ఇద్దరు మాజీ గవర్నర్లతో ఇన్నయ్య సల్లాపాలు

ఇటీవల నేను హైదరాబాదు వచ్చినప్పుడు నాకు సన్నిహిత మిత్రులయిన ఇద్దరు మాజీ గవర్నర్లను కలుసుకుని పాత ముచ్చట్లు చెప్పుకున్నాం.

*** పెందుర్తి రామమోహనరావు
చిరకాల మిత్రులు పెందుర్తి రామమోహనరావు. ఆయన ఇంటికి ఆహ్వానించి చాలాసేపు పాత సంగతులు స్ఫురణకు తెచ్చుకుని సంభాషించారు. మేమిద్దరం గత 40 ఏళ్ళుగా హైదరాబాదులో ఎక్కువగా కలుసుకుంటుండేవాళ్ళం. ఆ తర్వాత ఆయన అమెరికా వచ్చినప్పుడల్లా మా ఇద్దరికీ మిత్రుడయిన ప్రొఫెసర్ ఆలపాటి కృష్ణకుమార్ దగ్గర కలిసి ఎన్నో సంగతులు చెప్పుకుంటూ మాల్ లో నడిచేవాళ్ళం. రామ్మోహనరావు రాష్ట్ర డిజిపిగా చేసినప్పటి నుండి నాకు కుటుంబ మిత్రులు. ఆయన కుమార్తె పెళ్ళి సందర్భంగా నాకు ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ ని వివాహ కార్యక్రమానికి వచ్చి శుభాకాంక్షలు అందజేయవలసిందిగా చూచే బాధ్యత నాది అని ప్రత్యేకంగా కోరారు. ఆ ప్రకారమే నేను నాటి ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ ను తీసుకువెడితే ఎంతో సంతోషించారు. రామ్మోహనరావును నేను అనేక సందర్భాలలో పాత సంగతులు అడుగుతూ లోతుపాతులు తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అరమరికలు లేకుండానే చెపుతుండేవాడు. ఒకటి రెండు సందర్భాలలో మా సభలకు కూడా పిలిచి మాట్లామంటే ఒప్పుకున్నారు. మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో రామ్మోహనరావు, ఆలపాటి కృష్ణకుమార్ మిత్రులుగా వుండేవారు. అప్పటి నుండి నేటి వరకు వారి మిత్రత్వం కొనసాగుతుండగా వారి ఇరువురకూ సహమిత్రుణ్ణైన నేను వారితో కలిసి కాలక్షేపం చేయడం ఆనందదాయకం. రామ్మోహనరావును తన అనుభవాలు రాయమని కోరగా అప్పటికప్పుడే 400 పేజీలు రాశారని ఇంకొక 100 పేజీలు రాసి ముగిస్తానని చెప్పారు. మదరాసు గవర్నర్ గా – జయలలితతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావుతోను ఎంతో సన్నిహితంగా వున్న రామ్మోహనరావును కొన్ని సున్నితమైన ప్రశ్నలు కూడా వేశాను. ఆయన చాకచక్యంగా సమాధానమిచ్చారు. మొత్తంమ్మీద సంభాషణ ఆహ్లాదకరంగా నడిచింది. నా వెంట మా మేనకోడలు మాధవి కూడా వున్నది.

*** కొణిజేటి రోశయ్య
మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను హైదరాబాదులో ఆయన ఇంట కలిసి పాత సంగతులు చెప్పుకున్నాం. నన్ను చూడగానే తెనాలి, ఆచార్యరంగా, మా సోదరుడు విజయరాజకుమార్ మొదలైనవారి విషయాలు సహజంగానే మాటలలో దొర్లాయి. రోశయ్య కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతున్నారు. మా అన్న విజయరాజకుమార్ ని గురించి అడిగినప్పుడు ఆయన చనిపోయాడని చెప్పగా అది ఆయనకి ఆశ్చర్యకరమైన వార్తగా వున్నది. అలాంటి విషయాలు కొన్ని వయసు రీత్యా ఆయన జ్ఞాపకం నుంచి తొలిపోయాయి. మా ఇరువురికీ బాగా తెలిసిన వ్యక్తులను గురించి ప్రస్తావించుకున్నాం. చనువుగా నేను ఒక సలహా చెప్పాను. మీకు అన్నీ గుర్తుండటం లేదు పూర్తిగా మర్చిపోకముందే సుదీర్ఘ జీవితానుభవాలను ఎవరికైనా చెప్పి రాయించండి అన్నాను. ఆయన కాదనకుండా సుముఖంగా వున్నారు. కార్యరూపం దాలుస్తుందేమో చూడాలి. మా మేనకోడలు మాధవి కూడా నాతోపాటు వుండి ఆయన్ను పలకరించింది. రోశయ్యకు చిరకాలంగా వ్యక్తిగత కార్యదర్శిగా తుల్జారాం గత 40 సంవత్సరాల నుండి వున్నారు. ఆయన కూడా చాలా ఆప్యాయంగా స్వాగతం పలికి కొన్ని విశేషాలు చెప్పారు. మదరాసులో గవర్నర్ గా వుండగా నేను ఫోన్ చేసి రోశయ్యతో మాట్లాడిన సందర్భాలు గుర్తు చేశారు. శాసనమండలిలో రోశయ్యగారికి కొన్ని ప్రశ్నలు ప్రసంగాలు రాసి ఇచ్చిన విషయాలు గుర్తుకు తెచ్చుకున్నారు. రోశయ్యకు మా కుటుంబం అంతా బాగా గుర్తున్నది. నవీన, రాజులను గురించి అడిగి తెలుసుకున్నారు. హైదరాబాదు సందర్శనలో రోశయ్యతో ముచ్చటించటం ఆనందదాయకమైన విషయం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com