అవలోకనం

డిసెంబరు-౩౦-2016
అమెరికాలో తెలుగు గుర్రపుస్వారీ
అపర్ణ బత్తుల దాస్‌.. పుట్టింది విశాఖపట్నంలో. పెరిగింది బెంగళూరులో. ఇప్పుడు అమెరికాలో జాకీగా రేసుగుర్రాలను పరుగులెత్తిస్తోంది. అమెరికాలో జాకీ లైసెన్స్‌ పొందిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది. ‘జాకీ రాణి’గా అందరి మన్ననలు అందుకుంటున్న అపర్ణ గురించి మరిన్ని విశేషాలు.. ఏదైనా నిర్భయంగా చేసే అలవాటు నాది. చిన్నప్పటి నుంచి గుర్రపు స్వారీ అంటే ఎంతో ఆసక్తి ఉండేది. వేగంగా పరిగెత్తే గుర్రాలను చూస్తుంటే నా మనసు కూడా అంతే వేగంగా పరిగెత్తేది. అప్పటికే మంచి అథ్లెట్‌గా పేరుంది. హాకీ క్రీడాకారిణిగా రాణించాను. జాతీయస్థాయి స్కేటింగ్‌ చాంపియన్‌ని కూడా. రకరకాల ఆటల్లో ప్రావీణ్యం ఉన్నా.. హార్స్‌రైడింగ్‌ నేర్చుకోవాలని కలలు కనేదాన్ని. గ్రాడ్యుయేషన్‌ తర్వాత గుర్రపు స్వారీనే ప్రొఫెషన్‌గా తీసుకోవాలని నిర్ణయించుకున్నా.
**అబ్బాయిలను మించిన వేగం
నా ఆశలు ఇలా ఉంటే.. మా ఇంట్లో వాళ్లకు మాత్రం ఎన్నో అనుమానాలు ఉండేవి. మా కుటుంబంలో ఎవ్వరికీ గుర్రపుస్వారీ రాదు. పైగా ఆడపిల్లను కావడంతో ఈ రంగంలో అవకాశాలు చాలా పరిమితం. ఎలా నెట్టుకువస్తుందో అని గాబారా పడిపోయారు. ఇవేవీ పట్టించుకోకుండా.. డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు బెంగళూరు టర్ఫ్‌ క్లబ్‌ (బీటీసీ)లోని అమెచ్యూర్‌ రైడింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో గుర్రపుస్వారీ శిక్షణ తీసుకున్నాను. ప్రతి రోజూ ఉదయం ట్రైనింగ్‌కు వెళ్లేదాన్ని. ఆ తర్వాత కాలేజీకి. పట్టుదలతో గుర్రపుస్వారీపై పట్టు సాధించాను. శిక్షణలో చేరిన కొన్నాళ్లకే నా వేగంతో అబ్బాయిలను సైతం అధిగమించాను. బీటీసీ జాకీ అసోసియేషన్‌ అప్పటి ప్రెసిడెంట్‌ సింక్లెయిర్‌ మార్షల్‌ నన్నెంతో ప్రోత్సహించారు. జాకీగా బయట దేశాల్లో అవకాశాలు బాగా ఉన్నాయని, రైడింగ్‌ను వదిలిపెట్టవద్దని సూచించారు.
