ఆ ఊరిలో మరణించిన వారు…‘స్వర్గానికే’ వెళ్తారు-TNI ప్రత్యేకం


బ్రతికి ఉన్నంతకాలం సిరిసంపదలతో, భోగభాగ్యలతో అష్టఐశ్వర్యాలతో జీవనాన్ని సాగించిన మనవ జీవితానికి, ప్రాణం పోయిన అనంతరం ఆ దేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి చాలా గ్రామాలు, పట్టణాల్లో ఆరడుగుల భూమి కూడా లేని పరిస్థితులు చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద పట్టణాల్లో సైతం స్మశాన వాటికల కొరత కనిపిస్తుంది. మనిషి మృతి చెందిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించే సమయంలో చాలా ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేక వారి బంధువులు, సన్నిహితులు తీవ్ర ఇబ్బందులుకు గురవుతూ వస్తున్నారు. వీటిని గమనించిన కొంతమంది దాతలు ఆయా గ్రామాల్లో ఉన్న యువకులు మానవ దేహాలకు చివరి నిమిషంలో సంతృప్తికరంగా దహన సంస్కారాలు చేసే విధంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కొంత మంది విదేశాల్లో నివశిస్తున్న ప్రవాసులు తమ గ్రామాల్లో శ్మశాన వాటికలు నిర్మించడానికి పెద్ద ఎత్తున నిధులను అందజేస్తున్నారు. ఒకప్పుడు శ్మశాన వాటికలు అంటే అటువైపు వెళ్ళటానికి కూడా ప్రజలు మామూలు సమయలలో భయపడేవారు. అటువంటిది ప్రస్తుతం దాతల సహకారంతో రూపుదిద్దు కుంటున్న శ్మశాన వాటికలు కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన వనాలుగా దర్శనమిస్తున్నాయి. నిజంగా స్వర్గ లోకాన్నే తలపిస్తున్నాయి. వీటిలో చెప్పుకోదగింది కృష్ణాజిల్లా తిరువూరులో రూపుదిద్దుకున్న స్వర్గపురి ఒకటి. ఇప్పటి వరకు సరైన స్మశాన వాటిక లేని తిరువూరులో దాతల సహకరంతో తిరువూరు పూర్వ విద్యార్ధులు నడుం బిగించి రూ.50 లక్షల వ్యయంతో అందమైన స్వర్గ పురిని నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఈ స్వర్గపురి ఒక పర్యాటక కేంద్రంగా కూడా మారింది. దీనిని రూపొందించిన తిరువూరు పూర్వ విద్యార్దుల కృషిని అన్ని వర్గాల వారు ప్రశంసిస్తున్నారు. తిరువూరు పట్టణంలో మునుకుళ్ల వెళ్లే రహదారిలోని మరుభూమిలో దాతల విరాళాలు రూ.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన స్వర్గపురి శైవక్షేత్రాన్ని తలపిస్తోంది. పచ్చదనంతో పరిఢవిల్లుతున్న హిందూ శ్మశానవాటిక పార్కును మరిపిస్తోంది. ప్రధాన గేటు తీసి లోపలికి అడుగుపెట్టగానే దర్శనమిచ్చే ధ్యాన శివుని నిలువెత్తు విగ్రహం అయినవారిని కోల్పోయి అంత్యక్రియలు నిర్వహించటానికి పుట్టెడు దుఃఖంతో వచ్చేవారికి భక్తిపారవశ్యాన్ని కలుగజేస్తోంది. ఉట్టిపడే ఆహ్లాదకరమైన వాతావరణం శోకతప్త హృదయాలకు బాధ నుంచి ఉపశమనం కల్పిస్తోంది. విశాలమైన రహదారులు ఇరువైపులా పరుచుకున్న పచ్చదనం, కనువిందు చేసే పూలమొక్కలు, రాత్రిపూట ప్రసరించే విద్యుత్తు కాంతులతో మరుభూమి అనే భావనను మరల్చుతోంది. తనువు చాలించి తిరిగి లోకాలకు చేరుకున్న వారికి చివరిగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అంత్యక్రియలు నిర్వహించటానికి పూర్తిస్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. స్నానాల గదులు, మరుగుదొడ్లు మొదలు విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన భవనాలు వితరణశీలురైన దాతల సహకారంతో సమకూరాయి. రెండు ఫ్రీజర్లతో పాటు ఒక మహాప్రస్థానం వాహనం అందుబాటులో ఉంది. మరుభూమి రూపురేఖలు ఒక్కసారిగా మారిపోవటంతో గతంలో అడుగుపెట్టని వారు కూడా వారాంతాల్లో సందర్శించటానికి ఆసక్తి చూపుతున్నారు. ఎట్టకేలకు దాతల ఆర్థిక సహకారంతో తిరువూరు పూర్వ విద్యార్థుల సంఘం (తోసా) సంకల్పం స్వర్గపురి రూపంలో సిద్ధించింది.


















More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com