ఈ ఎమ్మెల్యేనే ఆ కామాంధుడు

గత నెలలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచారం కేసు చిక్కుముడి వీడింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగారే ప్రధాన నిందితుడని సీబీఐ తేల్చింది. గతేడాది ఉన్నావ్‌కు చెందిన ఓ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో భాజపా ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. బాధితురాలికి వైద్యపరీక్షలు నిర్వహించి అసలు నిజం తేల్చారు. బాధితురాలి దుస్తులు, ఇతర వస్తువులను పరీక్షల నిమిత్తం అధికారులు ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. అయితే, ఈ నివేదికలు ల్యాబ్‌ నుంచి రాకుండా చేయడానికి ఎమ్మెల్యే అనుచరులు తీవ్రంగా ప్రయత్నించినట్లు సీబీఐ విచారణలో తేలింది. ఈ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోనూ ఎమ్మెల్యే పేరు లేకుండా స్థానిక పోలీసులను ఎమ్మెల్యే అనుచరులు ప్రలోభ పెట్టినట్లూ తెలుస్తోంది. గతేడాది జూన్‌4న తనపై అత్యాచారం చేశాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆయన స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. అప్పటినుంచి బాధితురాలు పలు సార్లు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా ఫలితం లేకపోయింది. గత నెల 3న మళ్లీ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఆమె తండ్రిపై సెంగార్‌ సోదరుడు దాడి చేశాడు. అంతేకాకుండా తిరిగి బాధితురాలి తండ్రిపైనే కేసు నమోదు చేశారు. దీంతో గతనెల 8న బాధితురాలు కుటుంబంతో సహా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేసుకోబోయింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటి వరకూ పోలీస్‌ కస్టడీలో ఉన్న బాధితురాలి తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలికి న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com