**నేనొక్కదాన్నే..
బీటీసీలో శిక్షణ తర్వాత నా కెరీర్‌ ఊహించిన మలుపు తిరిగింది. గుర్రపుస్వారీలో ట్రైనింగ్‌ కోసం కెంటకీ లక్సిన్‌టన్‌లోని ‘నార్త్‌ అమెరికన్‌ రేసింగ్‌ అకాడమీ’ (ఎన్‌ఏఆర్‌ఏ)లో సీటు వచ్చింది. ఆ సంవత్సరం అక్కడ కోర్సుకు ఎంపికైన అంతర్జాతీయ స్టూడెంట్‌ని నేనొక్కదాన్నే. ఎలాగైనా అక్కడికి వెళ్లాలని నిశ్చయించుకున్నాను. అయితే మా బంధువులు నా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పెళ్లి చేసుకోమని ఉచిత సలహా ఇచ్చారు. ‘ఆడపిల్లను అంతదూరం పంపడం బాగోదు’ అంటూ మా నాన్నతో కూడా చెప్పారు. కానీ, మా నాన్న అవేవీ పట్టించుకోకుండా నన్ను కెంటకీ పంపించారు. అలా నాన్న సపోర్ట్‌తో ఎన్‌ఏఆర్‌ఏలో జాకీగా శిక్షణ తీసుకున్నా. అక్కడ గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక జాకీయింగ్‌ను వృత్తిగా చేపట్టాలనుకున్నాను. 2011లో మియామి గల్ఫ్‌సీ్ట్రమ్‌పార్క్‌లో జరిగిన రేసింగ్‌లో పాల్గొన్నాను. అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో రేసుల్లో గెలిచాను. నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగాను. జాకీ టు ట్రైనర్‌ హార్స్‌ రైడింగ్‌ చేస్తుండగా తీవ్ర గాయాలైన సందర్భాలు ఉన్నాయి. ఇవేమీ నాకిష్టమైన కెరీర్‌ని దూరం చేయలేకపోయాయి. తీవ్ర గాయాల కారణంగా జాకీ నుంచి ట్రైనర్‌గా మారాను. ఇందుకోసం ఎంతో శ్రమించాను. ఇతరులకు స్వారీ నేర్పించడానికి కావాల్సిన లైసెన్స్‌ కోసం అమెరికాలో పరీక్ష ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. మొత్తానికి చిన్న వయసులోనే ట్రైనర్‌గా లైసెన్స్‌ పొందగలిగాను. అమెరికాలో ఈ లైసెన్సు పొందిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు లభించింది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. అన్నింటినీ అధిగమించి నేనేంటో నిరూపించుకున్నాను. నేను పుట్టింది విశాఖపట్నంలో. బెంగళూరులో పెరిగాను. నా విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది. ఇప్పుడు అమెరికాలో ఇలా సెటిలయ్యాను. ఇండియాలో క్రికెట్‌కి ఉన్నంత ప్రాధాన్యం ఇతర క్రీడలకు ఇవ్వడం లేదు. అందులోనూ ఆడపిల్లలకు సంబంధించిన క్రీడలపై మరింత వివక్ష ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఇప్పుడు చాలామంది మహిళలు గుర్రపుస్వారీని కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.
###
నిశ్చితార్థం?
గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ ఓ ఇంటివారు కాబోతున్నారా..? ఈ ప్రేమపక్షుల ప్రేమ ప్రయాణంలో కొత్త సంవత్సరం రోజు సరికొత్త అడుగుపడనున్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ ఉత్తరాఖండ్‌ విహారయాత్రలో ఉన్నారు. ఈనెల 31న న్యూ ఇయర్‌ వేడుకల్లో పాల్గొనబోతున్న ఈ జంట మరుసటి రోజు…అంటే జనవరి ఒకటో తేదీన నిశ్చితార్థం చేసుకోనున్నట్టు చెబుతున్నారు. ఉత్తరాఖండ్‌, నరేంద్ర నగర్‌లోని ఆనంద రిసార్ట్‌లో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకోనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఎంగేజ్‌మెంట్‌కు ఇరు కుటుంబాలకు చెందిన దగ్గరి బంధువులతోపాటు సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌, అనిల్‌ అంబానీ కూడా హాజరుకానున్నట్టు తెలిసింది. అమితాబ్‌, జయా బచ్చన్‌, అనిల్‌లు ఇప్పటికే డెహ్రాడూన్‌ చేరుకోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. వీరు ముంబయి నుంచి గురువారం మధ్యాహ్నం డెహ్రాడూన్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. అక్కడినుంచి ఆనంద రిసార్ట్‌కు చేరుకున్నారు. ఇదే రిసార్ట్‌లో కోహ్లీ-అనుష్క జోడీ ఈనెల 24 నుంచి ఉంటున్నారు. ప్రముఖులు బసచేసిన ఈ రిసార్ట్‌కు భద్రతను పెంచినట్టు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ తెలిపారు. కాగా బుధవారం కోహ్లీ జంట హరిద్వార్‌లోని ఓ ఆశ్రమాన్ని సందర్శించుకున్నారు. అక్కడ ఆశ్రమ ముఖ్యులు గురు అనంత మహరాజ్‌తో ఫొటో కూడా దిగారు. అయితే ఇతరత్రా వివరాలు వెల్లడించేందుకు మహరాజ్‌ నిరాకరించారు. కాగా, 2010లో వన్డే కెప్టెన్‌ ధోనీ వివాహం కూడా డెహ్రాడూన్‌లోనే జరిగిన సంగతి తెలిసిందే. అనుష్క తమ రాష్ర్టానికే చెందిన అమ్మాయి కావడంతో అక్కడి ప్రజలు ఈ వార్తలపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.
