ఈ ఖర్చు క్రీడాభివృద్ధికి మళ్లిస్తే బాగుండేదేమో?

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సింధు విజయోత్సవయాత్ర అట్టహాసంగా సాగింది. దారి పొడవునా బాణ సంచాకాలుస్తూ… ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. జయహో సింధు అంటూ నినదించారు. అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ సింధు, కోచ్‌ గోపీచంద్‌ ముందుకు సాగారు. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజతపతకం సాధించిన యువకెరటం పి.వి.సింధు, కోచ్‌ గోపీచంద్‌కు సోమవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో మంత్రులు, అధికారులు సింధుకు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఏపీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు సింధుకు పుష్పగుచ్ఛం అందజేసి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి విజయోత్సవ ర్యాలీ ప్రారంభమైంది. శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, ఆరాంఘర్‌ మీదుగా వూరేగింపు కొనసాగింది. శంషాబాద్‌, రాజేంద్రనగర్‌లో వేలాది మంది విద్యార్థులు, కళాకారులు ప్రజలు,స్థానిక నేతలు అట్టహాసంగా స్వాగతించారు. జాతీయ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. బాణసంచా కాలుస్తూ జయహో సింధు అంటూ నినదించారు. దారిపొడవునా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఓపెన్‌టాప్‌ బస్సులో సింధు, గోపీచంద్‌లు దారి పొడవునా ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. దారి పొడవునా భారీ భద్రత ఏర్పాటు చేసిన అధికారులు వూరేగింపు సందర్భంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు.


More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com