ఆంధ్రుల ఇంద్రుడు రామచంద్రుడే-TNI ప్రత్యేకం

*** పునరుద్ఘాటించిన ప్రవాస పసుపు సేన
*** డల్లాస్‌లో చరిత్ర సృష్టించిన ప్రవాస తెదేపా

దేవతల అధినేత ఆ ఇంద్రుడు అయితే…అమరావతి నిర్మాణాన్ని, ఆంధ్రుల అభ్యున్నతిని ముందుండి మున్ముందుకు నడిపించే ఇంద్రుడు “రామచంద్రులే”నని ప్రవాస తెదేపా పునరుద్ఘాటించింది. ఆది-సోమవారాల్లో డల్లాస్‌లో సెయింట్ మార్‌తోమా చర్చిలో నిర్వహించిన మొట్టమొదటి అమెరికా మహానాడు ఎంతో ఉత్సాహోల్లాసల నడుమ ఎన్నో కొంగొత్త మైలురాళ్లను అందుకుంది. తెదేపా అంటే తెలుగుదేశం పార్టీ కాదు ట్రెండ్ డిజైనింగ్ పార్టీ అని మరోసారి డల్లాస్ ప్రవాస తెదేపా సేనలు నిరూపించాయి. 11నెలల్లో అధికారం కైవసం చేసుకున్నా, ఓ ప్రాంతీయ పార్టీకి ప్రపంచవ్యాపితమైన ప్రవాస విభాగాలు ఏర్పడినా, 70లక్షల సభ్యులు కలిగి ఉందనే భుజకీర్తులు తళుక్కుమన్నా, చెప్పులు వేసి అవమానించి తిరిగి అదే వ్యక్తిని దేవుడని దండలేసినా ఆ ట్రెండ్డు సౌండ్డు ఒక్క టీడీపీకే సొంతం. భాజపా, కాంగ్రెస్ వంటి జాతీయస్థాయి పార్టీలకు ప్రవాస విభాగాలు చాలా కాలంగా ఉన్నాయి. ఆయా సభ్యులు మహానాడు వంటి కార్యక్రమాలు సైతం ఈపాటికే ఎన్నోసార్లు నిర్వహించుకున్నారు. కానీ ఓ ప్రాంతీయ పార్టీ పెద్ద స్థాయిలో ప్రవాసంలో మహానాడు అనే అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించడం నిత్యనూతనమైన ఆలోచనగానే చెప్పుకోవాలి. ఒక పోకడకు పురుడు పొసే విధానం తెదేపా సొంతమని మరోసారి రుజువైంది.

ఓ సాధారణ నటుడు అసాధారణ నిర్ణయాలతో విశేషాదరణ తోడు రాగా అనతికాలంలో అధికార సమారాధనకు ఉత్సవ విగ్రహంగా సమాదరణకు నోచుకోవడం అద్భుతం, అద్వితీయం. ఆ దేవుడి అంతర్థానం తర్వాత కూడా అనుమానం లేని అభిమానం కార్యకర్తలను పార్టీ బలోపేతానికి పురికొల్పడం నమ్మిన సిద్ధాంతాలకు తెలుగువారు ఇచ్చే గౌరవానికి నిలువుటద్దం. అటువంటి కార్యకర్తల ఆలోచన నుండి ఉద్భవించిన వినూత్న ఆలోచనే-డల్లాస్ మహానాడు. తెలుగు రాష్ట్రాల్లో మహానాడు అంటే నెలరోజులకు పైగా ప్రణాళిక, పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వంటలు, రవాణా, వేదిక, తీర్మానాలు వంటి ఎన్నో సంక్లిష్టమైన అంశాల సమాహారం. వీటన్నింటినీ ఖచ్చితమైన సమన్వయంతో నిశ్చితమైన సంకల్పంతో ఎటువంటి లోటు లేకుండా నిర్వహించిన డల్లాస్ తెదేపా శ్రేణులు అభినందనీయులు.
2018 dallas mahanadu telugudesam