###
రకుల్‌ దిగ్ర్భాంతి!
అభిమానం హద్దులు దాటితే ఉన్మాదంగా మారుతుంది. స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇలా వెర్రిగా అభిమానించే ఫ్యాన్స్‌ ఒక్కోసారి ఉన్మాదులుగా మారుతున్నారు. అలాంటి ఓ వీరాభిమాని చేసిన పని స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. బాలీవుడ్‌ హీరోయిన్‌ సీరత్‌ కపూర్‌కు ఓ వీరాభిమాని రక్తంతో ప్రేమలేఖ రాశాడు. ఆమెపై తనకున్న ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ రక్తంతో ఆమెకు ప్రేమలేఖ రాశాడు. ఆ వీరాభిమాని చేసిన ఈ పని తనకు ఎంతో ఆవేదన కలిగించిందని, దయచేసి ఇలాంటి పనులు చేయవద్దని ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేసింది సీరత్‌. ముందుగా మీ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చుకోవాలని, తర్వాతే ఇతరులను అభిమానించాలని హితువు చెప్పింది. హీరోహీరోయిన్లపై అభిమానంతో మీకు మీరు హాని తలపెట్టుకోవద్దని నటుల అందరి తరపునా ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌కు స్పందించిన రకుల్.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ‘ఇది చాలా దారుణం. ప్రతి వ్యక్తి తనను తాను గౌరవించుకోవాలి. జీవితం చాలా విలువైనది’ అని రీ ట్వీట్ చేసింది.
###
నుతన సంవత్సర శుభాకాంక్షాలు వివిధ భాషల్లో
ఇంగ్లిష్: హ్యాపీ న్యూ ఇయర్
హింది: నయసాల్ ముబారక్
ఆరబ్భి:కులామ ఉ అంటుం సాలిమౌన్
బ్రెజిలీయన్: బావోస్ ఫెస్తవ్ ఎ ఫెలిజ్ ఆనొ నొవొ
చైనీస్: యు షెంటాన్
డచ్: గుల్లుక్కిగ్ న్యు జార్
ఫిన్నిస్: ఎన్నెల్లిస్తా వుట్ట ఒట్ట
ప్రెంచి: బోన్నె అణ్ణె
జర్మన్ : ప్రోసిట్ న్యు జార్
ఇరిష్: బ్లియాన్ నువా ఫి మహైసీ ధుఈట్
ఇటాలియన్: భువోస్ కపొడలన్నొ
రష్యన్: ఎస్ నోవిం గొదాం
వియత్నమిస్: కుంగ్-చుక్ టాన్-జువాన్ @శ్రీనివాస్,గంపలగూడెం
###
‘కొత్త ‘ నమ్మకాలు
జనవరి 1. కొత్త సంవత్సరానికి మొదలు. అందరూ సంబరాలు చేసుకునే రోజు. అయితే కొత్త సంవత్సరపు తొలి రోజు విషయంలో కూడా నమ్మకాలు ఉన్నాయి. కొన్ని నిజమేననిపిస్తాయి. కొన్ని… నిజమా అని ఆశ్చర్యపోయేలా చేస్తాయి.
**బ్రెజిల్లో..
బ్రెజిల్లో పప్పుధాన్యాలను సంపదకు చిహ్నంగా భావిస్తారు. న్యూ ఇయర్ మొదటి రోజున అన్ని రకాల పప్పుదినుసులనూ వేసి చేసిన సూప్ తాగుతారు. ఆ రోజు అందరూ తెల్ల దుస్తులు మాత్రమే వేసుకుంటారు!
**బొలీవియా..
బొలీవియాలో చిన్న చెక్కతో గానీ స్ట్రాలతో గానీ చేసిన బొమ్మలను గుమ్మాలకు వేళ్లాడదీస్తారు. అలా చేస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని అంటారు!
