ఉప్పు నిప్పు

ఒకరు ఉప్పు.. మరొకరు నిప్పు. పరస్పర విరుద్ధమైన స్వభావాలు కలిగిన గ్లామర్‌ క్వీన్స్‌ ప్రియాంక చోప్రా, కట్రీనా కైఫ్‌. అందాల ఆరబోతతో ఆరితేరిన వీరిద్దరూ కలసి ఓ చిత్రంలో నటిస్తే ఇక చెప్పేదేముంది.. ప్రేక్షకులకు పండగే పండగ. ప్రియాంక , కట్రీనా కాంబినేషన్‌ను కలపాలనే ఆలోచన ఎవరికీ ఇంతవరకూ ఎందుకు రాలేదో కానీ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఆ సాహసం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన నటించే ‘భరత్‌’ సినిమాలో నటించడానికి ప్రియాంక ఇప్పటికే అంగీకారం తెలిపారు. మరో కీలకమైన పాత్రను కట్రీనా పోషించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 1947 నుంచి ఇప్పటి వరకూ భారత చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల్ని స్పృశిస్తూ సాగే ఈ చిత్రానికి అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకుడు. ఈయన కట్రీనాకు సన్నిహిత మిత్రుడు. జాఫర్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మేరీ బ్రదర్‌ కి దుల్హన్‌’ లో కట్రీనా నటించిన దగ్గరనుంచి వీరిద్దరూ స్నేహితులుగా మారారు. అలాగే ప్రియాంక కూడా జాఫర్‌ మరో సినిమా ‘గుండీ’ లో నటించారు. సో.. ఈ ఇద్దరు హీరోయిన్లు తనకు బాగా కావాల్సిన వాళ్లు కావడంతో వారిద్దరినీ కలపడం జాఫర్‌కు అంత కష్టం కాదని అంటున్నారు. సల్మాన్‌ సినిమాలో అతని పాత్ర డామినేషన్‌ తప్ప మరొకరికి ఛాన్స్‌ ఉండని మాట వాస్తవమే అయినా ఇద్దరు హీరోయిన్ల పాత్రలకూ సినిమాలో సమాన ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. ‘భరత్‌’ చిత్రంలో సల్మాన్‌ ఐదు రకాల గెటప్స్‌లో కనిపిస్తారట! 25 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకూ ఉండే పాత్ర అతనిది. అలాగే ప్రియాంక పాత్ర కూడా 28 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకూ ఉంటుందట. ప్రత్యేకమైన మేకప్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉపయోగించి వీరిద్దరినీ విభిన్నంగా తెరపై చూపించడానికి దర్శకుడు జాఫర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కట్రీనా పాత్ర ఎలా ఉంటుందనేది మాత్రం ఆయన వివరించలేదు. వచ్చే ఏడాదిలో ‘భరత్‌’ చిత్రం విడుదల కానుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com