“ఆటా-టాటా” చెట్టాపట్టాల్. ప్రవాస సంఘాలకు గట్టిపాఠాల్:TNI ప్రత్యేకం


“కరుణ కురిపించు. హరిని మరిపించు.” ఈ సూత్రం ప్రపంచశాంతికి తారకమంత్రం. ఇప్పుడు ప్రవాస తెలుగు సంఘాల మధ్య నూతన క్రాంతికి కూడా ఇదే సరికొత్త తంత్రం. అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) అధ్యక్షుడు డా.ఆసిరెడ్డి కరుణాకర్, తెలంగాణా అమెరికా తెలుగు సంఘం(టాటా) అధ్యక్షులు డా.హరనాథ్ పొలిచెర్లల సంయుక్త స్నేహసౌరభాల సొగసులో డల్లాస్‌లో నిర్వహించిన అమెరికా తెలుగు మహాసభలు ప్రవాస తెలుగు సంఘాల మధ్య చిగురించవల్సిన సౌహార్ద వాతావరణాన్ని ముంజేతి కంకణంగా ప్రకాశింపజేశాయి. తక్కువలో తక్కువగా కనీసం మిలియన్ డాలర్ల ఖర్చుతో ప్రతి ఏటా మే, జూన్, జులై నెలల్లో అమెరికాలో ఏదో ఒక జాతీయ స్థాయి తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలుగు సభలు సందడిగా జరుగుతుంటాయి. ఆటా-టాటా సభలు కూడా సుమారుగా ఇదే మొత్తాన్ని ఖర్చు చేసినప్పటికీ వారు రచించిన చరిత్ర, సృష్టించిన ఒరవడి ప్రతి జాతీయ స్థాయి తెలుగు సంస్థకు ఓ విలువైన ప్రాథమైక సూత్రం. మా సభలకు వాళ్లు వస్తారు, వాళ్ల సభలకు మేము వెళ్తాం…మీడియా ముదనష్ట గోల కోసం వేదిక మాత్రం పంచుకునే ప్రసక్తే లేదనే చందంగా తయారైన నాయకాగణం ఈ సభల నుండి అయినా “అహము వీడి కలిసి ఉంటే అర్హత పెరిగి కలదు సుఖం” అనే నానుడిని ఒంటబట్టించుకుంటారేమో వేచిచూడాలి. Joint Advisory Coungil(JAC), Joint Executive Committee(JEC) పేరిట ప్రతి బాధ్యతలోనూ సమతుల్యాన్ని పాటించిన నిర్వాహకులు ఎక్కడా పొరపచ్చలకు తావులేకుండా మసులుకోవడం స్నేహానికి తెలుగువారు ఇచ్చే విలువకు నిదర్శనం. Joint అనే పదానికి ఇద్దరితోనో ఆగిపోవాలని ఏ నిఘంటువులోనూ లేదు గనుక అది మూడు, నాలుగు, అయిదు, వందగా కూడా పురోగమించవచ్చు.
2018 dallas american telugu convention ata tata tnilive telugu news international tni tnilive

2016లో డల్లాస్‌లో నిర్వహించిన నాటా సభల్లో ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రేమ్‌సాగరరెడ్డి మాట్లాడుతూ…సమీప భవిష్యత్తులో నాటా, టాటాలు కలిసి తమ అమ్మ “ఆటా” ఒడిలో ఆడుకుంటూ కలిసికట్టుగా ఒకే వేదికను పంచుకుంటామని ప్రకటించిన దరిమిలా ఎన్నో చర్చోపచర్చలు విస్తృతంగా జరిగాయి. ఆఖరి నిముషంలో ఏమి జరిగిందో తెలియదు గానీ అమెరికా తెలుగు మహాసభల నిర్వాహక సంస్థల జాబితా నుండి నుండి నాటా నిష్క్రమించింది. ఈ అంశంపై మొన్న జరిగిన డల్లాస్ ఆటా-టాటా సభల్లో…”హరి కరుణ తమపై కురవడానికి అహంతో కూడుకున్న భక్తిప్రేమలు సరిపోలేదని” పరిసార్లు ప్రేమ్‌రెడ్డి వాపోవడం ఐకమత్యానికి తాను ఎంతటి విలువ ఇస్తున్నానో తెలియజెప్పిన వాస్తవం. అమెరికా తెలుగు సంఘాల చరిత్రలో సరికొత్త శకానికి సంతకం చేసేందుకు తమ కలం కాలంతో కలిసిరాకపోవడం విచారకరం అన్న ఆయన మాటలు స్మరణీయం.


