ఆహారశుద్ధి రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం


భారత ప్రభుత్వం ఆహార శుద్ధి రంగంలో సరైన విధానం ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ఉత్ప‌త్తుల మండ‌లి (ఫుడ్ ప్రాసెసింగ్ జోన్) ఏర్పాటుకు సిద్ధంగా వున్నామని షరాఫ్ గ్రూపు ప్రతినిధులు దుబాయ్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వెల్లడించారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ నెలకొల్పే అంశంపై గతంలోనే ప్రతిపాదనలు ఇచ్చామని, ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాలను పరిశీలించామని తెలిపారు. ప్రస్తుతం యూనిట్ నెలకొల్పేందుకు అవసరమైన భూసేకరణకు ఎదురుచూస్తున్న‌ట్లు పేర్కొన్నారు. లాజిస్టిక్స్ వ్యవహారాల్లో భారత ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం తమకు అంత సానుకూలంగా, తమ అవసరాలకు తగ్గట్టుగా లేదని షరాఫ్ గ్రూపు ప్రతినిధులు అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, ఈ రంగంలో అత్యుత్తమ విధానం కోసం ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి బదులిచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో పాటు ఆహార శుద్ధి పరిశ్రమలకు సంబంధించిన లాజిస్టిక్స్ పైనా దృష్టి సారించినట్టు షరాఫ్ గ్రూపు ప్రతినిధులు వెల్ల‌డించారు. ఆహారశుద్ధి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా రవాణా సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఆహారశుద్ధి పరిశ్రమలకు సంబంధించి భూముల కేటాయింపు తదితర విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా సహకారం అందిస్తుందని, దీనికోసం వెంటనే తమ ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు జరపవచ్చని ముఖ్యమంత్రి వారికి సూచించారు. ఎలాంటి అనుమతులైనా సత్వర ఇవ్వడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని హామీ ఇచ్చారు. అనేక అంశాల్లో ఏపీ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని షరాఫ్ గ్రూపు వైస్ చైర్మన్ ష‌రాఫుద్దీన్ మొహమ్మద్ హుస్సేన్ షరాఫ్ ప్రశంసించారు. త్వరలో తమ సంస్థ అత్యున్నతస్థాయి బృందాన్ని ఏపీకి పంపిస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. దుబాయ్‌లో తమ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాపారవేత్తల సదస్సుకు హాజరు కావాలని హుస్సేన్ షరాఫ్ ఆహ్వానించారు. భారత్‌లో ఇప్పటికే 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన ఫరాఫ్ గ్రూపు, పుణె, లుథియానాలో వ్యాపారాన్ని కేంద్రీకరించింద‌ని, సంస్థ విస్తరణకు తమిళనాడులో ఇప్పటికే భారీగా భూమిని కూడా సేకరించింద‌ని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బృందంలో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, మౌలికవసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్ త‌దిత‌రులు ఉన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com