ఇంటింటికీ తిరిగి పాలు పోశాడు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం 20కోట్లు సిద్ధం చేసుకున్నాడు.

తల్‌వార్లు.. రాడ్లతో కొట్టుకోవడం.. బహిరంగంగా దౌర్జాన్యానికి దిగుతుండడం.. పోలీసులనూ బెదిరించడం.. లాంటి మాఫియా సంస్కృతి ఇప్పుడు ప్రశాంతంగా ఉండే ఆదిలాబాద్‌కు పాకింది. ఖాళీ స్థలాల కబ్జా.. నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తులను సొంతం చేసుకోవడం.. అడ్డొచ్చేవారిని బెదిరించడం.. అవసరమైతే దాడి చేయడం ఇక్కడ నిత్యకృత్యాలయ్యాయి. కూతురు పెళ్లికనో, అత్యసవర పనులకు పనికొస్తాయనో చాలామంది ప్లాట్లు కొనుగోలుచేసి ఉంచుకుంటారు. తీరా విక్రయించే సమయంలో అది వేరే వ్యక్తి పేరుతో ఉందని తెలిసి నిర్ఘాంతపోతున్నారు. ఇలాంటివి వందల ఘటనలున్నాయి. ఈ వ్యవహారాల్లో రాజకీయ పార్టీల నేతల హస్తం ఉండడం అక్రమార్కులకు కలిసి వస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చిపోతున్న ఆ ముఠాలు పోలీసులకు సైతం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. జిల్లా కేంద్రానికి పక్కన ఉండే ఓ పంచాయతీ నాయకుడు సైకిల్‌పై ఇంటింటికి తిరుగుతూ పాలుపోసేవాడు. అనతి కాలంలో భూమాఫియా నాయకుడుగా మారి బాగా సంపాదించాడు. ఇప్పుడు రూ.20కోట్లు ఖర్చుపెట్టైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తహతహలాడుతున్నాడంటే పరిస్థితి ఎంతవరకు చేరిందో ఊహించుకోవచ్చు. అతనికి రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు స్థిరాస్తి వ్యాపారంలో దూరి ప్రభుత్వ భూములు అమ్మడం, నకిలీ పత్రాలతో భూములు స్వాధీనం చేసుకోవడం వంటి అరాచకాలతో అనతికాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తారు. ఇంద్రవెల్లి తదితర ప్రాంతాలనుంచి వచ్చిన కొందరు ఇలా రూ.కోట్లు సంపాదించారు. ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గతంలో ద్విచక్ర వాహనంలో పెట్రోల్‌కు సైతం పోయించుకోలేని స్థితిలో ఉండగా నేడు ఏసీ కార్లలో తిరుగుతున్నారు. ఇదంతా నకిలీ పత్రాలతో స్థలాలు ఆక్రమించి సంపాదించిందే. వీరంతా ముఠాలను పోషిస్తూ తమ పని కానిస్తున్నారు. ఇటీవల మావల మండలంలోని కొందరు గల్లీ నేతలు పోలీసులపైనే తిరుగుబాటు చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం గొడవలకు నిలయంగా మారిందని చెప్పవచ్చు. స్థానిక సంస్థలు మొదలు.. సాధారణ ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో రౌడీ మూకల ఆగడాలకు కళ్లెం వేయకపోతే.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పకపోవచ్చు.
నాలుగేళ్ల కిందట మొదలై..
* నాలుగేళ్లకిందట ఆదిలాబాద్‌లో లారీ అసోసియేషన్‌లో ఏర్పడిన గొడవలతో ఒక వ్యక్తిపై దాడిచేసేందుకు సినీ తరహాలో కొందరు యువకులు తల్‌వార్లతో వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి పరుగెత్తి కారులో వెళ్లి ఎమ్మెల్యే ఇంట్లో తలదాచుకోవడం.. ఆయన వాహనాన్ని ధ్వంసంచేయడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఆదిలాబాద్‌లో ఇలాంటి గుండాగిరి ఏంటనే భయం మొదలైంది. తాజాగా అలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
* కాంగ్రెస్‌ హయాంలో ఈ విషసంస్కృతి మొదలు కాగా తెరాస అధికారంలోకి వచ్చాక క్రమక్రమంగా శాఖోపశాఖలుగా విస్తరించింది.
