ఇవంక హైదరాబాద్ పర్యటన ఏర్పాట్ల ముచ్చట్లు

అసలే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె. ముప్పు ఏరూపంలోనైనా ముంచుకురావచ్చు. అందుకే అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె తినే ఆహారాన్ని కూడా క్షుణ్నంగా పరీక్షించాకనే అనుమతించనున్నారు. ఇందుకోసం అమెరికా నుంచి ప్రత్యేక ఫోరెన్సిక్‌ బృందం హైదరాబాద్‌ రాబోతోంది. ఇందుకు అవసరమైన పరికరాలను తీసుకొస్తున్నారు. అసాంఘిక శక్తులు ప్రముఖులు తీసుకునే ఆహారాన్ని విషపూరితం చేయడం ద్వారా తమ లక్ష్యం నెరవేర్చుకునేందుకు ప్రయత్నించవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారు తినే ఆహారాన్ని ముందు శాస్త్రీయంగా పరీక్షిస్తారు. మనదేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని తినే ఆహారాన్ని పరీక్షించాలనే నిబంధన ఉంది. వీరు ఎక్కడ పర్యటించినా ఆయా రాష్ట్రాల ఫోరెన్సిక్‌ బృందం బాధ్యతలు తీసుకుంటుంది. విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు మన ఫోరెన్సిక్‌ నిపుణులే వారు తినే ఆహారాన్ని పరీక్షిస్తారు. ఇవాంక విషయంలో ఆమె రక్షణ బాధ్యతలు చూస్తున్న శ్వేతసౌధం సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు ఆహారాన్ని పరీక్షించడానికి అక్కడ నుంచే ప్రత్యేక ఫోరెన్సిక్‌ బృందాన్ని హైదరాబాద్‌ పంపుతున్నారు. దాదాపు 10మంది నిపుణులుండే ఈ బృందం ఇవాంక పర్యటనకు ఒకరోజు ముందే ఇక్కడకు చేరుకుంటుంది. ఆమెకు ఆహారం వండిపెట్టడానికి ఇప్పటికే ప్రత్యేకమైన వంట సిబ్బంది ఇక్కడకు చేరుకున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌, గోల్కొండ కోటలో జరిగే విందుల్లో ఆమె పాల్గొననున్నారు. ఇక్కడ కూడా అమెరికా ఫోరెన్సిక్‌ బృందం పరీక్షించాకనే ఆమె ఆహారం తినాల్సి ఉంటుంది. ఇవాంక బసచేసే వెస్టిన్‌ హోటల్‌కు మాత్రం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయంలో తయారు చేసిన ఆహారాన్ని సరఫరా చేయవచ్చని తెలుస్తోంది. ప్రధాని మోదీ, ఇవాంకల నగర పర్యటన నేపథ్యంలో ఈనెల 28, 29వ తేదీల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలోని వారు అవసరముంటేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని పేర్కొనగా, సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు కూడా పలు సూచనలు చేశారు. మాదాపూర్‌, పరిసర ప్రాంతాల ఐటీ సంస్థల ఉద్యోగులకు ప్రత్యేక అనుమతులు జారీ చేస్తున్నాయి. రెండు రోజులపాటు ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలని శుక్రవారం ఆదేశాలు జారీచేశాయి. ఇవాంక బస చేయనున్న వెస్టిన్‌ హోటల్‌ కూడా మాదాపూర్‌లోని రహేజా ఐటీ పార్కులోనే ఉండటంతో ఆ ప్రాంతంలోని సంస్థల ఉద్యోగుల రాకపోకలు కష్టంగా మారనున్నాయి. దీంతో కొన్నిసంస్థలు ఇప్పటికే సిబ్బందికి సూచనలు ఇచ్చినట్లు సమాచారం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com