ఆత్మల కోసం ఢిల్లీ ఆత్మహత్యలు

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ డెత్‌ మిస్టరీపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక్కో చిక్కుముడి విప్పుతున్నారు. ఈ కేసులో తొలినుంచి పోలీసులు అనుమానిస్తున్న లలిత్ చేతిరాతలు, ఇంట్లో లభించిన రాత ప్రతులతో సరిపోలినట్టు గుర్తించారు. అతడి భ్రమలు, ఆత్మల మీద నమ్మకమే 11 మంది కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడే విధంగా ప్రేరేపించాయని తేల్చారు. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఆదివారం 77 ఏళ్ల నారాయణ్ దేవి, ఆమె పిల్లలు, మనుమలు తమ ఇంట్లో ఉరివేసుకుని కనిపించిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహం మంచం మీద పడిఉండగా. 15 ఏళ్ల ఇద్దరు బాలురుతో సహా మరో 10 మంది మృతదేహాలు రైలింగ్‌కు వేలాడుతూ కనిపించాయి. నారాయణ దేవి సహా కుటుంబ సభ్యులెవరూ చనిపోయే ముందు ఎలాంటి పెనుగులాటకు గురికాలేదని పోస్టుమార్టం నివేదికల్లో తేలింది. నారాయణ దేవి చిన్న కుమారుడు లలిత్ చుండవ (45) ఈ సమూహిక ఆత్మహత్యలకు ప్రేరేపించాడని పోలీసులు చెబుతున్నారు. అతడి రాతలు, ‘‘సూచనలు’’ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. పదేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రితో మాట్లాడుతున్నానంటూ అతడు అందర్నీ నమ్మించాడు. తండ్రి ఫోటోతో మాట్లాడుతూ కాగితాలపై ‘‘ పై నుంచి చెబుతున్నట్టుగా’’ కాగితాలపై రాసేవాడు. 2015లో లలిత్ ఇలా రాయడం మొదలు పెట్టాడు. గత కొన్నేళ్లుగా మౌనవ్రతం చేస్తున్న లలిత్.. ఇటీవల తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టు గుర్తించారు. ప్రపంచం నాశనమయ్యే రోజు వస్తోందనీ.. తమ కుటుంబం రక్షింపబడుతుందని ఓ లేఖలో అతడు పేర్కొన్నాడు. ‘‘మీ చివరి ఘడియల్లో, మీ చివరి కోరిక తీరే వేళ, ఆకాశం తెరుచుకుంటుంది. భూమి కంపిస్తుంది. అప్పుడు మీరు భయపడవద్దు. మంత్రాలు మరింత గట్టిగా చదవడం మొదలుపెట్టండి. మిమ్మల్ని కాపాడేందుకు నేను వస్తాను. నేను మిమ్మల్ని కిందికి తీసుకొచ్చి మిగతా వాళ్లకు కూడా సాయం చేస్తాను.’’ అని లలిత్ రాశాడు. తన తండ్రి దగ్గర నుంచి ఈ సందేశం వచ్చిందనీ, అందరూ దీన్ని పాటించాలని లలిత్ తన కుటుంబ సభ్యులకు చెప్పినట్టు భావిస్తున్నారు. మూఢ నమ్మకాలు బలంగా నమ్మే ఈ కుటుంబం, ప్రపంచం అంతమౌతున్నట్టు నిజంగానే నమ్మారని పోలీసులు చెబుతున్నారు. కాగా లలిత్ ఎవరితో మాట్లాడాలన్నా ఎక్కువగా పేపర్ల మీద రాసేవాడనీ, తన షాపు దగ్గరకు వచ్చిన కస్టమర్లతో కూడా అలాగే రాసి చూపించేవాడని బంధువులు, స్నేహితులు చెబుతున్నారు. పానిపట్‌లో నివసించే లలిత్ సోదరి సుజాతా మాట్లాడుతూ. ‘‘వాళ్లంతా ఆత్మహత్య చేసుకున్నారంటే నమ్మలేకపోతున్నాను. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరో నా కుటుంబాన్ని అంతమొందించేందుకు కుట్రపన్నారు. వారెవరో పోలీసులు కనిపెట్టాలి.’’ అని పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com