ఇదే ఆఖరి టోర్నీ?

పదేళ్ల కిందటి సంగతి. 2008 అజ్లాన్‌ షా కప్‌ హాకీకి సమయం ఆసన్నమైంది. భారత్‌ జట్టు కూడా పోటీపడాలి. ఐతే బీజింగ్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేక తీవ్ర నిరాశలో మునిగిపోయిన వేళ.. జట్టులో చోటును అమ్మేసిన లంచగొండి అధికారి ఉదంతం వెలుగు చూడటంతో భారత హాకీ అతలాకుతలమైంది. కొన్నాళ్ల పాటు మరే టోర్నీలో జట్టును ఆడించకూడదని సమాఖ్య నిర్ణాయానికొచ్చేసింది! ఐతే.. 2009 జూనియర్‌ ప్రపంచకప్‌ ఆడాల్సివున్న నేపథ్యంలో కుర్రాళ్లకు అవకాశం కల్పించేందుకుగాను కుర్ర జట్టును అజ్లాన్‌ షా టోర్నీకి ఎంపిక చేసింది. అప్పటికి కొద్దికాలం నుంచి నిలకడగా జట్టులో ఆడుతున్న సర్దార్‌ సింగ్‌కు పగ్గాలు అందించింది. అందివచ్చిన ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు సర్దార్‌. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన భారత జట్టు సర్దార్‌ సారథ్యంలో ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. పెద్ద టోర్నీల్లో పదమూడేళ్ల తర్వాత భారత జట్టు ఫైనల్‌ చేరడం అదే తొలిసారి. స్వర్ణం గెలవడంలో భారత జట్టు విఫలమైంది గానీ.. మసకబారిన భారత హాకీ అభివృద్ధి దిశగా తొలి అడుగు వేసింది అప్పుడే. సర్దార్‌ సింగ్‌ కెరీర్‌ మేలిమలుపు తిరిగింది అక్కడే. పదేళ్ల విరామం తర్వాత మళ్లీ యువ జట్టుతో అతడు మలేసియాలో అడుగు పెట్టాడు. దశాబ్దం కిందట అతడిపై ఎలాంటి ఒత్తిడి లేదు. జట్టు గెలిచినా ఓడినా పట్టించుకునేవారు లేరు. కానీ ఇప్పుడు అతడు వేసే ప్రతి అడుగుపై, తీసుకునే ప్రతి నిర్ణయంపై నిఘా కళ్లు ఉంటాయనడంలో సందేహం లేదు. అతడి కెరీర్‌ కొనసాగుతుందా లేదా అన్నది తేలేది ఇప్పుడు అజ్లాన్‌ షా హాకీ కప్‌లోనే. రెండేళ్లుగా చోటు నిలబెట్టుకోవడమే కష్టంగా మారిన అతడికి.. గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు హాకీ ఇండియా కెప్టెన్‌గా ఎంపిక చేసిందని సమాచారం. సవాల్‌కు నిలిచేనా..: కొత్త కోచ్‌ మారిన్‌ షోర్డ్‌ యువకులపై నమ్మకం ఉంచుతున్న నేపథ్యంలో సర్దార్‌ అసలు జట్టు ప్రణాళికల్లోనే లేడు. 2016లో కెప్టెన్సీ కోల్పోయిన అతడికి ప్రస్తుతం జట్టులో చోటే కష్టమైంది. వ్యక్తిగత విభేధాలు, ఫామ్‌లేమి కారణాలేవైతేనేం అతడు ఒకప్పటి అంత గొప్పగా ఆడటం లేదన్నది వాస్తవం. 31 ఏళ్ల సర్దార్‌కు ప్రస్తుతం జట్టులో స్థిరమైన పొజిషన్‌ కూడా లేదు. ఓల్ట్‌మన్‌ హయాంలో ఫార్వర్డ్‌లో ఆడిన సర్దార్‌.. ఒలింపిక్స్‌లో తనకిష్టమైన మిడ్‌ఫీల్డ్‌లో ఆడాడు. మన్‌ప్రీత్‌ దూకుడు పెరగడంతో.. కోచ్‌ మారిన్‌ సర్దార్‌ను డిఫెండర్‌గా మార్చేశాడు. చివరికి అతడిని జట్టు నుంచి తప్పించేశాడు. కోచ్‌ యువ తరంపై విశ్వాసం పెట్టుకున్న నేపథ్యంలో కుర్రాళ్ల సవాల్‌కు అతడు ఎలా ఎదుర్కొంటాడన్నది సవాలే. హాకీ ఇండియా ఆలోచనలు ఎలా ఉన్నా మరో రెండేళ్లు ఆటకు వీడ్కోలు పలికే ఆలోచనలు తనకు లేవని సర్దార్‌ స్పష్టం చేస్తున్నాడు. 2020 ఒలింపిక్స్‌లో పోటీపడాలనుకుంటున్నట్లు తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. ‘‘భారత జట్టును నడిపించే అవకాశం లభించడం ఎప్పుడైనా గొప్ప గౌరవమే. మళ్లీ ఇన్ని రోజులకు నాకు ఆ అవకాశం దక్కింది. ఈసారి నేనేంటో నిరూపించుకుంటా’’ అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఈసారి అజ్లాన్‌ షా హాకీలో భారత జట్టు ఎలా ఆడుతుందనే దానికంటే ఎక్కువగా.. సర్దార్‌ సింగ్‌ ఎలా ఆడతాడన్నదానిపైనే అందరి దృష్టి నెలకొంది. సత్తా చాటితే మరికొంత కాలం ఆడొచ్చు.. లేదంటే అతడి కెరీర్‌కు ఇది ఆఖరి టోర్నీ కావొచ్చు..!

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com