాల్యాను పట్టుకోవడంలో విఫలమయ్యారు. కానీ మాల్యా చెల్లించాల్సిన పన్నులకు సంబంధించిన నోటీసులు ఇప్పటికీ మాకు అందుతున్నాయి. గతంలో ఓ సారి నిర్వహించిన పర్సనల్‌ మీటింగ్‌లో మాల్యా మాట్లాడుతూ.. ‘‘బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న రుణంలో నుంచి కనీసం 5శాతం కంటే ఎక్కువ నగదును కూడా బ్యాంకులు వసూలు చేసుకోలేవు’’ అని ధీమా వ్యక్తం చేశారు. అంటే దానర్ధం ఆయన వెనుక ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నారు. వాళ్లు మాల్యాకు సహాయం చేస్తున్నారు. దయచేసిన ఇటువంటి నేరస్థులను పట్టుకోండి. వేతన జీవులైన మేము సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నాం. కానీ ప్రజలను దోచుకొని వెళ్తున్న మాల్యా, నీరవ్‌ మోదీ వంటి వాళ్లు పన్నులు ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతున్నారు’ అని ఉద్యోగులు లేఖలో పేర్కొన్నారు. భారతీయ బ్యాంకులకు చెందిన రూ.3700కోట్లను బ్రిటన్‌ కేంద్రంగా పనిచేసే ఎఫ్‌1 మోటార్‌ స్పోర్ట్‌ సంస్థ, టీ20 ఐపీఎల్‌ జట్టుతో పాటు ప్రైవేటు జెట్‌ విమానాల్లో విహరించేందుకు విజయ్‌మాల్యాతో పాటు అతనికి సంబంధం ఉన్న రెండు కంపెనీలు వినియోగించాయని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా ఛార్జిషీటును దాఖలు చేసింది. అందులో మాల్యాను పరారీలో ఉన్న నేరస్థుడిగా ఈడీ ఆరోపించింది. ఈడీ ఛార్జిషీట్‌ బయటకు వచ్చిన మరుసటి రోజే గతంలో కింగ్‌ఫిషర్‌లో పనిచేసని ఉద్యోగులు మోదీకి, సుష్మాకి లేఖ రాశారు. దాదాపు రూ.9వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన మాల్యా 2016 నుంచి లండన్‌లో తలదాచుకుంటున్నాడు. అతడిని భారత్‌ రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com