ఉపవాసంలో రోగాలు త్వరగా తగ్గుతాయి

ప్రకృతి ఈ సమస్త సంపదనంతా ఇచ్చింది…. తిని ఆస్వాదించడానికే గానీ, పస్తులుండడానికా?అంటూ కొందనే రుసరుసలాడుతూ ఉంటారు. కానీ, ఎవరైనా ఉపవాసం ఉండడం నిజంగా అవసరమా అంటే అవసరమే! ఎందుకంటే… ఉపవాసం చేయడం అంటే ప్రకృతికి దగ్గరవ్వడమే! ఈ రోజున మనిషి ఎదుర్కొంటున్న పలు అనారోగ్యాలకు ప్రకృతి విరుద్ధ జీవనం గడపడమే కదా కారణం!
**ఖాళీ కావాలి….
పంచభూతాలలో ఆకాశమనే భూతానికి చె ందినదే ఉపవాసం. ఆకాశం అంటే ఖాళీ అని అర్థం. సంచిలో ఖాళీ ఉంటేనే అందులో ఏవైనా వస్తువులను పెట్టుకోగలుగుతాం. సంచీలో ఖాళీ లేదంటే ఆకాశం లేదని అర్థం. మన శరీరంలో సహజంగా ఉండే ఖాళీని రోగపదార్థం ఆక్రమించినప్పుడు మంచి ఆహారం తీసుకున్నా అది ఒంటికి పట్టదు. దీనివల్ల శరీరం శక్తిహీనం కావడంతో పాటు రోగగస్థ్రమవుతుంది. అలా కాకుండా, రోగ పదార్థాన్ని బయటికి పంపించడం ద్వారా తిరిగి ఖాళీ ఏర్పడేలా చేసి, లోనికి మంచి పదార్థాలు శరీరానికి అందేలా చేయడమే ఉపవాసం. పూడుకుపోయిన మురుగు కాలువలో, నీరు కానీ, మురుగు కానీ ముందుకు జరగదు. అంటే ఆ కాలువలో ఆకాశ తత్వం లోపించిందని అర్థం. ఆ మురుగునంతా తొలగించడం అంటే ఆకాశతత్వాన్ని పెంచడం అని అర్థం. మలినాలను తొలగించడం ద్వారా ఆకాశతత్వాన్ని శరీరంలో పెంచడమే ఉపవాసం.
**విరామం దివ్య ఔషధం….
మన శరీరంలోని కీలకావయవాలు గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, రక్తనాళాలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. ప్రకృతి వీటికి అలా అవిశ్రాంతంగా పనిచేసే శక్తిని ప్రసాదించింది. కానీ, జీర్ణకోశం, పేగులు, కాలేయం, క్లోమగ్రంఽథి వంటి అవయవాలకు నిర్విరామంగా పనిచేసే సామర్థ్యాన్ని ప్రకృతి ఇవ్వలేదు. ఇవి ప్రతిరోజూ విశ్రాంతి తీసుకుంటేనే మరుసటి రోజు తిరిగి శక్తిమంతంగా పనిచేయగలవు. ఆ విశ్రాంతి లోపిస్తే ఆ విభాగాల్లో లోపాలు తలెత్తుతాయి. క్రమ క్రమంగా ఆ భాగాలు రోగగ్రస్థమవుతాయి. అందుకే వాటికి విశ్రాంతి నివ్వడం మన ధర్మం. అందులో భాగంగా రాత్రి 12 గంటల పాటు రోజూ వాటికి విశ్రాంతినివ్వాలి. అలా ఇవ్వక పోతే, ఒక దశలో జీర్ణకోశం పనితనం తగ్గిపోతుంది. జీర్ణకోశం పనిచేయకపోవడం అంటే అది అన్ని రోగాలనూ స్వాగతించడమే!
**12 కాదు 24 గంటలు….
మన జీర్ణవ్యవస్థ ఖాళీగా ఉన్న సమయంలోనే వ్యర్థపదార్థాలను బయటికి నెట్టివేయడం, శరీరాన్ని శుభ్రం చేసుకోవడం, కణాలను రిపేరు చేసుకోవడం వంటివి చేస్తుంది. పొట్టలో ఆహారం ఉన్నప్పుడు మనలోని శక్తి అంతా ఆహారాన్ని జీర్ణం చేయడానికే సరిపోతుంది. అందువల్ల రిపేర్‌ చేసుకోవడం సాధ్యం కాదు. శరీరానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పూర్తిగా రిపేరు చేస్తే గానీ, శరీరం ఆ ఇబ్బంది నుంచి బయటపడదు. అయితే పూర్తిస్థాయిలో రిపేరింగు జరగాలంటే, రాత్రి 12 గంటలతో పాటు పగలు 12 గంటలు కూడా అవసరం అవుతుంది. వారానికి ఒక రోజు శరీరానికి ఈ అవకాశాన్ని ఇవ్వాలి. ఇలా 24 గంటలూ తనను తాను బాగు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడమే ఉపవాసం. మనం ఆహారం తీసుకునే మామూలు రోజుల్లో శరీరం పగటి పూట కొత్త కణాలను పుట్టించడం, రాత్రిపూట వయసు దాటిన వాటిని చంపడం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో రాత్రివేళ 12 గంటల పాటు జబ్బుతో ఉన్న కణాలను రిపేరు చేసుకుంటూ ఉంటుంది. అదే ఉపవాసంలో అయితే, పొట్టలో పూర్తిగా ఆహారమే లేని కారణంగా, కణాలు పుట్టడం, చావడం దాదాపు పూర్తిగా ఆగిపోవడంతో శరీరం మొత్తం 24 గంటలూ కణాలను రిపేరు చేసుకోవడానికే కేటాయిస్తుంది.
**ప్రాణశక్తి నిల్వలు…..,
మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణించుకోవడానికి మనలోని ఎంతో ప్రాణశక్తి ఖర్చు అవుతూ ఉంటుంది. మౌలికంగా మన శరీరం నిర్వహించే సమస్త కార్యక్రమాలకు ఈ ప్రాణశక్తే ఇంధనం. ఉపవాసం చేయడం ద్వారా మనలోని ప్రాణశక్తి అంతా పొదుపు అవుతుంది. అలా పొదుపైన ప్రాణశక్తి, మనలోని వ్యర్థపదార్థాల్నీ, రోగకారకాల్నీ విసర్జించడానికి సహకరిస్తూ ఉంటుంది. అందుకే ఉపవాసంలో రోగాలు త్వరగా తగ్గుతాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com