అవే ఇష్టం

నిరుడు మహిళల వన్డే ప్రపంచకప్‌ ఆడే సమయానికే మిథాలీ రాజ్‌ 35వ పడికి చేరువైంది. ఆ టోర్నీనే తన చివరి ప్రపంచకప్‌ అని స్వయంగా ప్రకటించింది మిథాలి. ఈ టోర్నీతో మిథాలీ కెరీర్‌కు తెరపడినట్లే అనుకున్నారంతా. కానీ ఆ ప్రపంచకప్‌ ప్రదర్శన ఇచ్చిన ఊపో.. అమ్మాయిల ఆటకు ఆదరణ పెరిగిందన్న ఉత్సాహమో కానీ.. మిథాలీలో ఇప్పుడు కొత్త జోష్‌ కనిపిస్తోంది. ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలో మిథాలీ ఆటే ఇందుకు నిదర్శనం. వన్డే సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించిన మిథాలీ.. టీ20 సిరీస్‌లోనూ సత్తా చాటి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు అందుకుంది. 4 మ్యాచ్‌ల్లో 3 అర్ధ సెంచరీలతో అదరగొట్టింది. ఇక సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే సమరానికి సిద్ధమైంది. మార్చి 12న వడోదరాలో ఆసీస్‌తో తొలి వన్డే నేపథ్యంలో ముఖాముఖి సందర్భంగా వివిధ అంశాలపై మిథాలీ ఏమందంటే..దక్షిణాఫ్రికా సిరీస్‌ను ఆస్వాదించాం. వన్డే, టీ20 సిరీస్‌ విజయాలతో జట్టులో కొత్త ఉత్సాహం వచ్చింది. విదేశీ గడ్డపై సిరీస్‌ గెలిస్తే ఆ మజానే వేరు. జట్టులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. వన్డే, టీ20 సిరీస్‌లలో క్రీడాకారిణులు అద్భుతంగా రాణించారు. బాధ్యతలు పంచుకునేవారి సంఖ్య పెరగడం సానుకూలాంశం. అనుభవజ్ఞులు.. యువ క్రీడాకారులతో జట్టు బాగుంది. కేవలం అనుభవజ్ఞులు.. కేవలం యువ క్రీడాకారిణులు ఉంటే ఫలితాలు రావు. రెండింటి కూర్పు సరిగ్గా కుదిరినపుడే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. ప్రస్తుత జట్టులో అనుభవం.. యువ రక్తం రెండూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఫార్మాట్‌కు తగ్గట్లు ఆటను మార్చుకోవాలి. టీ20ల్లో ఎక్కువ సమయం ఉండదు. తొలి బంతి నుంచే బాదుడు మొదలుపెట్టాలి. క్రీజులో నిలదొక్కుకునేందుకు పెద్దగా అవకాశం ఉండదు. ప్రతి బంతినీ బాదే క్రమంలో వీలైనన్ని ఎక్కువ షాట్లు ఆడతాం. కొన్ని వినూత్నమైన షాట్లను టీ20ల్లోనే ఆడగలం. వన్డేల్లో అలా కాదు. క్రీజులో కుదురుకోడానికి సమయం ఉంటుంది. మంచి స్థితికి చేరుకున్నాకే షాట్లు ఆడతాం. టీ20 ఫార్మాట్‌ నా ఫేవరెట్‌ కాదు. వన్డేలంటేనే నాకిష్టం. కంగారూలతో సిరీస్‌ సవాలే. ఆస్ట్రేలియా బలమైన జట్టు. మేం సొంతగడ్డపై ఆడుతున్నా ప్రత్యర్థే మా కన్నా కొంచెం బలంగా ఉంది. దక్షిణాఫ్రికాలో రెండు సిరీస్‌లు గెలిచినా.. ఆసీస్‌ను నిలువరించడం అంత సులువేం కాదు. ఇది ఐసీసీ టోర్నీ. వచ్చే వన్డే ప్రపంచ కప్‌కు అర్హత పాయింట్లు రాబట్టడానికి ఈ సిరీస్‌ చాలా కీలకం. సొంతగడ్డపై ఆడుతుంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఐసీసీ ప్రపంచ కప్‌ సెమీఫైనల్లో చివరిసారిగా ఆడిన మ్యాచ్‌లో ఆసీస్‌పై పైచేయి సాధించాం. ఆ గెలుపు స్ఫూర్తితో మళ్ళీ సత్తా చాటడానికి ప్రయత్నం చేస్తాం. ఐతే ప్రపంచ కప్‌ తర్వాత చాలా విరామం వచ్చింది. క్రీడాకారిణులు కలిసికట్టుగా ఆడటం ముఖ్యం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com