అమెరికా తెలుగు మహాసభల్లో పాలుపంచుకున్న సంస్థలు వాటి స్ఫూర్తి ఎదుట సభల నిర్వహణ, అతిథులు, కార్యక్రమాల్లో నూతనత్వం వంటివి బేజారుగా అగుపిస్తాయి. బ్యాంక్వెట్ రోజున 2వేల మందికి ఏర్పాటు చేసిన విందు రుచి శుచి మురిపంచి వహ్వా అనిపించి అతిథులు చేత లొట్టలేయించి…తదుపరి రెండురోజులు హవ్వా అనిపించి అభిరుచిని చంపించి ఆకలిని మట్టికరిపించాయి. పనిదినం కావడంతో రెండో రోజు బాగా చప్పగా సాగిన వేడుకలు సాయంకాలం జొన్నవిత్తుల రచనలో వందేమాత్రం స్వరాల్లో 120 మంది ప్రవాసుల అద్భుత నృత్యంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించి రుచికరంగా మార్చాయి. 5వేల మందితో కిక్కిరిసిన ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటరులో మూడోరోజున ఏర్పాటు చేసిన నాట్యాలు, గీతాలాపన వంటివి ఆకర్షించలేకపోయినా కాసేపు ఆనందపరిచాయని చెప్పుకోవచ్చు. ఇతర ఆకర్షణీయ సాంస్కృతిక కార్యక్రమాలకై ప్రవాసులు చేసిన కృషి అభినందనీయం. ఏడుగురు సినిమావాళ్లు, ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ, ఓ సంగీత దర్శకుడు ఈ సభలకు అతిథులుగా హాజరయ్యారు. విభజన అనంతరం ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు పెద్దసంఖ్యలో ఒకే వేడుకకు హాజరుకావడం ఈ సభల అతిపెద్ద విజయం. ఆంధ్రా-తెలంగాణా సంస్కృతులను వేడుకలు చక్కగా ప్రతిబింబించాయి.


మీ సొమ్ములు మీ బిడ్డల భవిష్యత్‌కు వాడుకోవాలని జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేసిన సూచన మేలైనది. వ్యాపార సంస్థలు రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తున్న నేటి తరుణంలో………..భారతీయ సంస్కృతి-సాంప్రదాయాల పరిరక్షణకు ప్రవాసంలో భారతీయుల గళానికి విలువ ఏర్పడటానికి స్వచ్ఛంద సంస్థలుగా చెలామణిలో ఉన్న తెలుగు సంఘాలు ఇండో-అమెరికన్ల వెనుక నిలబడి చేయుతను ఇవ్వాలని ఆయన చేసిన విజ్ఞప్తి మన్నించదగినది. జర్మనీ వలసదారుల కుటుంబంలో జన్మించిన ట్రంప్ నేడు అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు భారతీయులకు ఆ అవకాశం ఎంతో దూరంలో లేదని ఆయన చేసిన ప్రసంగం కీలకమైనది.సభల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన మరో అంశం – రాజకీయ పార్టీల కంపును ప్రధాన వేదికకు ఎక్కించకపోవడం. మూడోరోజున మూడో అంతస్థులో నాలుగు గోడల మధ్య ఎన్నారై వైకాపా సమావేశాన్ని నిర్వహించుకుని ఆ “ఫ్యాను” గాలి అక్కడే వదిలేసి ప్రధాన వేదిక వరకు తీసుకురాకపోవడం హర్షించదగిన విశేషం.మొత్తమ్మీద సేవ చేస్తూ సంస్కృతిని కాపాడుకోవడానికి కృషి సలుపుతున్నామని ప్రచారం చేసుకునే ప్రవాస తెలుగు సంఘాలు సఖ్యతను ప్రాధామ్య క్రమంలో ముందుకు జరపాలని “సేవ-సంస్కృతి-సఖ్యత” నినాదంతో ఆటా-టాటాలు నిర్వహించిన అమెరికన్ తెలుగు కన్వెన్షన్ గట్టిపాఠాలే చెప్తోంది. నేర్చేది ఎవరో మరి? సేవా కార్యక్రమాలకు సొమ్ములను మరింతగా ఆదా చేసుకునేది ఇంకెప్పుడో మరి? ఆధిపత్య పోరుకు అంతం ఎక్కడో మరి? —సుందరసుందరి(sundarasundari@aol.com)

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com