ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రవాస సంఘాల సందడి-TNI ప్రత్యేకం


ఈ డిసెంబరు నెలలో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలాలలో అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉన్న ప్రవాస తెలుగు సంఘాల వారు ఇక్కడికి తరలి వచ్చి పెద్ద ఎత్తున అట్టహాసంగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆటా, టాటా తెలుగు సంఘాల ఆద్వర్యంలో వచ్చే జులై నెలలో డాలస్ లో పెద్ద ఎత్తున వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. మరొక తెలుగు సంస్థ నాటా ఆద్వర్యంలో జులై మొదటి వారంలో ఫిలడెల్ఫియాలో వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు సంఘాల ఆద్వర్యంలో ఉచిత వైద్య శిభిరాలు, యువజనోత్సవాలు , సాంస్కృతిక మహోత్సవాలు, ఐటీ సదస్సులు, సిని నటులకు అవార్డులు, 5క్రన్ లు ఇతర ఉత్సవాలను ఆటా.. టాటా ..నాటా ఆద్వర్యంలో నిర్వహించారు.
**వై.ఎస్.జగన్ కు అమెరికా సంఘాల ఆహ్వానం
ఆటా, నాటా సదస్సులకు హాజరుకావాల్సిందిగా ఆంధ్రా రాష్ట్రంలో ప్రతి పక్ష నేత వై.ఎస్.జగన్ కు ఆ సంఘాల నేతలు ఆహ్వానాలు అందించారు. జగన్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ, నాయకులకు సినిమా నటులకు, కళాకారులకు కూడా ఆహ్వానాలు అందించారు. వాస్తవానికి ఆటా, టాటా, నాటా ఈ మూడు తెలుగు సంఘాల ఆద్వర్యంలో కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఫిలడెల్ఫియాలో వచ్చే జులై నెలలో మహా సభలు నిర్వహించాలని తోలుత భావించారు. ఈ మూడు సంఘాల నిర్వాహకుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఆటా, టాటా, ఒక జట్టుగాను, నాటా విడిగాను వార్షికోత్సవాలను నిర్వహించుకుంటున్నారు.
**తెలుగు మహాసభల్లోనూ ప్రవాస సంఘాల సందడి
గత 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అమెరికా తెలుగు సంఘాలతో పాటు ఇతర దేశాల నుండి ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలలో ప్రత్యెక ఆకర్షణగా నిలిచారు. 42 దేశాల నుండి 450మంది ప్రతినిధులు తెలుగు మహాసభలకు హాజరుకావడం రికార్డుగా నిలిచిపోయింది. మలేషియా దేశం నుండి అక్కడ తెలుగు సంఘం అద్యక్షుడు డా. అచ్చయ్యరావు సారధ్యంలో దాదాపు 95మంది ప్రతినిధులు మహాసభలకు తరలి రావడం పట్ల తెలుగు బాషా ప్రేమికులు వారిని ప్రత్యేకంగా అభినందించారు. మారిషస్ దేశం నుండి సంజీవ అప్పడు, రామస్వామి తదితరుల ఆద్వర్యంలో దాదాపు ఇరవై మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరయ్యారు. యూకే నుండి దాదాపు యాభై మంది ప్రతినిధులు హాజరై మహాసభల్లో చురుగ్గా పాల్గొన్నారు. అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘం సిలికానాంద్ర ప్రధాన నిర్వాహకులు కూచిభొట్ల ఆనంద్, శాంతి దంపతులు, కొండుభట్ల దీనబాబు, చామర్తి రాజు తదితరులు తెలుగు మహాసభల్లో ప్రత్యెక ఆకర్షణగా నిలిచారు.
**తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం (TDF) ఆద్వర్యంలో గత 24వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన సాంస్కృతీకొత్సవం అట్టహాసంగా జరిగింది. తానా ఆద్వర్యంలో గత 25 వ తేదీన హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సాహితీ సదస్సుకు పెద్ద సంఖ్యలో బాషాభిమానులు హాజరయ్యారు. తానా నిర్వహించిన నవలల పోటీల్లో విజేతలకు ఈ కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. మొత్తం మీద ఈ డిసెంబరు నెలలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రవాస తెలుగు సంఘాల వారు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సందడి చేసారు. వీరు నిర్వహించిన సేవా కార్యక్రమాలు స్థానిక ప్రజల అభిమానాలను చూరగొన్నాయి. మరొక పక్క ఆంధ్రా రాష్ట్రంలో జన్మభూమి పధకం కింద ప్రవాసులు అందించిన విరాళాలతో అమెరికాలో ఆంధ్రా రాష్ట్ర ప్రతినిధి కోమటి జయరాం గత పది రోజుల నుండి రాష్ట్రంలోనే పర్యటిస్తూ వైజాగ్ నుండి విజయవాడ వరకు వివిధ పాటశాలలో డిజిటల్ తరగతి గదులను స్థానిక మంత్రులతో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. అమెరికాలో ప్రముఖ తెలుగు బాషావేత్త, కవి వంగూరి చిట్టెన్ రాజు , న్యూజెర్సీ మంత్రి , ప్రముఖ ప్రవాసాంధ్రుడు చివుకుల ఉపేంద్ర తదితరులు తెలుగు మహాసభలకు హాజరయ్యారు. అమెరికాలో అక్కినేని నాగేశ్వరరావు పేరు మీదుగా ఏర్పాటు చేసిన అవార్డులను ప్రముఖ దర్శకుడు కే. విశ్వనాద్ తదితరులకు అందించారు. తానా మాజీ అద్యక్షుడు తోటకూర ప్రసాద్ సారధ్యంలో ఈ అవార్డుల ప్రధానోత్సవం గత 16వ తేదీన ఏలూరులో కన్నుల పండువగా నిర్వహించారు. మొత్తం మీద రెండు రాష్ట్రాల్లోనూ ఈ నెలలో ఎక్కడ చూసినా ప్రవాస తెలుగు సంఘాల సందడి ఎక్కువగా కనిపించింది. వీరందరికి తెలుగు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. – కిలారు ముద్దుకృష్ణ






More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com