ఎట్టకేలకు నోరిప్పిన మాల్యా. ట్వీట్ల వర్షం కురిపించిన దొరవారు.

కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, దర్యాప్తు ఏజెన్సీలు తనపై ఎగవేతదారు ముద్ర వేశాయని తీవ్ర ఆరోపణలు గుప్పించిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా.. తనకున్న ఆస్తులను అమ్ముకోనైనా బ్యాంకులకు బకాయిలు చెల్లించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నానంటూ మంగళవారం చెప్పుకొచ్చారు. బ్యాంకులకు రుణపడిన రూ.13,900 కోట్ల బకాయిలను చెల్లించడానికి తన ఆస్తులను విక్రయించుకునేలా కోర్టు అనుమతి ఇవ్వాలని మంగళవారం కోరారు. అయితే ఇన్ని రోజులు బకాయిల చెల్లింపులపై ఎలాంటి ప్రకటన చేయకుండా స్తబ్ధుగా ఉన్న మాల్యా.. ఇప్పుడెందుకు నోరు విప్పాల్సి వచ్చిందో తెలుపుతూ బుధవారం మరో ట్వీట్‌ చేశారు. బుధవారం ఉదయం చేసిన ట్వీట్‌ లో ‘ఈ సమయంలోనే ప్రకటన చేయడానికి ఎందుకు ఎంచుకున్నారని చాలామంది అడుగుతున్నారు. నాకున్న సుమారు రూ.13,900 కోట్ల ఆస్తులను అమ్ముకునేందుకు 2018 జూన్‌ 22న కర్నాటక హైకోర్టు ముందు నేను, యూబీహెచ్‌ఎల్‌ కలిసి మా పిటిషన్ దాఖలు చేశాం. ఆ కారణంతోనే ఈ సమయంలో ప్రకటన చేస్తున్నా’ అని పేర్కొన్నారు.

అయితే రెండేళ్ల పాటు తన ఆరోపణలపై మౌనంగా ఉన్న మాల్యా.. అకస్మాత్తుగా ఇలా కాళ్ల బేరానికి ఎందుకు వచ్చారు..? బహిరంగ ప్రకటన వెనుక ఆంతర్యమేంటీ..? అని ఆలోచిస్తే.. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు, కఠినంగా మారుతున్న చట్టాలే అయి ఉంటాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
* గతేడాది దివాలా, బ్యాంక్రప్టసీ చట్టంలో కీలక సవరణలు చేసిన విషయం తెలిసిందే. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు, కంపెనీల ఆటకట్టించేందుకు ఈ సవరణలు చేపట్టింది. ఈ సవరణలకు పార్లమెంట్‌కు ఆమోద ముద్ర వేసింది.
* ఇక ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్‌, బినామీ లావాదేవీల చట్టం కూడా అమల్లోకి వచ్చింది. అంతేగాక.. ఆర్థిక నేరస్థుడిగా పేర్కొన్న తొలి వ్యక్తి కూడా విజయ్‌ మాల్యానే.
* 2016 మాల్యా దేశం విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతడి ఆచూకీ కోసం భారత్‌ తీవ్రంగా యత్నించి.. చివరకు లండన్‌లో ఉన్నట్లు గుర్తించింది. అతడిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నించింది. మాల్యా పాస్‌పోర్టును కూడా రద్దు చేసింది.
* మరోవైపు మాల్యాను భారత్‌కు అప్పగించాలని కోరుతూ భారత దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రస్తుతం బ్రిటన్‌ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసు తుది విచారణ జులై 31న జరగనుంది. మరో కేసు కూడా తుది దశకు చేరకుంది.
ఈ కారణాల వల్లే మాల్యా తాజా ప్రకటన చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా మాల్యా డబ్బులు చెల్లిస్తారా? భారత్‌కు వస్తారా? వేచి చూడాల్సిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com