**మెక్సికో..
మెక్సికోలో సంవత్సరం చివరి రోజు అర్ధరాత్రి గ్రీన్ గ్రేప్స్ తింటారు. పన్నెండు గంటలు కొట్టేలోపు గంటకో ద్రాక్షపండు తింటే శుభం చేకూరుతుందని విశ్వాసం వారికి!*
**బ్రిటన్..
బ్రిటన్ లో సంవత్సరం చివరి రోజు రాత్రి ఎవరైనా పురుష అతిథులు వస్తే కొత్త సంవత్సరంలో అంతా మంచే జరుగుతుందట. స్త్రీలుగానీ, ఎర్రజుత్తున్న వ్యక్తులు కానీ వస్తే సంవత్సరమంతా దురదృష్టం వెంటే వస్తుందంటారు!
**ఐర్లాండ్‌..
ఐర్లాండ్‌లో న్యూ ఇయర్ ముందురోజు రాత్రి ఇళ్ల కిటికీలన్నీ తెరిచేస్తారు. గాలి దిశను బట్టి వచ్చే యేడు ఎలా ఉంటుందో అంచనా వేస్తారు. తూర్పు నుంచి గాలి వీస్తే ఆహారం సమృద్ధిగా ఉంటుందని… అదే పడమటి నుంచి వీస్తే అంతా నష్టమేనని నమ్ముతారు!
**జర్మనీ..
జర్మనీలో సీసం కరిగించి చల్లటి నీటిలో వేస్తారు. ఏర్పడే ఆకారాన్ని బట్టి భవిష్యత్తు అంచనా వేస్తారు. హృదయాకారం వస్తే పెళ్లి అవుతుందని, పడవ ఆకారం వస్తే ప్రయాణాలు ఎక్కువ చేస్తారని, పంది ఆకారం వస్తే సమృద్ధిగా ఆహారం దొరుకుతుందని విశ్వాసం.
**డెన్మార్క్..
న్యూ ఇయర్ ముందురోజు డెన్మార్క్ వాసులంతా కుర్చీల మీదికి ఎక్కి కిందికి దూకుతుంటారు. అలా చేస్తే దుష్టశక్తులు దూరంగా పారిపోతాయని అంటారు!
**ఇటలీ..
ఇటలీలో న్యూ ఇయర్ నాడు మంచి జరుగుతుందని ఎర్ర రంగు లోదుస్తులు వేసుకుంటారు!*
**ప్యూర్టోరికో..
ప్యూర్టోరికోలో పిల్లలు సంవత్సరం చివరి రోజు అర్ధరాత్రి కిటికీల నుండి నీళ్లు కిందికి కుమ్మరిస్తుంటారు. ఇంటిలోని కష్టాలను, సమస్యలను బయటకు తోసివేస్తున్నట్లు అర్థం దీనికి. కొత్త యేడు ఇక ఏ సమస్యలూ తమ దగ్గరకు రావనే విశ్వాసం ఉంది దీని వెనుక!
**వెనిజులా..
వెనిజులాలో కొత్త సంవత్సరంలో తమ ప్రేమ పండాలనుకునేవారు ఎరుపురంగు లోదుస్తులు వేసుకుంటే, అన్ని రకాల శుభాలూ చేకూరాలనుకునేవారు పసుపురంగువి ధరిస్తారు!
**జపాన్‌..
జపాన్‌లో వారం రోజుల ముందే న్యూ ఇయర్ వేడుకలు మొదలవుతాయి. సంవత్సరం మొదటి రోజున మాత్రం అందరూ తమ కోరికలు, ఆశలు, లక్ష్యాలను కాగితాల మీద రాస్తారు. అలా చేస్తే అవన్నీ నిజమవుతాయట!
**ఫిలిప్పీన్స్..
ఫిలిప్పీన్స్ న్యూ ఇయర్ డే వెరైటీగా ఉంటుంది. అన్నీ గుండ్రంగా ఉండేవాటినే ఉపయోగిస్తారు. గుండ్రటి చుక్కలున్న దుస్తులు వేసుకుంటారు. గుండ్రటి పండ్లు తింటారు. గుండ్రంగా ఉండే కుకీస్, కేక్స్ ఆరగిస్తారు. నాణాలు గుండ్రంగా ఉంటాయి కాబట్టి, అవి సంపదకు చిహ్నం కాబట్టి అలా చేస్తారట! @శ్రీనివాస్,గంపలగూడెం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com