ఆన్ లైన్ వార్తల్లో అబద్ధాలే ఎక్కువ

అసత్యాలతో నిండిన బూటకపు వార్తలు వేగంగా ఎక్కువ మంది నెటిజన్లకు ఇట్టే చేరువవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. సామాజిక అనుసంధాన వేదికలపై ఎక్కువ మంది వీటిని ఇతరులతో పంచుకోవడమే దీనికి ప్రధాన కారణమని బయటపడింది. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు. 2006 నుంచి 2017 మధ్య ట్విటర్‌లో చక్కర్లుకొట్టిన 1,26,000 వార్తలను వారు విశ్లేషించారు. వీటిలో సింహభాగం రాజకీయ వార్తలదే. వీటిని 30 లక్షల మంది 4.5 లక్షలసార్లుకుపైగా ట్వీట్‌చేశారు. దీంతో నిజమైన వార్తలతో పోల్చినప్పుడు బూటకపు వార్తలను రీ-ట్వీట్‌చేసే అవకాశం 70 శాతం ఎక్కువని వెలుగులోకి వచ్చింది. అంతేకాదు వీటి వేగం నిజమైన వార్తల కంటే 10 నుంచి 20 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. ‘వార్తలకు ట్విటర్‌ ప్రధాన కేంద్రంగా మారుతోంది. కానీ ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ వదంతులే ఇక్కడ కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే ఇవి అసత్య వార్తలేనని తేలుతోంది’అని పరిశోధనలో పాలుపంచుకున్న సినాన్‌ అరల్‌ తెలిపారు. ‘అసత్య వార్తలు ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. అందుకే ఎక్కువ మంది వీటిని రీట్వీట్‌ చేస్తుంటారు. ముఖ్యంగా ఇతరులకు ఇప్పటివరకూ తెలియని వార్తలను షేర్‌చేయాలని ఎక్కువమంది అనుకుంటారు. ఇలాంటి అంశాలు బూటకపు వార్తల్లో పుష్కలంగా ఉంటున్నాయి’అని ఆయన వివరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com