ఉగాది పచ్చడి ప్రత్యేకత

కొత్తదనానికి స్వాగతం చెబుతూ.. ఆరోగ్య రక్షణకు కూడా శ్రీకారం చుట్టే పండుగే ఉగాది. షడ్రుచుల సమ్మేళనంతో మొదలయ్యే ఈ రోజున.. ఆ ఆరు రుచులు మనకు ఎంతో మేలుచేస్తాయని చెప్పడమే ఈ పండుగ పరమార్థం. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్ర్తాలు చెబుతున్నాయి. అది పక్కన పెడితే ఈ పచ్చడితో ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..ఈ ఉగాది పచ్చడిలో.. వేపపువ్వు, చింతపండు, మామిడికాయలు, బెల్లం, మిరియాలు, ఉప్పు వేసి తయారుచేస్తారు. ఈ షడ్రుచుల రుచితో పాటు.. ఆ రుచుల్లో దాగి ఉన్న రహస్యాలేంటో చదవండి.
**వేప
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ వేప పువ్వు బుధుడికి సంబంధించినది. ఇందులో వ్యాధి నిరోధక లక్షణాలు అనేకం. రుతు మార్పు వల్ల పిల్లల్లో వచ్చే ఆటలమ్మ, స్పోటకం, కలరా, మలేరియా సోకకుండా వేప నిరోధకంగా పనిచేస్తుంది. ఒకరకంగా ఇది యాంటీ వైరస్ ప్రొటెక్టర్ అవుతుందన్నమాట. గుమ్మానికి వేపాకులు కట్టడం వల్ల.. కలుషితం లేని స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి వస్తుంది. వేపపువ్వుకు.. రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది.
**బెల్లం
ఇది గురుగ్రహానికి చెందిన వస్తువు. దీంట్లో ఔషధ గుణాలు ఎక్కువ. అందుకే ఆయుర్వేదంలో చాలామందులకు దీనిని అనుపానంగా వాడతారు. ఇక గర్భవతులు బెల్లాన్ని తింటే చాలా మంచిదట. చిటికెడు బెల్లం.. రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలుంటాయి. అది.. అజీర్తి, పొడి దగ్గులాంటి రోగాలు రాకుండా చేస్తుంది. అంతేకాదండోయ్.. గురుడు కలిసిమెలిసి ఉండే గుణాల్ని మన మనసులో పెంపొందిస్తాడు. అందుకే అది బెల్లం ద్వారానే జరుగుతుందన్నమాట.
**మామిడి కాయ
మామిడి ముక్కల్లో తీపి, పులుపులతో పాటు వగరు గుణముంటుంది. ఈ గుణం శుక్రుడికి ప్రతీక. ఈయన సౌందర్యాధిపతి. చర్మం ఆరోగ్యంగా, ముడతలు పడకుండా ఉండేందుకు ఇది బాగా పనికొస్తుంది. విపరీతమైన చలి తర్వాత వేడితో పెదవులు పగుతుంటాయి. మామిడిలోని వగరు దాన్ని నివారిస్తుంది. ఇక ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా చేస్తుంది, చర్మ వ్యాధులు రాకుండా చూస్తుంది.
**చింతపండు
ఇది కూడా శుక్రునికి సంకేతమే. మామిడి ముక్కలతో చింతపండు పులుపు కలిసి మనకు మరింత ఆలోచనా శక్తిని పెంచి సన్మార్గంలో నడిపిస్తుంది. ఫలితం.. టెన్షన్, హడావిడి లేని జీవితాన్ని గడపగలరు. ఈ పులుపు వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతపండు.. మనలో చింతను దూరం చేస్తుంట. మానసిక అనార్యోగమైన, మానసిక చాంచల్యాన్ని కలుగకుండా చూసే బాధ్యత చింతపండుదే!
**మిరియాలు
ఇది కారం గుణం కలిగి ఉంటుంది. ఇవి హయక్షిగ్రీవునికి ప్రీతికరమైనవి. వీటితో తలనొప్పి, కండరాలు, నరాల నొప్పులు మాయమవుతాయి. చిటికెడు మిరియాల పొడి జీర్ణక్రియ సమస్యలను పటాపంచలు చేస్తుంది. ఇవి మొటిమలు తగ్గేందుకు, యాంటీ బయోటిక్‌గానే కాదు.. శరీరంలో ఉండే అధిక వేడికి మిరియాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ఆలోచనాశక్తిని కూడా పెంపొందిస్తాయి.
**ఉప్పు
ఈ లవణం.. రవి, చంద్రుల లక్షణాలను కలిగి ఉంటుంది. రవి ఆరోగ్యానికి, చంద్రుడు మనః శాంతికి కారణం అవుతాయి. కాబట్టి మానసిక అనారోగ్యాన్ని తొలగించడానికి, శారీరక రుగ్మతలను తగ్గించడానికి ఈ రెండూ ఎంతగానో సహకరిస్తాయి. అంతేకాదు.. ఉప్పు లక్ష్మీ స్వరూపం. అక్షయతృతీయ రోజున బంగారం కొనలేని వారు.. కనీసం ఉప్పు అయినా కొనమని పండితులు అంటారు. అందుకే ఈ షడ్రుచుల సమ్మేళనంలో ఉప్పూ ఓ భాగమైంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com