ఆస్కార్ ఇవ్వాలి

ఉత్తర, దక్షిణ భారత చలన చిత్రపరిశ్రమలు రెండూ కలసి, లాబీయింగ్‌ చేసి ‘రంగస్థలం’ చిత్రాన్ని ఆస్కార్‌ కోసం పంపాలని, లేకపోతే ఈ చిత్రానికి ద్రోహం చేసిన వాళ్లమవుతామని ప్రముఖ కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో రామ్‌చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ విజయోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ‘బాహుబలి’కి చిత్రపరిశ్రమ అంతా ఎలా అండగా నిలబడిందో, ఇప్పుడు ‘రంగస్థలం’కి అలా నిలబడాలని సూచించారు. ‘‘రంగస్థలం మన తెలుగు నేల కథ. మన మట్టి కథ. రాజకీయాల పరంగా వేర్వేరైనా ఇలాంటి చిత్రాలు వచ్చినప్పుడు వాటన్నింటికి అతీతంగా ప్రోత్సహించాలి. హాలీవుడ్‌లో వచ్చిన అత్తుత్యమ చిత్రాలకంటే ‘రంగస్థలం’కి మంచి రేటింగులు వచ్చాయి. ఇలాంటి చిత్రాల వల్ల భావితరాలకు విలువల గురించీ, వాస్తవికత గురించీ అర్థమవుతుంది. మరిన్ని మంచి చిత్రాలు రావడానికి స్ఫూర్తి ఇస్తుంది. నాక్కూడా కొన్ని పాత్రలు చేయాలనిపిస్తుంది. కానీ చేయలేను. పంచెకట్టుకుని సినిమా చేసేంత ధైర్యం నాకు లేదు. అలాంటి పాత్రలో చరణ్‌ కనిపించినందుకు ఆనందంగా ఉంది. చరణ్‌ నాకు తమ్ముడిలాంటివాడు. తను మరిన్ని విజయాలు సాధించాలి…’’ అని పేర్కొన్నారు. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చూశాక అమ్మానాన్నల స్పందన మర్చిపోలేను. కల్యాణ్‌ బాబాయ్‌ ఇంటికివెళ్లి ‘సినిమా చూడండి’ అని చెబుదామనుకున్నా. కానీ ఆయనే ఇంటికి పిలిచి అభినందించారు. జనాల మధ్యన కూర్చుని సినిమా చూడాలని ఉందన్నారు. ‘తొలి ప్రేమ’ థియేటర్లో చూశారు. ఆ తర్వాత నా సినిమానే చూసినందుకు చాలా సంతోషంగా అనిపించింది..’’ అని చెప్పారు. చిట్టిబాబు లేకపోతే రామలక్ష్మి పాత్ర లేదని సమంత చెప్పింది. ఈ సినిమాతో బాలీవుడ్‌కి వెళ్లే అవకాశం దక్కిందన్నారు జగపతిబాబు. చాలామంది నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషి వల్లే ఇంత మంచి సినిమా అందివ్వగలిగానని దర్శకుడు సుకుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్‌, రత్నవేలు, చంద్రబోస్‌, అనసూయ తదితర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com