ఆ పద్ధతి తప్పు

స్వదేశంలో ఫామ్‌ ఆధారంగా దక్షిణాఫ్రికా పర్యటనలో భారత తుది జట్టుకు ఆటగాళ్లను ఎంపిక చేయడం సమంజసం కాదని మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు సాంకేతికంగా మెరుగైన రహానె, రాహుల్‌లను కాదని రోహిత్‌, ధావన్‌లకు అవకాశమివ్వడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో ఫామ్‌ ఆధారంగానే రహానె బదులు రోహిత్‌ను ఎంచుకున్నట్లు కోహ్లి వ్యాఖ్యానించిన నేపథ్యంలో దాదా స్పందించాడు. ‘‘విదేశాల్లో ధావన్‌, రోహిత్‌ల ప్రదర్శన ఏమంత బాగా లేదు. అక్కడ వాళ్లు బాగా తడబడ్డట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుత ఫామ్‌ ఆధారంగా వారిని ఎంపిక చేశామంటున్నారు. కానీ గత కొన్నేళ్లుగా రాహుల్‌, రహానెల రాణించిన విషయాన్ని విస్మరించాల్సింది కాదు’’ అని గంగూలీ అన్నాడు. రెండో టెస్టుకు రహానెను కచ్చితంగా తుది జట్టులోకి తీసుకోవాల్సిందే అన్న సౌరభ్‌.. ధావన్‌, రోహిత్‌లిద్దరినీ టీమ్‌ఇండియా తుది జట్టు నుంచి తప్పిస్తుందా అన్నది సందేహమేనని చెప్పాడు. ‘‘రోహిత్‌, ధావన్‌ల మీద కోహ్లి ఎంతో నమ్మకం ఉంచాడు. వారికి రెండో అవకాశం దక్కకపోవచ్చని అనుకోవడం లేదు. కానీ తొలి టెస్టులో టాప్‌ ఆర్డర్‌, మిడిలార్డర్‌ పూర్తిగా విఫలమయ్యాయి కాబట్టి రహానె వస్తే బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలోపేతమవుతుంది’’ అన్నాడు. స్టెయిన్‌ గాయంతో సిరీస్‌కు దూరం కావడంపై భారత్‌ సంతోషించాల్సిందేమీ లేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ‘‘స్టెయిన్‌ గాయపడటం దక్షిణాఫ్రికాకు వరమే. ఎందుకంటే అతడి స్థానంలో వచ్చే మోరిస్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఉపయోగపడతాడు’’ అని చెప్పాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com