ఆల్ ఈజ్ ఆలియా

ఆలియా భట్‌ గూఢచారిగా మారిపోయింది. ఇండియాకు కళ్లు, చెవులు తానే అయింది. పాకిస్థాన్‌లో భారత్‌ మీద పన్నుతున్న కుట్రలన్నీ రహస్యంగా పసిగట్టి ఇక్కడి అధికారులకు ఉప్పందించడానికి ఆ గడ్డకు కోడలిగా వెళ్లింది. ఆ ఆపరేషన్‌లో ప్రాణాలకు సైతం తెగించడానికి సిద్ధమైపోయింది. ఆలియా అంత సాహసం చేస్తున్నది ‘రాజీ’ చిత్రంలోని తన పాత్ర కోసం. ‘హైవే’ తర్వాత ఆలియా నటిస్తున్న మరో నాయికా ప్రాధాన్య చిత్రమిది. ‘తల్వార్‌’తో దర్శకురాలిగా మెప్పించిన మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. యథార్థ సంఘటనల ఆధారంగా హరీందర్‌ సిక్కా రాసిన ‘కాలింగ్‌ షెహమత్‌’ అనే నవల ఆధారంగా ఇది రూపొందుతోంది. 1971 నేపథ్యంలో జరిగే ఈ చిత్రంలో షెహమత్‌ అనే అమ్మాయిగా నటిస్తోంది ఆలియా. ఇల్లే ప్రపంచంగా బతికే షెహమత్‌ తండ్రి కోరిక మేరకు పాకిస్థాన్‌ సైనికాధికారిని పెళ్లిచేసుకుని వెళ్లి అక్కడ గూఢ చారిగా ఎలాంటి సాహసాలు చేసిందన్నది ‘రాజీ’ కథ. ఆలియా భర్తగా విక్కీ కౌశల్‌ నటించారు. ధర్మ ప్రొడక్షన్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మించిన ఈ సినిమా ప్రచార చిత్రం విడుదలైంది. అందులో ఆలియా నటన, పోరాటాలు, సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో ఆలియా కశ్మీరీ అమ్మాయిగా కనిపించబోతోంది. అందుకోసం ఉర్దూలో అక్కడి యాసలో సంభాషణలు చెప్పేందుకు శిక్షణ తీసుకున్నట్లు చెప్పింది ఆలియా. గూఢచారిగా కనిపించేందుకూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపిందామె. ఆర్మీ అధికారులు ఉపయోగించే జోంగా అనే ఓ రకమైన జీపును నడపడం కూడా నేర్చుకుందట. ఓ కూతురిగా, భార్యగా, గూఢచారిగా విభిన్న ఛాయలున్న పాత్రలో నటించడం కొత్తగా అనిపించిందని చెప్పింది ఆలియా. ఈ చిత్రం మే 11న విడుదలవుతోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com