* ఏదైనా వివాదాస్పద భూములుంటే చాలు గ్యాంగులు రంగంలోకి దిగుతున్నాయి. సెటిల్‌మెంట్లు చేస్తామంటు ముందుకు వస్తాయి. మందిమార్బలంతో రంగంలోకి దిగుతున్నాయి.
అన్ని పార్టీలకూ విస్తరించారు
* నాలుగేళ్ల కిందట మావల దగ్గరలో రూ.10కోట్ల విలువైన భూమిని ఓ భాజపా నాయకుడు పట్టపగలే అరాచకముఠాలతో కబ్జాచేయడం ఇప్పటికి చర్చనీయాంశమే.
* ఇద్దరు కాంగ్రెస్‌ నాయకులైతే ఆ ప్రభుత్వ పాలనలో మావల మండలంలోని కేఆర్‌కే కాలనీలో ఇందిరమ్మ పథకం కింద కేటాయించిన అయిదెకరాల భూమిని తమ భూమని అమ్మేశారు.
* మరో ఇద్దరు కాంగ్రెస్‌ నాయకులు కొత్తహౌసింగ్‌బోర్డుకు దగ్గరలో హౌసింగ్‌బోర్డుకు చెందిన ఐదు ఎకరాల భూమిలో దర్జాగా ప్లాట్లుచేసి అమ్మేశారు.
* తాజాగా జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న బాలాజీనగర్‌లో వారం రోజుల క్రితం భూమికి సంబంధించి కొందరు యువకులు దాడిచేసుకోవడం అదికాస్త తెరాస, భాజపా మధ్య గొడవకు దారితీయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇదే ఘటనలో రిమ్స్‌లో బాధితులు చికిత్సపొందుతున్న సమయంలో అధికార పార్టీ గల్లీ నేత ఒకరు పోలీసు అధికారినిసైతం నెట్టేయడం చర్చనీయాంశంగా మారింది. కొంత కాలంనుంచే ఆదిలాబాద్‌లో గ్యాంగులు ఏర్పడడం, గొడవలు జరగడం జోరందుకున్నా పోలీసులు మెతక వైఖరి అవలంబించడంతో ఇది భూ కబ్జాలవరకు పాకింది. మాఫియాను తలపించేలా వ్యవహారాలు కొనసాగుతున్నాయి.
* ఆదిలాబాద్‌ పట్టణాన్ని ఆనుకొని ఉన్న మావల, బట్టిసావర్గాం పంచాయతీ పరిధిలో విలువైన భూములు కనిపిస్తే చాలు వాటిని అమ్మేస్తావా ఆక్రమించెయ్యమంటావా అని బెదిరిస్తున్నారు. ఒక వేళ కాదు లేదు అంటే నకిలీ పత్రాలో కొందరు రంగంలోకి దిగుతున్నారు. భూమి తమదంటు కబ్జాలకు దిగుతున్నారు. చివరకు అసలు పట్టాదారు గిట్టుబాటు కాకున్నా ఎంతో కొంత ధరకు విక్రయించుకోవాల్సి వస్తోంది.
* ఆంధ్రప్రాంతానికి చెందిన ఒకరు అక్కడ కేసులనుంచి తప్పించుకునేందుకు ఆదిలాబాద్‌కు వచ్చి టీచర్‌ కాలనీలో మూడంతస్తుల భవనాన్ని కొనుక్కున్నారు. కొన్నాళ్ల తర్వాత ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన తిరిగి రాకపోయేసరికి ఇటీవల ఆ ఇంటిని బోగస్‌ పత్రాలు సృష్టించి కొంతమంది రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దీని విలువే దాదాపు రూ.3కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇలా రానురాను కబ్జాలకు పాల్పడే వారి సంఖ్య ఎక్కువవుతోంది.
* ఆదిలాబాద్‌ పట్టణం, మావల పంచాయతీకి చెందిన కొందరు యువకులు ఇతరుల ప్లాట్లను తమపేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.