మహానాడు తొలిరోజున “తెలుగు NRI ప్రత్యేక హోదా పోరాట సమితి” పేరిట నిశీధి వేషధారులు మహానాడు వేదిక వెలుపల నిరసనకు దిగడం అనూహ్యం. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో తాము ఎలా పోరాడుతున్నామో, పోరుబాటలో ఎలా సంసిద్ధులు కావాలో సభ లోపల ప్రతినిధులు చర్చిస్తుంటే వెలుపల మాత్రం వైఫల్యాల పేరిట ప్లకార్డుల ప్రదర్శన కించిత్ మూర్ఖత్వమనే చెప్పాలి. ప్రపంచం ముందుకు కదులుతోందని సూర్యుడి గమనం ద్వారా ప్రజలు గుర్తిస్తుంటే, నా గదిలో దీపపు నీడ జరగట్లేదనే ఆక్షేపణ చందంగా – కేంద్రంతో పోరాడుతూ రాష్ట్రాన్ని తెదేపా ముందుకు తీసుకుపోతోందని ప్రజలు గుర్తిస్తుంటే, కలిసిరావడం మానేసి తమ పార్టీ “పంఖాల” కింద కూర్చుని పగ్గాల కోసం నిరసన తెలపడం హాస్యాస్పదం. ఓనాటి మిత్రుడైనా ఏ మాత్రం తటపటాయించకుండా న్యూజెర్సీలో ప్రవాస తెదేపా శ్రేణులు భాజపా సదస్సుకు వెళ్లి, ప్రత్యక్షంగా కేంద్ర స్థాయి ప్రతినిధులను ధైర్యంగా ఎదుర్కొని ప్రత్యేక హోదా, కేంద్ర నిధులు వంటి వాటిపై బహిరంగంగా నిలదీశారు. అదే ధైర్యం ఈ నిరసనకారులకు లేకపోవడం దురదృష్టకరం. ప్రవాసంలో నిబద్ధత కలిగిన పాత్రికేయులకు ఊస్టింగ్ ఉత్తర్వ్యూలు ఇచ్చి, ప్రేక్షకుడు పంపే ప్రతి పోరంబోకు వార్తను పతాక శీర్షికకు ఎక్కించే పత్రికలు ఈ మహానాడును కూడా నిరసనకారుల పత్రికా ప్రకటనల ఆధారంగా అపవిత్రం చేశాయి. “మహానాడు లోపల ఉన్నవారి సంఖ్య కన్నా వెలుపల నిరసన తెలిపిన వారి సంఖ్య అధికం“గా ఉందనే వాక్యానికి నిజానిజాలు తెలుసుకోకుండా సెన్సేషన్ కోసం గొడుగులు పట్టిన మూర్ఖ తెలుగు పత్రికా సంపాదకులది అమాయకత్వానికి పరాకాష్ఠ. ఆధారసహిత వివరాలు ఇవి…

1. మహానాడు సభాస్థలిలో వేసిన మొత్తం బల్లలు సంఖ్య – 110
2. బల్లకు 10కుర్చీల లెక్కన మొత్తం కుర్చీల సంఖ్య – 1100
3. ఆదివారం సాయంత్రం కిక్కిరిసిన సభా ప్రాంగణంలో కుర్చీలు ఖాళీ లేక గోడలకు ఆనుకుని అభిమానం చాటిన ప్రవాసుల సంఖ్య – 400
4. భోజనాలకు వినియోగించిన మొత్తం ప్లేట్ల సంఖ్య – 4500. మనిషికి మూడు ప్లేట్లు చొప్పున వేసుకున్నా మొత్తం అతిథుల సంఖ్య 1500.

