అస్త్రసన్యాసి ఉండవల్లి

తెదేపా, భాజపా కలయిక వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మేలు జరుగుతుందని భావించినట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చెప్పారు. అంతకుముందు జరిగిన అవకతవకలేమైనా ఉంటే అటు ప్రధానిగా నరేంద్రమోదీ ఇటు అనుభవమున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే చాలా మేలు జరుగుతుందని భావించి 2014లో మద్దతు ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు. ప్రశాసన్‌నగర్‌లోని జనసేన కార్యాలయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో సమావేశం అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడుతూ.. చాలా సార్లు కొన్ని ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పటికీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రానికి ప్రతీ చిన్నదానికి గొడవ చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకని కొంత సంయమనం పాటించానని వెల్లడించారు. ప్రజల మాదిరిగానే తనకూ కొంత గందరగోళం ఉందని.. ప్రత్యేక హోదా, హామీలు నెరవేర్చకపోవడం వల్ల అందిరిలాగే తనకూ అసంతృప్తి ఉందని తెలిపారు. అందరికంటే తాను బాధ్యతగా భావిస్తున్నానని.. తనను ఎవరూ రాజకీయాల్లోకి రావాలని చెప్పలేదని తనకు స్వతహాగా అనిపించి ప్రజలకోసం వచ్చానన్నారు. కానీ, వచ్చాక జరుగుతున్న పరిస్థితులను చూసి రెండు మూడు సభలను పెట్టానని చాలా విషయాలపై ప్రశ్నించానని, తనకు స్పష్టమైన సమాచారం రాలేదన్నారు. పోలవరంపై శ్వేతపత్రం కోసం ప్రశ్నిస్తే వెబ్‌సైట్‌లో పెట్టామని చూసుకోవాలన్నారని అయితే, అదెక్కడా కనపడలేదని చెప్పారు. గతంలో తాను ఏవైతే మాట్లాడానో.. ఈ మధ్య కాలంలో వాటిపైనే రాష్ట్రప్రభుత్వం గొడవలు చేయడం చూసి ఇప్పటిదాకా కాలయాపన ఎందుకు చేశారా? అని బాధేసిందన్నారు. రెండు పార్టీలు న్యాయం చేయలేని పక్షంలో తనవంతు బాధ్యతగా వారిని ప్రశ్నించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ఎక్కువే ఇచ్చామని కేంద్రంలోని భాజపా చెబుతోందని.. మరోవైపు రాష్ట్రానికి రావాల్సినవేవి సక్రమంగా రావడంలేదని అంతా అస్తవ్యస్తంగా ఉందని రాష్ట్రం చెబుతోందన్నారు.ఈ పరిస్థితుల్లో తనవంతు బాధ్యతగా ఎదో ఒకటి చేయాలనుకున్నప్పుడు.. రాజకీయాలకు సంబంధం లేకుండా అస్త్రసన్యాసం చేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌గారు గుర్తుకొచ్చారన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీతో విభేదించి రాజకీయాల నుంచి వైదొలిగారని.. ఆయనైతే సమస్యను తటస్థంగా చూడగలుగుతారని.. ప్రజల సమస్యలను అర్థవంతంగా చెప్పగలరని భావించానన్నారు. అందుకే ఉండవల్లి, జేపీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రం ఎంతైతే నిధులు ఇచ్చిందంటున్నారో దాని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మరోవైపు భాజపా సైతం కేంద్రం ఇచ్చిందని చెబుతుందన్న వివరాలు ఇవ్వాలని చెప్పారు. వాటిని కమిటీకీ అందజేస్తానని చెప్పారు. కచ్చితంగా ఇద్దరిలో ఒకరు మాత్రం అబద్ధం ఆడుతున్నారని చెప్పారు. అదేవరో తేల్చాలని అన్నారు. వివరాలన్నీ తీసుకుని కమిటీ తేలుస్తుందని చెప్పారు. తాము అడుగుతున్న వివరాలను అందజేయాలని ప్రెస్‌మీట్‌ ద్వారా కోరుతున్నానన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com