* మావల మండల పరిధిలోని కస్తాల రాంకిష్టు కాలనీలో అటవీ భూములను ప్రభుత్వం తీసుకుని పేదలకు పంపిణీ చేసింది. వీటిని సైతం విక్రయించడం కలకలం రేపింది. వందల సంఖ్యలో ఇలా అమ్మకాలు జరగడంతో అసలు లబ్ధిదార్లు లబోదిబోమంటున్నారు.
* మావల మండలంలోని కస్తాలరాంకిష్టు కాలనీలో పట్టాలు లేకున్నా క్రయవిక్రయాలు జరుగుతుండడంతో కొనుగోలుచేసి ఖాళీగా వదిలిపెట్టిన స్థలాలను అమ్మేస్తున్నారు. అసలు ప్లాటుయజమాని వెళితే పదులసంఖ్యలో జనం పోగై బెరిస్తున్నారు. ఆ కాలనీలోని యువకుడితోపాటు పంచాయతికి చెందిన మరికొందరు ఈ దందా సాగిస్తున్నారు.
* మావల మండల పరిధిలోని 170 సర్వేనంబర్‌లో ఇందిరమ్మ ప్లాట్లలో కొందరు నేతలు, దళారులు ఎమ్మార్వో పేరిట నకిలీ సంతకాలతో పట్టాలు సృష్టించి అమ్మేయడంతో వివాదం రేగింది. దీంతో ఒక్కో స్థలానికి రెండేసి, మూడేసి పట్టాలుండడంతో అక్కడ నిత్యం గొడవలే జరుగుతున్నాయి.
* బట్టిసావర్గాం పంచాయతీ పరిధిలో కొత్త హౌసింగ్‌బోర్డు ప్రాంతంలో భాజపా నాయకుడొకరు, తెరాస నాయకులు, స్థిరాస్థి వ్యాపారులతో కలిసి అసైన్డ్‌ భూముల్లో నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) తీసుకొని ఇళ్లుకట్టి నిర్మిస్తు రూ.కోట్లు సంపాదిస్తున్నారు.
* ఆదిలాబాద్‌ పట్టణానికి దగ్గరలో ఓ ఫంక్షన్‌హాల్‌ పక్కన ఉన్న రూ.10కోట్ల ఖాళీ స్థలాన్ని కబ్జాచేసి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.
* మావల మండలంలోని రాంనగర్‌ కాలనీలో టెలీఫోన్‌ కాలనీ నుంచి రాంనగర్‌కు వెళ్లే రహదారిని ఆక్రమించి 15ప్లాట్లుగా చేసుకుని విక్రయించి.రూ.2కోట్ల విలువైన భూములను ఆక్రమించారు.
* ఆదిలాబాద్‌ పట్టణానికి ఆనుకొని ఉన్న దస్నాపూర్‌లో పాత జాతీయ రహదారికి దగ్గరలో రూ.10కోట్ల విలువైన స్థలాన్ని అమ్మాలని తెరాసకు చెందిన ఓ చోటానేత బెదిరించడం బహిరంగంగా రహస్యం.
* బట్టిసావర్గాం పంచాయతి పరిధిలో కొందరు స్థిరాస్థి వ్యాపారులు ఎస్సీకార్పోరేషన్‌ కేటాయించిన భూముల్లో ప్లాట్లు చేసి అనధికారికంగా విక్రయించారు.
* మావల మండలంలోని సుభాష్‌ నగర్‌ వంతెన సమీపంలో ప్రభుత్వ భూమిలో 9 ప్లాట్లు చేసుకుని వాటికి బోగస్‌ పత్రాలు సృష్టించి కొందరు అధికార పార్టీ కార్యకర్తలు విక్రయించుకున్నారు.
* ప్రస్తుతం మూడు ప్రధాన రాజకీయపార్టీల్లో రౌడీషీటర్లు, కేడీలు, మట్కాఏజెంట్లు ఉన్నారంటే రాజకీయ అండదండలు ఏమేరకు ఉంటున్నాయో అర్థంచేసుకోవచ్చు. ముఖ్యంగా అధికార తెరాసలో ఈ మాఫియాలు ఎక్కువగా ఉన్నారు. పోలీసు సైతం వీరిపట్ల కఠినవైఖరి అవలంభించకపోవడంతోనే వీరు మరింత రెచ్చిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com