అంటే ఈ మహానాడుకు సుమారుగా 1500-2000 మధ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారని గణాంకాలే చెప్తున్నాయి. పోనీ కుర్చీలు ఖాళీ, ప్లేట్లు చించి పారేశారనుకున్నా మార్‌తోమా చర్చి కారు పార్కింగ్ నిండినందుకు అయినా కనీసం 500మంది వచ్చారని అనుకోవచ్చు కదా! అమెరికాలో ఆలిని విడిచే మగాళ్లు ఉంటారేమో గానీ ఉత్త పుణ్యానికి వాహనాలు విడిచి వెళ్లే వెర్రి వెధవలు ఉండరని మనవి. ఏది ఏమైనా మహానాడును బద్నాం చేసేందుకు నిరసనకారులు మీడియాను చాలా తెలివిగా వాడుకున్నారన్నది ఒప్పుకోవల్సిన వాస్తవం. అది వారి విజయం. దాన్ని ధాటిగా సమయానుకూలంగా ఎదుర్కోకపోవడం నిర్వాహకుల వైఫల్యం.

అమెరికా నలుచెరుగుల నుండి కార్యకర్తలు భారీ స్థాయిలో ఈ మహానాడుకు రావడం మొదటి విజయం. స్థానికులు కూడా భారీసంఖ్యలో హాజరుకావడం డల్లాస్ విభాగ పట్టుకు నిదర్శనం. రెండో విజయం. రాయలసీమ-తెలంగాణా-కోస్తా మూడు ప్రాంతల నుండి అతిథులు రావడం మూడో విజయం. చంద్రబాబు ప్రత్యక్షంగా ఫోను చేసి మాట్లాడటం నాలుగో విజయం. డల్లాస్ శ్రేణుల శ్రమకు ప్రవాస తెదేపాను తెదేపా అధికారిక విభాగాల్లో ఒక్కటిగా జేర్చేందుకు తీర్మానం ప్రవేశపెట్టడం అయిదో విజయం. ఈ పంచవిజయాలు ఆ పంచభూతాలు తోడురాగా 2019 ఎన్నికల్లో అధికార పీఠంపై తెదేపా పాదం మోపుతుందో లేదో వేచి చూడాలి.

తెలుగు సంఘాల్లో ఆటపాటలు, భోజనాలు, సంస్కృతి, సాంప్రదాయలు వంటి వాటి కోసం ఇప్పటి వరకు ప్రవాసులు తమ సమయాన్ని ఎక్కువగా వెచ్చించేవారు. ఈ మహానాడుతో జన్మభూమి సేవకు, సామాజిక బాధ్యతకు కూడా తాము కంకణబద్ధులమని మరోసారి నిరూపించారు.

అన్నా అని ఎవరన్నా, ఎప్పుడన్నా, ఎక్కడన్నా పిలిచినా తలచినా రుధిరమనే ప్రవాహం ఉత్తుంగ తరంగమై ఉప్పొంగకుండునా….అంటూ ఎన్‌టీఆర్ 96వ జయంతి ఉత్సవాలను కూడా ఈ మహానాడులో నిర్వహించడం కాయం నశిస్తుంది గానీ అది నిర్వర్తించిన కర్తవ్యం మాత్రం కీర్తిమంతంగా నిలుస్తుందనే వాస్తవానికి సాక్షీభూతం.

తారకరాముడు చెప్పినట్టు – తెలుగుదేశం శ్రామికుల చెమటలో నుండి, కార్మికుల కరిగిన కండరాల్లో నుండి, రైతుకూలీల రక్తంలో నుండి, నిరుపేదల కన్నీటిలో నుండి, కష్టజీవుల కంటిమంటల్లో నుండి, అన్నార్తుల ఆక్రందనల్లో నుండే గాక ప్రవాసుల ప్రేమాభినాల నుండి మరోసారి పునరుజ్జీవం పోసుకుంటోంది.—సుందరసుందరి(sundarasundari@aol.com)

tgas: 2018 mahanadu dallas grand success telugudesam dallas ganta cmramesh jayaram komati vemana satish telugudesamparty tdpdallas nrtdpusamahanadu

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com